NV Ramana Retirement: దేశంలో పెండింగ్ కేసులు పెను సమస్యగా మారాయి, ప్రతి రోజు బిజీగా వాటికోసం ఫైట్ చేశానని తెలిపిన జస్టిస్ ఎన్వీ రమణ, నాలో ఊపిరి ఉన్నంతవరకు రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడతానని వెల్లడి
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నేడు పదవీ విరమణ (NV Ramana Retirement) చేశారు. పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టులో వీడ్కోలు కార్యక్రమంలో (NV Ramana Last Day in Supreme Court) సీజేఐ ఎన్వీ రమణ ప్రసంగించారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువానికి తోడ్పడవోయ్ అనే గురజాడ సూక్తిని ప్రస్తావించారు.
New Delhi, August 26: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నేడు పదవీ విరమణ (NV Ramana Retirement) చేశారు. పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టులో వీడ్కోలు కార్యక్రమంలో (NV Ramana Last Day in Supreme Court) సీజేఐ ఎన్వీ రమణ సుదీర్ఘంగా ప్రసంగించారు.
సొంత లాభం కొంత మానుకుని పొరుగువానికి తోడ్పడవోయ్ అనే గురజాడ సూక్తిని ప్రస్తావించారు. ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెడితే కొద్దికాలంలోనే హింస, వివాదాలకు తావులేని సరికొత్త, స్వచ్ఛమైన ప్రపంచాన్ని చూడగలమని అన్నారు. విశ్వ పౌరులుగా సమష్టిగా ప్రగతిశీల ప్రపంచం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 'నాలో ఊపిరి ఉన్నంతవరకు రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడతాను. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే గురజాడ సూక్తిని నిత్యం గుర్తుంచుకుంటాను' అన్నారు.
సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్ అంశంలో జరుగుతున్న జాప్యం పట్ల ఆయన క్షమాపణలు తెలిపారు. దేశంలో పెండింగ్ కేసులు (NV Ramana pending cases) పెను సమస్యగా మారాయని, కానీ భారతీయ న్యాయ వ్యవస్థను ఒక్క ఆదేశంతో లేదా ఒక తీర్పుతో నిర్ణయించలేమన్నారు. కేసుల లిస్టింగ్, పోస్టింగ్ అంశంలో జాప్యం ( Not Giving Much Attention to Issues With Listing of Cases) జరుగుతోందని, ఆ అంశంపై దృష్టి పెట్టలేకపోయినట్లు ఎన్వీ రమణ అన్నారు. సారీ (I Am Sorry) చెప్పిన ఆయన ప్రతి రోజు బిజీగా ఫైట్ చేసినట్లు వెల్లడించారు.
కోర్టులోని ఆఫీసర్లే ఈ వ్యవస్థ విశ్వసనీయతను కాపాడాలన్నారు. విశ్వసనీయతను రక్షించలేని క్షణం సమాజంలో ప్రజల నుంచి గౌరవాన్ని పొందలేమన్నారు. భారతీయ న్యాయవ్యవస్థ కాలక్రమేన వృద్ధి చెందిందని, దీన్ని ఒక్క తీర్పుతో అభివర్ణించలేమన్నారు. ఈ వ్యవస్థలోని న్యాయమూర్తిని రక్షించే బాధ్యత బెంచ్, బార్ మీదే ఆధారపడి ఉంటుందని ఎన్వీ రమణ తెలిపారు.
కోర్టు సమస్యల్ని పరిష్కరించేందుకు ఆధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరమని ఆయన అన్నారు. బార్ సహకరిస్తేనే కోర్టులో మార్పులు సాధ్యమన్నారు. జూనియర్లను సరైన పథంలో నడిపించాలని ఆయన బార్ సీనియర్ సభ్యుల్ని కోరారు. ఇక తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న కాలంలో దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో సుప్రీం కోలీజియం దాదాపు 224 మంది న్యాయమూర్తులను నియమించినట్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
ఢిల్లీ హైకోర్టుకు సంబంధించి కొలీజియం సిఫారసు చేసిన పేర్లను కేంద్రం ఆమోదిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. న్యాయ సమాజం ఆశించిన స్థాయిలోనే తాను పనిచేశానని అనుకుంటున్నానని చెప్పారు. ‘‘నేను ప్రధానంగా రెండు విషయాలపై దృష్టి సారించాను. ఒకటి.. న్యాయవ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, రెండు న్యాయమూర్తుల నియామకం. సుప్రీంకోర్టులో, కొలీజియంలో నాకు మద్దతునిచ్చిన సోదరీ, సోదర న్యాయమూర్తులకు కృతజ్ఞతలు. మేమంతా కలిసి వివిధ హైకోర్టుల్లో దాదాపు 224 మంది న్యాయమూర్తులను విజయవంతంగా నియమించాం’’ అని ఆయన పేర్కొన్నారు.
