
Vijayawada, Mar 7: సూపర్ సిక్స్ పథకాల (Super Six Schemes) పేరిట గత ఏడాది టీడీపీ (TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. సూపర్ సిక్స్ పథకంలో కీలకమైన ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ స్కీం ఇంకా అమల్లోకి రాలేదు. ఈ పథకంలో లబ్దిదారులు ఎవరు? విధి-విధానాలు ఎలా ఉంటాయి? అనే విషయాలు కూడా ఇంకా తెలియరాలేదు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గురువారం శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు. ఉచిత బస్సు పథకం మహిళలకు రాష్ట్రమంతటా అందుబాటులో ఉండదని తేల్చిచెప్పారు. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నట్టు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కచ్చితంగా ఉంటుందని, అయితే, ఒక జిల్లా వారు మరో జిల్లాలో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై గురువారం శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సంధ్యారాణి ఇలా బదులిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ విషయంపై స్పష్టత ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
ఉచిత బస్సు ప్రయాణం పథకం.. బాంబ్ పేల్చిన మంత్రి సంధ్యారాణి
— Newsmeter Telugu (@NewsmeterTelugu) March 7, 2025
జిల్లా దాటితే, అంతే
మంత్రి గుమ్మడి సంధ్యారాణి తాజా వివరణ ప్రకారం ఏపీలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాలోకి ప్రయాణాలు చేయాలనుకునే మహిళామణులకు సూపర్ సిక్స్ స్కీం కింద ఉచిత బస్సు ప్రయాణం వర్తించబోదని, దీంతో వాళ్లు టికెట్ చార్జీలు చెల్లించాల్సిందేనని విశ్లేషకులు చెప్తున్నారు. ఉదాహరణకు కృష్ణ జిల్లాలోని విజయవాడ నుంచి గుంటూరు జిల్లాలోని మంగళగిరికి వెళ్లాలంటే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వర్తించదని, జిల్లా దాటి ప్రయనించడమే దీనికి కారణమని వాళ్లు చెప్తున్నారు. కాగా, తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు రాష్ట్రమంతటా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం తెలిసిందే.