WEF 2020: ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో కేటీఆర్, దావోస్‌లో తెలంగాణ మంత్రికి అరుదైన గౌరవం, రాష్ట్రంలో పెట్టుబడుల కోసం గ్లోబల్ బిజినెస్ లీడర్లకు మంత్రి ఆహ్వానం
సెర్బియా ప్రధాన మంత్రి అనా బ్రనాబిక్, పోలాండ్ ప్రధాన మంత్రి మాటుస్జ్ మొరవిస్కి, ఎస్టోనియా ప్రధాన మంత్రి జూరి రాటాస్ హజరైన ఈ సమావేశంలో కేటీఆర్ ఒక్కరే...
Davos, January 24: ప్రస్తుతం దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం (World Economic Forum (WEF) Summit 2020) సదస్సులో పాల్గొంటున్న తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు (Kalvakuntla Taraka Rama Rao) గురువారం అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ ఆర్థిక నాయకుల సమావేశానికి (IGWEL) హాజరు కావాలని డబ్ల్యుఇఎఫ్ కేటిఆర్‌ను ఆహ్వానించింది, ఈ సందర్భంగా ‘కీపింగ్ పేస్ టెక్నాలజీ - టెక్నాలజీ గవర్నెన్స్ ఎట్ క్రాస్‌రోడ్స్’ అనే సమావేశంలో కేటిఆర్ పాల్గొన్నారు.
సాధారణంగా, ఈ IGWEL సమావేశంలో పాల్గొనడానికి వివిధ దేశాల్లోని ప్రభుత్వ అధినేతలు, ప్రధాన మంత్రులు, కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు మాత్రమే అనుమతించబడతారు. అయితే, కేటీఆర్‌ను కూడా డబ్ల్యుఇఎఫ్ ఆహ్వానించింది. సెర్బియా ప్రధాన మంత్రి అనా బ్రనాబిక్, పోలాండ్ ప్రధాన మంత్రి మాటుస్జ్ మొరవిస్కి, ఎస్టోనియా ప్రధాన మంత్రి జూరి రాటాస్ మరియు బ్రెజిల్, సింగపూర్, కొరియా, ఇండోనేషియా, ఒమన్, ఇథియోపియా, బోట్స్వానా మరియు ఇతర దేశాల నుండి పలువురు సీనియర్ మంత్రులు హజరైన ఈ సమావేశంలో కేటీఆర్ ఒక్కరే రాష్ట్రస్థాయి మంత్రి కావడం విశేషం.
తన దావోస్ పర్యటనలో పనిలోపనిగా మంత్రి కేటీఆర్, అక్కడ గ్లోబల్ ఇండస్ట్రియల్ లీడర్స్ తో వరుసగా ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఫార్మా, టెక్స్‌టైల్, లైఫ్‌సైన్సెస్, మొబైల్ డివైజెస్, గేమింగ్, యానిమేషన్, ఏవియేషన్ తదితర రంగాలలో అద్భుత అవకాశాలు, వసతులు ఉన్న ఇండియాలోని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే కలిగే ప్రయోజనాల గురించి పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ స్పష్టంగా వివరించి చెప్పారు.
A video presentation by Telangana Govt:
సౌదీ, కొరియా మంత్రులతో సమావేశం
దావోస్‌లో జరిగిన ఒక వ్యాపార సమావేశంలో సౌదీ కమ్యూనికేషన్స్ మంత్రి అబ్దుల్లా అల్స్‌వాహాతో కేటీఆర్ సంభాషించారు. సౌదీ- తెలంగాణ పరస్పర సహకార అవకాశాలు మరింత తెలుసుకునేందుకు హైదరాబాద్ ను సందర్శించాలని కేటీఆర్ ఆయనను ఆహ్వానించారు.
రిపబ్లిక్ ఆఫ్ కొరియా SME మరియు స్టార్టప్‌ల మంత్రి యంగ్ సన్ కూడా KTR ను కలిశారు. టెక్నాలజీకి సంబంధించిన అంశాలపై వారి వద్ద చర్చకు వచ్చింది.
కెమిల్లా సిల్వెస్ట్, ఈవీపీ, కమర్షియల్ స్ట్రాటజీ అండ్ కార్పొరేట్ అఫైర్స్, నోవో నార్డిస్క్, డానిష్ మల్టీనేషనల్ ఫార్మా తదితర సంస్థల ముఖ్య ప్రతినిధులు దావోస్‌లో ఏర్పాటు చేయబడిన తెలంగాణ పెవిలియన్ వద్ద కేటీఆర్ తో సమావేశమయ్యారు.
మరొక సమావేశంలో, మైక్రాన్ టెక్నాలజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ మెహ్రోత్రా , కోకాకోలా సిఇఒ జేమ్స్ క్విన్సీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా కేటీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. యూట్యూబ్ సీఈఓ సుసాన్ వోజ్కికితో కేటీఆర్ ముచ్చటించారు. వారి సంభాషణలో, యూట్యూబ్‌కు హైదరాబాద్ ప్రాధాన్యత కేంద్రమని ఆయన కేటీఆర్ కు తెలియజేశారు.