2013 సెప్టెంబరు నుంచి 2014 ఫిబ్రవరి దాకా ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించిన రమణ.. ఆ అనుభవం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తనకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. న్యాయనిర్వహణను సవాల్‌గా అభివర్ణించిన ఆయన.. రోస్టర్స్ సిద్ధం చేయడం, కేసులను కేటాయించడం వంటివి ఢిల్లీ హైకోర్టులోనే నేర్చుకున్నట్టు తెలిపారు. రెండేళ్ల క్రితం తాను ఒక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన వచ్చిన సమయంలో ఢిల్లీ బార్ అసోసియేషన్ తనకు అండగా నిలిచిందన్నారు.
అంతకుముందు ఆయన ప్రసంగిస్తూ.... కనీస వసతులు లేని గ్రామం నుంచి తన ప్రస్థానం ప్రారంభమైందని వెల్లడించారు. "12 ఏళ్ల వయసులో నేను తొలిసారి కరెంటును చూశాను. ఓ సాధారణ కుటుంబంలో ఉండే అన్ని కష్టాలు అనుభవించాను. నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు, స్ఫూర్తిదాయకంగా నిలిచిన వారికి రుణపడి ఉంటాను. 17 ఏళ్ల వయసులో విద్యార్థి సంఘం ప్రతినిధిగా వ్యవహరించాను. అంచెలంచెలుగా ఎదుగుతూ సుప్రీంకోర్టు వరకు వచ్చాను.
సత్యమేవ జయతే అనేది నేను నమ్మే సిద్ధాంతం. నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అనేక అవాంతరాలు ఎదురైనా మౌనంగా భరిస్తూ నిలబడ్డాను. నాతో పాటు నా కుటుంబం కూడా ఆవేదనకు గురైంది. కర్తవ్య నిర్వహణలో నా వంతు పాత్ర పోషించానని భావిస్తున్నా. నేను సాధించిన ప్రతి గెలుపులోనూ నా సహచర జడ్జిల భాగస్వామ్యం ఎనలేనిది. నా పదవీకాలంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సహకారం మర్చిపోలేను. సుప్రీంకోర్టులో సహకారం అందించిన సెక్రటరీలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఈ వృత్తిలో అనేక ఒడిదుడుకులు వస్తాయని న్యాయవాదులు గ్రహించాలి. న్యాయవాద వృత్తి కత్తి మీద సాము లాంటిది. ప్రతి పేదవాడికి న్యాయం అందించడమే జడ్జి ప్రధాన లక్ష్యం. నవతరం జడ్జిలపై గురుతర బాధ్యత ఉంది. తదుపరి సీజేఐ జస్టిస్ లలిత్ ఇప్పటికే తన గొప్పతనం నిరూపించుకున్నారు. ఆయనకు నా శుభాకాంక్షలు" అంటూ తన వీడ్కోలు ప్రసంగం సాగించారు.
భావోద్వేగానికి గురయిన సీనియర్ లాయర్ దుష్యంత్ దవే
సీజేఐ ఎన్.వి.రమణ వీడ్కోలు సభలో సీనియర్ లాయర్ దుష్యంత్ దవే భావోద్వేగానికి గురయ్యారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, పార్లమెంట్ మధ్య పరిధులు, సమతౌల్యాన్ని సీజేఐ బాగా ధైర్యంగా పాటించారని దవే అభివర్ణించారు. వెంకట రమణను ఆయన ప్రజా న్యాయమూర్తిగా అభివర్ణించారు. హక్కులు, రాజ్యాంగాన్ని ఆయన నిలబెట్టారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ ‘‘సముద్రం ప్రశాంతంగా ఉంటేనే.. నౌక కదిలేది. మనం ప్రస్తుతం క్లిష్టపరిస్థితుల్లో జీవిస్తున్నాం. ఇలాంటప్పుడు నౌక కదలడం కష్టం. క్లిష్ట సమయాల్లో కూడా సమతౌల్యత పాటించిన వ్యక్తిగా మిమ్మల్ని న్యాయస్థానం గుర్తుంచుకొంటుంది. మీరు కోర్టు గౌరవాన్ని, చిత్తశుద్ధిని కొనసాగించారు. అదే ప్రభుత్వంతో సమాధానాలు చెప్పించింది’’ అని సిబల్ అన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)