Digital Media Rules: సోషల్ మీడియా మరియు OTT ప్లాట్‌ఫాంలకు నూతన మార్గదర్శకాలు జారీ, సందేశాలకు మూలం ఎక్కడ్నించో వెల్లడించాలనే నిబంధన, నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్

ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం సోషల్ మీడియా సంస్థలు ఏదైనా ఒక సందేశం....

Representational Image. (Photo Credits: Pixabay)

New Delhi, February 25:  సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు, OTT ప్లేయర్స్ మరియు డిజిటల్ మీడియాకు సంబంధించి ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021  కింద నూతన మార్గదర్శకాలను కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం సోషల్ మీడియా సంస్థలు ఏదైనా ఒక సందేశం లేదా ట్వీట్ యొక్క మూలాన్ని వెల్లడించాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. అలాగే డిజిటల్ న్యూస్ మీడియాను కూడా నియంత్రణ సంస్థ పరిధిలోకి తీసుకొచ్చింది.

కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ "మేము కొత్తగా ఎలాంటి చట్టాన్ని రూపొందించలేదు. ప్రస్తుతం ఉన్న ఐటి చట్టంలోనే నూతన నిబంధనలను చేర్చాము. ఈ మార్గదర్శకాలను డిజిటల్ ప్లాట్‌ఫాంలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. స్వీయ నియంత్రణే లక్ష్యంగా ఈ నూతన మార్గదర్శకాలను రూపొందించాము" అని వెల్లడించారు.

ఈ నూతన మార్గదర్శకాలు గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి అమలులోకి వస్తాయని అయితే సోషల్ మీడియాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అదనపు మార్గదర్శకాలు మూడు నెలల తర్వాత అమలులోకి వస్తాయని మంత్రి స్పష్టం చేశారు.

 సోషల్ మీడియా కోసం కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు:

 

సోషల్ మీడియాలో ముఖ్యంగా యూజర్ సైజుపై కేంద్రం దృష్టిపెట్టింది. ఫాలోవర్లు ఎక్కువగా ఉండే సోషల్ మీడియా మధ్యవర్తి యొక్క పోస్టులపై సోషల్ మీడియా సంస్థలకు కొత్త నిబంధనలను వర్తింపజేయనున్నారు.

యూజర్ల నుండి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి సోషల్ మీడియా సంస్థలకు ఒక నిర్ధిష్ట యంత్రాంగం ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుంది. సోషల్ మీడియా సంస్థలు ఈ క్రింది యంత్రాంగాన్ని కలిగి ఉండాలి.

చట్టం మరియు నిబంధనలకు లోబడి సోషల్ మీడియా ఫంక్షనింగ్ జరిగేలా  చూసే  చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్,

24 × 7 సమన్వయం కోసం నోడల్ కాంటాక్ట్ పర్సన్.

గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం - రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్.

ఈ అధికారులందరూ భారతదేశ నివాసితులై ఉండాలి.

సోషల్ మీడియాలో ఒక సందేశం ముందుగా ఎక్కడ్నించి వచ్చింది?   ‘ఫస్ట్ ఆరిగేటర్’ ను ట్రాక్ చేయడంతో పాటు, ఆ వ్యక్తి యొక్క చిరునామా మరియు ఫోన్ నెంబరును సోషల్ మీడియా సంస్థలు ప్రచురించాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ లాంటి సందేశాలు పంపే వాట్సాప్ లాంటి సంస్థలు కూడా అవసరమైనప్పుడు చాట్ సందేశాలు వెల్లడించాల్సి ఉంటుంది.

స్వీయ నియంత్రణ పరిధిలో OTT మరియు డిజిటల్ మీడియా

OTT ప్లాట్‌ఫారమ్‌లు మరియు డిజిటల్ న్యూస్ మీడియా స్వీయ నియంత్రణ పరిధిలో ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి సంబంధించే సమస్యల పరిష్కారానికి కూడా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచిస్తుంది.

చలన చిత్రాలకు సెన్సార్ బోర్డు ఉన్నప్పటికీ, OTT ప్లాట్‌ఫారమ్‌లలో సినిమాలకు వయస్సు ఆధారంగా కంటెంట్‌ను వర్గీకరించాల్సిన అవసరం ఉంది. OTT ప్లేయర్స్ 13+, 16+ మరియు 'అడల్ట్స్ ఓన్లీ' ఆధారంగా చిత్రాలను వర్గీకరించాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇందుకోసం ఎలాంటి సెన్సార్‌షిప్‌ను తీసుకురావడం లేదని స్పష్టం చేసింది.

ఇక డిజిటల్ మీడియాలో వార్తల ప్రచురణకు సంబంధించి “ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరియు కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ , ప్రోగ్రామ్ కోడ్ ప్రకారంగా జర్నలిస్టిక్ ప్రవర్తన యొక్క నిబంధనలను పాటించాలి.

డిజిటల్ మీడియాపై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అధికారిని నియమించాలి. బాధితుల సమస్యకు వారు బాధ్యత వహించాలి. ఫిర్యాదు అందుకున్న 15 రోజుల్లోపు ఆ అధికారి తగిన నిర్ణయం తీసుకోవాలి.

ఈ రకంగా సోషల్ మీడియా సంస్థలు, డిజిటల్ మీడియా సంస్థలు స్వీయ-నియంత్రణ విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని, వాటికి సంబంధించి ప్రతి నెల నివేదిక సమర్పించాలని కేంద్రం నుంచి నూతన మార్గదర్శకాలు జారీ అయ్యాయి.