Uttarakhand Political Crisis: సీఎం రావత్ రాజీనామాతో చిక్కుల్లో బీజేపీ, హర్యానా రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్న కాంగ్రెస్ పార్టీ, రైతుల ఆందోళనతో బీజేపీ వర్గాల్లో గుబులు
బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని (No-confidence motion in Haryana assembly) ప్రవేశపెట్టిడంతో నేడు అసెంబ్లీలో ఓటింగ్ జరుగనుంది.
Dehradun, March 10: వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్‌లో రాజకీయ సంక్షోభం (Uttarakhand Political Crisis) నెలకొంది. ముఖ్యమంత్రిగా మరో పది రోజుల్లో నాలుగేండ్లు పూర్తి చేసుకోనున్న త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం అనూహ్యంగా తన పదవికి రాజీనామా (Trivendra Singh Rawat Resigns) చేశారు. సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ బేబీ రాణి మౌర్యకు రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామాను ఆమోదించిన గవర్నర్.. తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకునేంత వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని రావత్‌ను కోరారు.కాగా రాష్ట్రంలో ఎన్డీ తివారీ (కాంగ్రెస్) మినహా ఏ సీఎం ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకోలేదు.
బుధవారం ఉదయం 10 గంటలకు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరుగనున్నది. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు. రాష్ట్ర మంత్రి ధన్‌సింగ్ రావత్, ఎంపీలు అజయ్‌భట్, అనిల్ బలూనీలు రేసులో ఉన్నప్పటికీ.. ధన్ సింగ్‌కే తదుపరి సీఎం అయ్యే చాన్సుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజీనామా సమర్పించే ముందు తన అధికార నివాసంలో మంత్రులు ధన్‌సింగ్, మదన్ కౌశిక్ సహా పలువురు సన్నిహితులతో రావత్ సమావేశమయ్యారు.
రాజీనామ అనంతరం సీఎం రావత్ మీడియాతో మాట్లాడారు. ‘చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఉత్తరాఖండ్‌కు సేవచేసే సువర్ణావకాశం నాకు దక్కింది. నా తండ్రి సైనికుడు. మాది చిన్న గ్రామం. కింది స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తకు కూడా ఇలాంటి గొప్ప అవకాశం లభించడం బీజేపీతోనే సాధ్యం. అయితే ఈ అవకాశం మరొకరికి ఇవ్వాలని పార్టీ సమిష్టిగా నిర్ణయించింది. బాధ్యతలు ఎవరికి అప్పగించినా.. నా పూర్తి సహకారం అందిస్తా’ అని ఆయన పేర్కొన్నారు.
సీఎం పదవికి రావత్ రాజీనామా చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందించింది. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ రాజీనామా అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించింది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విషయంలో విఫలం చెందామని ఈ రాజీనామాతో బీజేపీ అంగీకరించిందని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దేవేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని రాష్ట్రపతిని డిమాండ్ చేశారు.
2000 నవంబర్‌లో ఉత్తర ప్రదేశ్ నుంచి విడిపడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఇప్పటివరకు కాంగ్రెస్ నేత ఎన్‌డీ తివారీ మినహా ఏ ముఖ్యమంత్రి కూడా పూర్తిగా ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగకపోవడం ఉత్తరాఖండ్ ప్రత్యేకత. 2017, మార్చి 18న రావత్ ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
అంతకుముందు జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకుగాను 57 సీట్లను బీజేపీ గెలుచుకుంది. సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌పై అసమ్మతి పెరుగుతోందన్న సమాచారంతో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, పార్టీ నేతల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు రమణ్‌సింగ్, దుష్యంత్ గౌతమ్‌లను పార్టీ నాయకత్వం గత శనివారం రాష్ట్రానికి పంపించింది.
ఇక హర్యానా రాష్ట్రంలో అధికార బీజేపీ కూటమి చిక్కుల్లో పడింది. బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని (No-confidence motion in Haryana assembly) ప్రవేశపెట్టిడంతో నేడు అసెంబ్లీలో ఓటింగ్ జరుగనుంది. మొత్తం 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలుండగా, మిత్రపక్షం జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి 10 మంది శాసనసభ్యులున్నారు. బీజేపీపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోవాలి అంటే 45 మంది సభ్యుల మద్దతు అవసముంటుంది.
సంఖ్యాపరంగా చూస్తే బీజేపీ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేనప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రానికి చెందిన రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలను చేపడుతన్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలైన చోటు చేసుకోవచ్చని నిఘా వర్గాల సమాచారంతో కాషాయ కూటమి అలర్ట్ అయ్యింది.
కాగా, 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అధికార కూటమికి 50 మంది శాసనసభ్యులు, కాంగ్రెస్‌కు 30, ఇతర పార్టీలకు 8 మంది శాసనసభ్యులున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేపు తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరుకావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విప్ జారీ చేశారు. ఇటు బీజేపీ, జేజేపీ లు కూడా విప్ జారీ చేసాయి. బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని మిత్రపక్షం జేజేపీ ఇదివరకే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.