Triple Talaq: 'ట్రిపుల్ తలాక్' బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. చట్టరూపం దాల్చిన బిల్లు. ఇకపై భారత్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పడం చట్టరీత్యానేరం.
ఏ ముస్లిం భర్త అయినా తన భార్యకు ఏ రూపంలో కూడా 'తలాక్' చెప్పడం నేరంగానే పరిగణించబడుతుంది...
భారత రాజ్యాంగ అధిపతి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ పంపిన 'ట్రిపుల్ తలాక్' బిల్లును ఆమోదించారు.ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. దీంతో భారత దేశంలో ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టరూపం దాల్చింది. అంతకుముందు ఈ బిల్లుపై పార్లమెంటులో విస్తృత చర్చ జరిగింది. లోకసభలో విశేషమైన సంఖ్యా బలమున్న ఎన్డీయే ప్రభుత్వానికి అక్కడ ఈ బిల్లును ఆమోదింపజేసుకోవటంలో ఎలాంటి కష్టం కలగలేదు. దీంతో జూలై 25, 2019న లోకసభలో సులువుగా ఆమోదం పొందిన ఈ బిల్లును జూలై 30, 2019న రాజ్యసభకు పంపించారు. అయితే ఎగువ సభలో ప్రభుత్వానికి తగినంత బలం లేకపోయినప్పటికీ కొన్ని పార్టీలు ఈ బిల్లుకు ప్రత్యక్షంగా మద్ధతు తెలపకపోయినా, న్యూట్రల్ గా వ్యవహరిస్తూ ఓటింగ్ కు దూరంగా ఉండటంతో 99-84 ఓట్ల స్వల్ప తేడాతో ఈ బిల్లు గట్టెక్కి రాజ్యసభ ఆమోదమూ పొందింది.
కాంగ్రెస్ కు చెందిన కొందరు సభ్యులు, ఎస్పీ, బీఎస్పీ, టీఆర్ఎస్ మరియు వైఎస్ఆర్పీ సభ్యులు ఈ ఓటింగ్ కు దూరంగా ఉన్న వారిలో ఉన్నారు.
గతంలోనే ఈ ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా మోడి సర్కార్ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది. 2017లో సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించినా అది ఎక్కడా అమలు జరిగినట్లు కనిపించలేదు. దీంతో మోడీ సర్కార్ 'ట్రిపుల్ సర్కార్' బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే ఏడాది డిసెంబర్ లో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. అప్పుడే లోకసభ ఆమోదం కూడా పొందింది, అయితే రాజ్యసభలో ప్రభుత్వానికి తగినంత బలం లేకపోవడంతో అది అక్కడే నిలిచిపోయింది. ఎట్టకేలకు 2019లో ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందింది.
ఈ కొత్త చట్టం ముస్లిం కమ్యూనిటిలోని ఆడవారికి వివాహ భద్రతను కల్పించేందుకు ఉద్దేశించబడింది. ఇకపై భారతదేశంలో ఎవరైనా ముస్లిం భర్త తన భార్యకు 'తలాక్ -ఇ- బద్దత్' ద్వారా విడాకులు ఇవ్వడానికి వీలులేదు. ఏ ముస్లిం భర్త అయినా తన భార్యకు ఏ రూపంలో కూడా 'తలాక్' చెప్పడం నేరంగానే పరిగణించబడుతుంది. అతడు తన భార్యకు నోటితో తలాక్ చెప్పినా, ఫోన్లో చెప్పినా, టెక్స్ట్ మెసేజ్ రూపంలో చెప్పినా, మరేఇతర రూపంలో చెప్పినా సరే చట్టపరంగా శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఎవరైనా ముస్లిం భర్త 'తలాక్ -ఇ- బద్దత్' తన భార్యకు విడాకులిస్తే ఆ విషయంపై కేవలం బాధిత మహిళ మాత్రమే కాదు, ఆమె రక్త సంబంధీకులు, దగ్గరి బంధువులు ఎవరైనా కూడా నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఎలాంటి వారెంట్ అవసరం లేకుండానే నిందితుడ్ని అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది అని ఈ చట్టంలో పేర్కొనబడింది.