Phalke Award to Rajinikanth: రజినీ కాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, తలైవాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ; త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ దిల్లీలోని తన నివాసం నుంచి ఈ ప్రకటన చేశారు.....
New Delhi, April 1: తమిళనాడు ఎన్నికలకు మరో ఐదు రోజులు ఉందనగా, నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కు అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే (Dadasaheb Phalke Award) అవార్డును ప్రకటించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ దిల్లీలోని తన నివాసం నుంచి ఈ ప్రకటన చేశారు.
భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటులలో ఒకరైన రజనీకాంత్ జీకి 2019 సంవత్సరానికి # దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. నటుడిగా, నిర్మాతగా మరియు స్క్రీన్ రైటర్‌గా ఆయన చేసిన కృషి విలక్షణమైనది ”అని జవదేకర్ ట్వీట్ చేశారు.
1969లో ఏర్పాటు చేయబడిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతదేశపు సినీరంగంలో అందజేసే అత్యున్నత ప్రభుత్వ పురస్కారం. ప్రతి ఏటా సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఇన్నేళ్లుగా ఫాల్కే అవార్డును కేవలం 50 మంది మాత్రమే అందుకున్నారు. ఈ అవార్డును చివరిసారిగా 2018 లో 'బాలీవుడ్ షహన్ షా' అమితాబ్ బచ్చన్ అందుకున్నారు. గత మూడేళ్లుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు నామినీ ఎవరూ లేకపోగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం రజినీ కాంత్ ను ఎంచుకుంది.
'తలైవార్' కు ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రజినీకాంత్ ఒక విలక్షణ నటుడని ప్రధాని కొనియాడారు.
Here's the tweet by PM Narendra Modi:
2019 సంవత్సరానికి సంబంధించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గత సంవత్సరం ప్రకటించబడి ఉండాలి, అయితే COVID-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. గాయకులు ఆశా భోంస్లే, శంకర్ మహాదేవన్, దర్శకుడు సుభాష్ ఘాయ్, నటులు మోహన్ లాల్, బిస్వాజీత్ ఛటర్జీలతో కూడిన జ్యూరీ 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు రజినీకాంత్ ను నామినేట్ చేసింది.
70 ఏళ్ల రజనీకాంత్ భారతీయ సినీరంగంలో అత్యంత సుప్రసిద్ధ నటుల్లో ఒకరు. 1975లో వచ్చిన తమిళ చిత్రం అపుర్వ రాగంగల్ ద్వారా ఆయన చిత్రసీమలో అడుగుపెట్టారు. బిల్లు, ముత్తు, బాషా, శివాజీ మరియు ఎంటిరాన్ లాంటి సినిమాలు ఆయన సూపర్ స్టార్ కు సరైన నిర్వచనం అనేలా చేశాయి.
రాజకీయాల వైపు మొదటి అడుగు వేసిన మూడు సంవత్సరాల తరువాత, గత డిసెంబరులో రజనీకాంత్ తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు, అలాగే సొంత రాజకీయ పార్టీని ప్రారంభించాలనే తన ప్రణాళికను ఉపసంహరించుకున్నారు. ఇందుకోసం తన ఆనారోగ్య కారణాలను ఆయన ఎత్తిచూపారు.
ప్రస్తుతం రజినీకాంత్ 'అన్నాతే' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.