Jammu And Kashmir: శ్రీనగర్‌లో ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి, ఒక పౌరుడు మృతి, పలువురికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం
భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి....
Srinagar, November 4: జమ్మూ కాశ్మీర్ యూటీ వేసవి రాజధాని శ్రీనగర్ (Srinagar) లో సోమవారం ఉగ్రవాదులు గ్రెనేడ్ పేల్చారు. ఈ దాడిలో ఒక పౌరుడు మృతి చెందగా, డజను మంది వరకు గాయపడినట్లు సమాచారం అందుతుంది. శ్రీనగర్‌లోని లాల్ చౌక్ (Lal Chowk) సమీపంలోని బిజీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ఈ గ్రెనేడ్ దాడి (Grenade Attack) జరిగింది. హరి సింగ్ హై స్ట్రీట్ మార్కెట్ ప్రాంతంలో మధ్యాహ్నం 1:20 గంటలకు ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. గాయపడిన వారిలో, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఆగష్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినప్పటి నుంచి ఇక్కడి పౌరులకు, దుకాణాదారులకు మరియు ట్రాన్స్ పోర్ట్ నిర్వాహకులకు పాకిస్థాన్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. జనజీవనం సాధారణ స్థితికి రాకుండా ఉగ్రవాదులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రోజూవారీ సాధారణ కార్యకలాపాలు నిర్వహించవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
గ్రెనేడ్ దాడి జరిగినానంతరం, శ్రీనగర్ మార్కెట్ పరిసర దృశ్యాలు
ఈ నేపథ్యంలో కాశ్మీర్ ప్రజలను భయకంపితులకు గురిచేస్తూ, తద్వారా ఇక్కడ నిర్బంధ పరిస్థితులు ఉన్నాయి, కశ్మీరి ప్రజల హక్కులను భారత్ అణిచివేస్తుంది అని చూపించే ప్రయత్నం పాకిస్థాన్ చేస్తుంది.
గత వారం, సోపోర్ బస్ స్టాండ్ సమీపంలోని ఇక్బాల్ మార్కెట్ వద్ద ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేయడంతో 19 మంది గాయపడ్డారు. యూరోపియన్ పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందం కాశ్మీర్ లోయ పర్యటనకు ఒక రోజు ముందే ఈ దాడి జరిగింది. ఈ సంఘటనకు ముందు, శ్రీనగర్ లోని కరణ్ నగర్ వద్ద గ్రెనేడ్ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నలుగురు సిబ్బంది గాయపడ్డారు.