Budget Session 2020: పరిస్థితులు ఎలా ఉన్నా, భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠమైనది. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ భారత్ లక్ష్యం, పౌరసత్వ సవరణ చట్టం చారిత్రాత్మకమైనది, ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
CAA) చారిత్రాత్మకమైనది అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ కోరిక సిఎఎ ద్వారా నెరవేర్చబడిందని అన్నారు. గాంధీ స్పూర్థితో పాకిస్థాన్ నుండి శరణార్థులుగా వచ్చిన హిందూ, సిక్కు, క్రైస్తవ మతస్తులకు పౌరసత్వం కల్పించడం మన కర్తవ్యం అని రామ్ నాథ్ అన్నారు.....
New Delhi, January 31: పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు (Budget Session 2020) శుక్రవారం ప్రారంభమైనాయి. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (President Ram Nath Kovind) ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్కాడుతూ నవభారత నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అలాగే కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన చట్టాలు మరియు సవరణలను రాష్ట్రపతి ప్రస్తావించారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఉన్నా, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్షంగా భారత్ తన వాటాదారులతో కలిసి బలమైన ప్రయత్నాలు చేస్తుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో పురోగతి సాధించే అవకాశం ఉందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు.
'సబ్ కా సాత్ సబ్ కా వికాస్' నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35ఎ లను రద్దు చేయడం, పార్లమెంటు ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో మద్ధతు ఇవ్వడం చారిత్రకం. దీని వల్ల జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ అభివృద్ధికి మార్గం సుగమం అయింది. తద్వారా దేశంలో అమలయ్యే పథకాలన్నీ కశ్మీర్ కు కూడా వర్తిస్తున్నాయని వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ లలో, కనెక్టివిటీ, ఇరిగేషన్, హాస్పిటల్స్, టూరిజం పథకాలు మరియు ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి ఉన్నత విద్యాసంస్థలను స్థాపించే పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి అని రాష్ట్రపతి తెలిపారు.
వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించారు, ఆ ప్రాంతాల్లో రైల్వే వ్యవస్థ మెరుగుపడింది. ఇటీవలే బోడో శాంతి ఒప్పందం కూడా కుదిరిందని తెలిపారు. ఐదు దశాబ్దాల బోడో సమస్యను అంతం చేయడానికి కేంద్ర మరియు అస్సాం ప్రభుత్వాలు బోడో గ్రూపులతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని వివరించారు.
పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ బిల్లును మరో పదేళ్లు పొడగించారని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో భారత్ చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల భారతదేశం యొక్క అంతర్జాతీయ ర్యాంకింగ్ అనేక రంగాలలో అపూర్వంగా మెరుగుపడింది. ప్రభుత్వం ప్రారంభించిన స్టార్టప్ పథకాల గురించి ప్రస్తావిస్తూ, "ఈ రోజు, ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారతదేశంలో ఉంది. స్టార్ట్-అప్ ఇండియా ప్రచారం కింద దేశంలో 27 వేల కొత్త స్టార్టప్‌లు గుర్తింపు పొందినట్లు రాష్ట్రపతి వెల్లడించారు.
ట్రిపుల్ తలాక్ పై నిషేధం ద్వారా మైనార్టీ మహిళలకు న్యాయం జరిగిందని రామ్ నాథ్ అన్నారు. వినియోగదారుల రక్షణ (సవరణ) చట్టం, లింగమార్పిడి హక్కుల చట్టంలను ప్రస్తావించారు. అలాగే దశాబ్దాలుగా వివాదంగా ఉన్న రామ్ జన్మభూమి సమస్య తీరింది. రామ్ జన్మభూమిపై సుప్రీంకోర్ట్ తీర్పు వెలువరించిన అనంతరం దేశప్రజలు చూపించిన ఐక్యత, ఓర్పు హర్షణీయం అని రామ్ నాథ్ దేశ ప్రజలను ప్రశంసించారు.
ఇక పౌరసత్వ సవరణ చట్టం (CAA) చారిత్రాత్మకమైనది అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ కోరిక సిఎఎ ద్వారా నెరవేర్చబడిందని అన్నారు. గాంధీ స్పూర్థితో పాకిస్థాన్ నుండి శరణార్థులుగా వచ్చిన హిందూ, సిక్కు, క్రైస్తవ మతస్తులకు పౌరసత్వం కల్పించడం మన కర్తవ్యం అని రామ్ నాథ్ అన్నారు.
ఈ చట్టంపై నిరసనలు తెలిపే క్రమంలో హింసాత్మక ఘటనలకు పాల్పడటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే అవుతుందని రామ్ నాథ్ వ్యాఖ్యానించారు. అయితే రామ్ నాథ్ ప్రసంగిస్తుండగా కొంత మంది విపక్ష సభ్యులు అడ్డు తగిలారు, షేమ్ షేమ్ అంటూ కొంత మంది నినాదాలు చేశారు.
అయినప్పటికీ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పోయారు. ఈ చట్టం వల్ల ఎవరికీ నష్టం జరగదు, అందరికీ న్యాయం చేయడం కోసమేనని చెప్పారు.
ఇదిలా ఉండగా, ఈరోజు సభలో ఆర్థిక సంఘం నివేదికను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రేపు కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెడతారు. నేడు ప్రారంభమైన ఈ సమావేశాలు ఫిబ్రవరి 11 వరకు కొనసాగుతాయి.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)