BBC Documentary on PM Modi: శక్తివంతమైన భాగస్వామ్య విలువల గురించే మాకు తెలుసు, భారత ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ గురించి తెలియదని తేల్చి చెప్పిన అమెరికా
ఇది వివాదాస్పదం కూడా అయిన సంగతి విదితమే. ఈ డాక్యుమెంటరీపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది
New Delhi, Jan 24: 2002 గుజరాత్ అల్లర్లు, ఆ ఉదంతంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. ఇది వివాదాస్పదం కూడా అయిన సంగతి విదితమే. ఈ డాక్యుమెంటరీపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ గురించి తమకు తెలియదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు.
భారత్-అమెరికా బలమైన ప్రజాస్వామ్య దేశాలుగా ఉండటానికి కారణమైన భాగస్వామ్య విలువల గురించే తనకు తెలుసని చెప్పారు. మీరు అడుగుతున్న బీబీసీ డాక్యుమెంటరీ గురించి నాకు తెలియదు. కానీ భారత్-అమెరికా భాగస్వామ్య విలువల గురించి బాగా తెలుసు.
వీటి వల్లే రెండు దేశాలు బలమైన ప్రజాస్వామ్య, అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఉన్నాయి. ఇండియాలో జరిగిన పరిణామాల గురించి గతంలోనే కొన్ని సందర్భాల్లో మాట్లాడాం.' అని ప్రైస్ పేర్కొన్నారు. భారత్-అమెరికా అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు కావడానికి రాజకీయ, ఆర్థిక కారణాలతో పాటు ప్రజా సంబంధాలు అత్యంత ముఖ్యమైనవని ప్రైస్ వివరించారు.
2002 గుజరాత్ అల్లర్లు, ఆ ఉదంతంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించింది. అల్లర్లకు మోదీనే బాధ్యుడని బ్రిటన్ ప్రభుత్వ రహస్య విచారణలో తేలిందని అందులో పేర్కొన్నది. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరిట రూపొందించిన రెండు భాగాల్లో మొదటి ఎపిసోడ్‌ను ఇటీవల యూట్యూబ్ (ఇండియా)లో అప్లోడ్ చేసింది. అయితే, అప్లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే కేంద్ర ఐటీశాఖ ఈ వీడియోను తొలగించింది.
డాక్యుమెంటరీలోని అంశాలను కేంద్రం ఖండించింది. ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేయడానికి, ప్రచారంలో భాగంగానే బీబీసీ ఈ డాక్యుమెంటరీ తీసుకొచ్చిందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ధ్వజమెత్తారు. కాగా, 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ పాత్ర గురించి వాదనలను పరిశీలించడం ఈ డాక్యుమెంటరీ ఉద్దేశంగా రూపకర్తలు వెల్లడించారు.