SC/ST & CAB Bills: నియోజకవర్గాల ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడగిస్తూ కేంద్ర కేబినేట్ నిర్ణయం, పౌరసత్వ సవరణ బిల్లుకూ కేబినేట్ గ్రీన్ సిగ్నల్
ముస్లింలకు మినహాయింపు ఇవ్వడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి, అలాగే ఇతర దేశాల వారిని దేశ పౌరులుగా గుర్తిస్తే స్థానికంగా తమ హక్కులు దెబ్బతింటాయని కొన్ని వర్గాల ప్రజలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు....
New Delhi, December 4: లోక్‌సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలలో షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు (SC/ST) రిజర్వేషన్లను మరో పదేళ్ల వరకు పొడగించే తీర్మానానికి కేంద్ర కేబినేట్ (Union Cabinet) బుధవారం ఆమోదం తెలిపింది. నియోజక వర్గాల ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల గడువు 2020, జనవరి 25తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ రిజర్వేషన్లను మరో పదేళ్ల పాటు పొడగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తుంది.
ఇక ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగ సవరణల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుండగా, ఈ వర్గాలలో ఉద్యోగావకాశాలకు సంబంధించి రిజర్వేషన్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించేలా అధికారాలు ఇవ్వనున్నారని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా, పౌరసత్వ సవరణ బిల్లుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. క్యాబ్ (CAB -Citizenship Amendment Bill) గా పిలువబడే ఈ బిల్లును ఈ సెషన్ లోనే మరో రెండు మూడు రోజుల్లో డిసెంబర్ 9లోపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
పౌరసత్వ సవరణ బిల్లు అంటే ఏమిటి?
మత ఘర్షణల కారణంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి పారిపోయి డిసెంబర్ 31, 2014 లోపు భారతదేశంలోకి ప్రవేశించిన ముస్లిమేతరులకు (non-Muslims) ప్రత్యేకంగా భారత పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించినబడిన బిల్లు ఇది.
అయితే ఈ బిల్లు పట్ల ఈశాన్య రాష్ట్రాల (North-east India) లోని కొన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. ఆయా ప్రాంతాల నేతలు పార్లమెంటులో ఈ బిల్లును వ్యతిరేకించేందుకు సిద్ధమవుతున్నాయి. అక్రమవలస దారులను ఏరివేస్తాం అని అమిత్ షా ప్రకటన- ఇదే వారి భయానికి కారణమా?
ఈ పౌరసత్వ సవరణ బిల్లు ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, మరియు క్రైస్తవ మతస్తులకు చెంది ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ నుంచి దేశంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులను భారతదేశ పౌరసత్వానికి అర్హులు.
పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర ప్రజలను భారతీయ పౌరులుగా గుర్తించడమే లక్ష్యంగా ఈ బిల్లును ప్రవేశ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో 1955 పౌరసత్వ చట్టం బిల్లుకు సవరణలు చేయనున్నారు.
అయితే, పౌరసత్వం పొందటానికి దరఖాస్తు దారుడు బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘనిస్తాన్ నుంచి మాత్రమే వలస వచ్చి, గత 12 నెలల పాటు భారతదేశంలో స్థిరంగా నివసించి ఉండాలి. అలాగే ముస్లిం మతస్తుడు కాకూడదు, పైన చెప్పిన ఆరు మతాలలో ఏదైనా ఒక చెందిన వాడై ఉండాలి అనే నిబంధనలు ఉన్నాయి.
ఈ బిల్లు దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది మరియు పౌరసత్వ సవరణ బిల్లు యొక్క లబ్ధిదారులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా నివసించవచ్చు.
ఇదిలా ఉండగా, ఈ బిల్లులో ముస్లింలకు మినహాయింపు ఇవ్వడం పట్ల విమర్శలు తలెత్తుతున్నాయి. మత విశ్వాసం ఆధారంగా ప్రజల పట్ల వివక్షత చూపటం రాజ్యాంగ విరుద్ధం అంటూ కొన్ని వర్గాల వారు ఈ బిల్లును వ్యతిరేకిస్తుండగా, ఇతర దేశాల వారిని దేశ పౌరులుగా గుర్తిస్తే స్థానికంగా తమ హక్కులు దెబ్బతింటాయని కొన్ని వర్గాల ప్రజలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)