Sabarimala Case Verdict: శబరిమల కేసుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం, కేసును ఏడుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన అత్యున్నత న్యాయస్థానం, శబరిమలలో భద్రత కట్టుదిట్టం
శబరిమల కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం(Sabarimala Verdict) తీసుకుంది.
New Delhi, November 14: కేరళ(Kerala)లోని శబరిమల అయ్యప్ప ఆలయం(Sabarimala Ayyappa Temple)లోకి మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలంటూ సుప్రీం కోర్టు (Supreme Court)లో దాఖలైన పిటిషన్ సహా, మరో 65 పిటిషన్లపై ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. శబరిమల కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం(Sabarimala Verdict) తీసుకుంది. ఈ కేసును ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాని(seven-judge bench)కి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది.
దాంతో పాటుగా ఈ కేసులో దాఖలైన 65 పిటిషన్లను కూడా విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. తీర్పు సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ (Chief Justice of India Ranjan Gogoi ) మాట్లాడుతూ.. శబరిమల తీర్పు రివ్యూతో పాటు అనేక పిటిషన్లు మా ముందుకు వచ్చాయని చెప్పారు. ప్రతీ ఒక్కరికి మత స్వేచ్ఛ ఉందని, మతంలో అంతర్గత విషయం ఏంటనేది తేల్చడమే తమ ముందున్న పని అని ఆయన అన్నారు.
ప్రతీ ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉంది. ప్రార్థన చేసుకునే హక్కుకు లింగభేదం లేదు. అయితే ఈ కేసు కేవలం ఒక్క శబరిమల ఆలయానికే పరిమితం కాదు. మసీదులో ముస్లిం మహిళలు, బోరాలో పార్శీ మహిళల ప్రవేశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు గతేడాది సెప్టెంబరులో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రివ్యూ పిటిషన్లను సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నారీమన్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసును ఎటూ తేల్చని ఐదుగురు జడ్జీల బెంచ్ ఈ కేసును ఏడుగురు జడ్జీలున్న రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.
ఇదిలా ఉంటే ఈ కేసు తీర్పు నేపథ్యంలో శబరిమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ నెల 16 శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకోనుండటంతో అక్కడ ఏకంగా 10 వేల మందితో భద్రత ఏర్పాటు చేశారు. కాగా గతంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 2న శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించిన విషయం తెలిసిందే.
ఈ సంఘటనతో కేరళ సహా దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులు ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆలయంలోకి ప్రవేశించడానికి మహిళలు చేసిన ప్రయత్నాలను అయ్యప్ప భక్తులు తీవ్రంగా ప్రతిఘటించారు. కేరళ ప్రభుత్వ చర్యలను కూడా భక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. తీర్పును పునఃసమీక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో సుప్రీంకోర్టు రివ్వూ పిటిషన్లకు అనుమతించింది.