
హైదరాబాద్‌లోని మాధాపూర్‌లో నడుస్తున్న కాల్ సెంటర్‌లో అమెరికా పౌరులను మోసగిస్తున్న రాకెట్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) బుధవారం సాయంత్రం దాడి చేసి బయటపెట్టింది.TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ మోసం కైవాన్ పటేల్, గుజరాత్‌కు చెందిన రూపేష్ కుమార్ అలియాస్ జడ్డూ ఆధ్వర్యంలో నడిచింది. అతనికి సహాయంగా రూపేష్ కుమార్ సోదరుడు విక్కీ (దుబాయ్‌లో ఉంటున్నాడు) మరియు మరో వ్యక్తి ఆజాద్ ఉన్నారు. ప్రధాన నిందితురాలు చంద మనస్విని (36) ‘ఎక్సిటో సొల్యూషన్స్’ అనే కంపెనీ స్థాపించి, మాధాపూర్‌లో ఓ భవనంలో అంతస్తును అద్దెకు తీసుకుని ఈ కేాల్ సెంటర్‌ను నిర్వహించింది.
ఈ సంస్థలో 63 మంది ఉద్యోగులు పని చేసేవారు, ఇందులో 40 మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు. వారికి నెలకు ₹30,000 జీతం, రవాణా, వసతి సదుపాయాలు అందించేవారు.ఇక్కడి టెలి-కాలర్లు పేపాల్ ప్రతినిధుల్లా నటించి, అమెరికా పౌరులకు వారి అకౌంట్‌లలో అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని చెప్పి, వారి సున్నితమైన వ్యక్తిగత వివరాలను సేకరించేవారు.
ఆ సమాచారం ఆధారంగా వారి ఖాతాల్లోని డబ్బును ఖాళీ చేసి, ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించేవారు. ప్రతి ఉద్యోగి రోజుకు కనీసం 10 మందిని మోసం చేయాల్సి ఉండేది. మొత్తం రోజుకు 600 మంది వరకు ఈ మోసానికి గురయ్యే వారు. దొంగిలించిన డబ్బును క్రిప్టోకరెన్సీగా మార్చి ఇతర డిజిటల్ వాలెట్లకు పంపేవారు.
Hyderabad-Based Call Centre Dupes US Citizens; Telangana Cyber Security Bureau Busts Racket
Hyderabad-Based Call Centre Dupes US Citizens; Telangana Cyber Security Bureau Busts Racket
A Hyderabad-based call centre involved in defrauding US citizens was busted by the Telangana Cyber Security Bureau (TGCSB) following a raid at a Madhapur building on Wednesday evening.… pic.twitter.com/7WSNef2JGc
— Sudhakar Udumula (@sudhakarudumula) March 6, 2025
ఈ మోసానికి పేపాల్ కస్టమర్ డేటాను అందించిన కొంతమంది ఉన్నారని అనుమానం. "టెలి-కాలర్లు అందరూ ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం కలిగి, బాధితులను ప్రభావితం చేసేలా ప్రత్యేకంగా శిక్షణ పొందారు. తమ పని చట్టవిరుద్ధమనే విషయం వారికి తెలుసు" అని అధికారులు తెలిపారు.దాడి సమయంలో 52 ల్యాప్‌టాప్‌లు, 63 మొబైల్ ఫోన్‌లు, 27 ఉద్యోగుల ఐడీ కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూపేష్ కుమార్‌ను అరెస్ట్ చేసేందుకు అధికారులు ఇంకా గాలిస్తున్నారు.