When Is Friendship Day 2026? ఫ్రెండ్‌షిప్ డే 2026 ఎప్పుడు.. భారత్‌లో ఎప్పుడు జరుపుకుంటారు.. ఇండియా, యూఎన్ తేదీల మధ్య తేడాలు ఏంటో తెలుసుకోండి
స్నేహం అనేది భాషలు, సరిహద్దులతో పనిలేని ఒకే ఒక్క స్వచ్ఛమైన బంధం. స్నేహితుల మధ్య ఉన్న ఆప్యాయతను పంచుకోవడానికి, మధుర జ్ఞాపకాలను నెమరేసుకునేందుకు ఏటా నిర్వహించుకునే స్నేహితుల దినోత్సవం అనగా ఫ్రెండ్‌షిప్ డే మళ్లీ వచ్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న క్యాలెండర్ల ఆధారంగా ఈ రోజును వేర్వేరు తేదీల్లో పాటిస్తారు.
When Is Friendship Day 2026? స్నేహం అనేది భాషలు, సరిహద్దులతో పనిలేని ఒకే ఒక్క స్వచ్ఛమైన బంధం. స్నేహితుల మధ్య ఉన్న ఆప్యాయతను పంచుకోవడానికి, మధుర జ్ఞాపకాలను నెమరేసుకునేందుకు ఏటా నిర్వహించుకునే స్నేహితుల దినోత్సవం అనగా ఫ్రెండ్‌షిప్ డే మళ్లీ వచ్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న క్యాలెండర్ల ఆధారంగా ఈ రోజును వేర్వేరు తేదీల్లో పాటిస్తారు.
ఐక్యరాజ్యసమితి అధికారికంగా గుర్తించిన అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని ఈ ఏడాది జూలై 30 గురువారం నాడు నిర్వహించనున్నారు. కాగా భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉత్తర అమెరికా దేశాల్లో ఆగస్టు మొదటి ఆదివారాన్ని పాటించే సంప్రదాయం సుదీర్ఘకాలంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 2 ఆదివారం నాడు ఇండియాలో ఫ్రెండ్‌షిప్ డే వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకోవడానికి యువత, విద్యార్థులు సమాయత్తమవుతున్నారు.
స్నేహానికి ఒక రోజును కేటాయించాలనే ఆలోచన ఇరవై ఒకటవ శతాబ్దానికి ముందే.. అంటే ఇరవై శతాబ్దం ప్రారంభంలోనే పురుడుపోసుకుంది. తొలినాళ్లలో గ్రీటింగ్ కార్డ్ కంపెనీల మార్కెటింగ్ వ్యాపారంతో మొదలైన ఈ సంస్కృతి, తదనంతరం బలమైన సామాజిక రూపం దాల్చింది. పరాగ్వేలో మొదటిసారిగా ప్రపంచ స్నేహ ఉద్యమం ఈ వేడుకను అంతర్జాతీయంగా జరుపుకోవాలని ప్రతిపాదించింది.
తదనంతరం ప్రపంచంలో శాంతి, పరస్పర ఆప్యాయత, వివిధ సంస్కృతుల మధ్య సామరస్యాన్ని పెంచేందుకు స్నేహం ఎంతగానో దోహదపడుతుందని గుర్తించిన ఐక్యరాజ్యసమితి 2011లో జూలై 30ని అధికారిక దినోత్సవంగా ప్రకటించింది. స్నేహం ద్వారా మానవ స్ఫూర్తిని పంచుకోవడం అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఒకప్పుడు స్నేహ దినోత్సవం అనగానే ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు, సాధారణ గ్రీటింగ్ కార్డులు మార్పిడి చేసుకోవడం మాత్రమే కనిపించేది. కానీ ప్రస్తుత సాంకేతిక యుగానికి అనుగుణంగా బహుమతులు ఇచ్చే శైలి గణనీయంగా మారింది. స్నేహితులతో గడిపిన తీపి గుర్తులతో ప్రత్యేకంగా ముద్రించిన ఫోటో బుక్స్, చెక్కిన ఆభరణాలు, డైరీలు ఇప్పుడు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
కేవలం భౌతిక వస్తువులకే పరిమితం కాకుండా అనుభవాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. మ్యూజిక్ కచేరీల టిక్కెట్లు, వంట తరగతులు, వీకెండ్ ట్రిప్పులను ప్లాన్ చేస్తున్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇప్పటికీ స్వయంగా తయారు చేసిన డిజైనర్ బ్యాండ్లు, పెయింటింగ్స్ ఇచ్చేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఇక వేర్వేరు నగరాలు, దేశాల్లో దూరంగా ఉన్న స్నేహితుల కోసం డిజిటల్ గిఫ్ట్ కార్డ్‌లు, స్పెషల్ మ్యూజిక్ ప్లేలిస్ట్‌లు, వీడియో సంకలనాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా పంపుతున్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు, సామాజిక సమూహాలు విద్యార్థుల్లో సానుభూతి, వైవిధ్యం పట్ల గౌరవం, సమ్మిళితత్వాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్చా కార్యక్రమాలు, ఆర్ట్ ఎగ్జిబిషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. బిజీ జీవనశైలిలో పడిపోయిన పెద్దలు సైతం తమ బాల్య మిత్రులను కలుసుకుని.. పాత జ్ఞాపకాలను పునరుద్ధరించుకోవడానికి ఈ ఫ్రెండ్‌షిప్ డే ఒక చక్కటి అవకాశంగా నిలుస్తోంది.