India's First Rafale Jet: భారత్ చేతికి తొలి రాఫేల్ యుద్ధ విమానం. ఇతర దేశాలను భయపెట్టడానికి కాదు, దేశ ఆత్మరక్షణ కోసమే అని తెలిపిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
వీటిని వేరే దేశాలను భయపెట్టడానికి కొనుగోలు చేయడం లేదని, కేవలం దేశ ఆత్మరక్షణ కోసం రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం సాయుధ దళాల శక్తి సామర్థ్యాలను పెంచడం కోసమేనని రాజ్ నాథ్...
New Delhi, October 09: భారత వైమానిక దళంలోకి మరో పదునైన అస్త్రం రాఫేల్ యుద్ధ విమానం (Rafale Fighter Jet) వచ్చి చేరింది. ఫ్రెంచ్ సంస్థ రూపొందించిన ఈ యుద్ధ విమానాన్ని ఫ్రాన్స్ లోని బోర్డియాక్స్ (Bordeaux) డసాల్ట్ ఏవియేషన్ కార్మాగారంలో భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తొలి రాఫేల్ యుద్ధ విమానాన్ని అధికారికంగా స్వీకరించారు. నిన్న విజయదశమి కావడంతో అక్కడే దానికి ఆయుధ పూజలు కూడా నిర్వహించారు. భారత్ మొత్తం ఇలాంటి 36 రాఫేల్ విమానాలను ఆర్డర్ ఇవ్వగా ఎట్టకేలకు తొలి రాఫేల్ వార్ జెట్ భారత్ కు డెలివరీ అయింది. ఈ వార్ జెట్ల కోసం ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ భదౌరియా యొక్క మొదటి అక్షరాలను సూచిస్తూ తొలి రాఫెల్ యుద్ధవిమానంపై RB001 రాఫెల్, భారత త్రివర్ణం పతాకంతో కూడిన లోగో ఆవిష్కరించబడి ఉంది. రాఫేల్ అంటే ఫ్రెంచ్ భాషలో 'సుడిగాలి' అని అర్థాన్ని సూచిస్తుంది.
యుద్ధ విమానం స్వీకరించిన సందర్భంగా, భారత వైమానిక దళానికి ఇదొక చారిత్రాత్మకమైన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ రోజుగా రాజ్ నాథ్ అభివర్ణించారు. ఈ మల్టీ-రోల్ ఫైటర్ జెట్‌లు భారత వైమానికదళ ఆధిపత్యాన్ని మరింతగా పెంచుతాయని రాజ్ నాథ్ అన్నారు. అయితే వీటిని వేరే దేశాలను భయపెట్టడానికి కొనుగోలు చేయడం లేదని, కేవలం దేశ ఆత్మరక్షణ కోసంఉద్దేశించి, తమ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం కోసం, సాయుధ దళాల శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం కోసమేనని రాజ్ నాథ్ చెప్పుకొచ్చారు. రాఫెల్‌కు పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత రాజ్‌నాథ్ ఆ యుద్ధవిమానంలో కొద్దిసేపు ప్రయాణించారు.
Rajnath's First Sortie on Rafale Fighter Jet
"మా వైమానిక దళం ప్రపంచంలో నాల్గవ అతిపెద్దది. ఇప్పుడు రాఫెల్ మీడియం మల్టీ-రోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ చేరికతో మరింత బలోపేతం అయింది. ఇది మా వైమానిక దళానికి శాంతి భద్రతలను మా ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడటానికి ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతున్నాను" అని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు.
అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుఎల్ మాక్రన్ తో భేటీ అయిన రాజ్ నాథ్, ఇరు దేశాల రక్షణ మరియు వ్యూహాత్మక సంబంధాలపై చర్చించారు. ఈ విమానాల కోసం ఫ్రాన్స్ తో భారత్ కుదుర్చుకున్న ఒప్పందం విలువ భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.59 వేల కోట్లు. ఈ రాఫెల్ విమానాలు కేవలం భారత్ కోసమే ప్రత్యేకంగా తయారు చేస్తుంది. ఈ యుద్ధ విమానం 9.9 టన్నుల మిస్సైల్ ను కూడా మోసుకెళ్ల గల శక్తి సామర్థ్యం గలది, మిస్సైల్ ను బట్టి సుమారు 786 నుంచి 1,650 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలదు.