Hair Care: వర్షంలో తడిసారా? మీ జుట్టుకు ఈ జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే గతంలో నాకు కూడా జుట్టు ఉండేది అని చెప్పుకోవాల్సి వస్తుంది.
వానాకాలంలో జుట్టును జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే వర్షం వల్ల మీ జుట్టు నిర్జీవంగా మారి, ఎన్నో సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Rainy Season Hair Care: ఎండకు ఎండటం అంటే ఎవరికి నచ్చదు కానీ, వానలో తడవటం అంటే కొంత మందికి చాలా ఆనందం. వానలో ఆడుకోవటం, వర్షంలో డాన్స్ చేస్తూ టిక్ టాక్ వీడియోలు చేసుకోవడం మీకు బాగానే ఉంటుంది కానీ మీ నెత్తి మీద ఉన్న జుట్టు గురించి (Hair Care) ఎప్పుడైనా ఆలోచించారా? రైతుకు పొలంలో మొలకలు రావటానికి వర్షం ఎంత కారణమో, మీ తలపైన ఉన్న మొలకలు పోవటానికి కూడా ఆ వర్షం అంతే కారణం.
సరే ఇప్పుడు స్ట్రైట్ గా పాయింట్ కి వద్దాం. ఈ వానాకాలం చాలా కీలక సమయం. వానాకాలంలో జుట్టును జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే వర్షం వల్ల మీ జుట్టు నిర్జీవంగా మారి, జుట్టు రాలిపోవడం, తలపై జిడ్డు పేరుకుపోవడం, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షంలో మీ జుట్టు తడిస్తే దానిని అలాగే వదిలేయకుండా ఎప్పటికప్పుడు తగినంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కింది టిప్స్ ఫాలో అవ్వండి.
తలను పరిశుభ్రంగా కడుక్కోవాలి.
వర్షంలో తడిస్తే, మీ తలను మంచి షాంపూతో పరిశుభ్రంగా కడగాలి. తద్వారా వెంట్రుకలు చిక్కుపడకుండా, దువ్వుకోవటానికి అనువుగా మారతాయి. తగిన షాంపూను ఎంచుకోవడం కూడా ముఖ్యమే. ప్రతీ షాంపూపైన ఆ షాంపూ ఎందుకు ఉపయోగపడుతుంది? అది వెంట్రుకలు పెరగటానికా, జిడ్డును తొలగించటానికా, చిక్కులను తొలగించడానికా అనేది రాసి ఉంటుంది. మీకు ఎలాంటి షాంపూ అయితే అవసరమో దానిని వాడాలి. వర్షపు నీటితో హానికర బ్యాక్టీరియాలు కూడా కలుస్తాయి కాబట్టి 'వేప' గుణాలు కలిగిన షాంపూ అయితే మంచిది.
కండీషనర్ వాడకం.
వర్షంలో తడిసిన తర్వాత జుట్టు పిడసలా, వెంట్రుకలన్నీ అంటుకున్నట్లు తయారవుతుంది. కాబట్టి షాంపూ చేసిన తర్వాత కండీషనర్ కూడా వాడితే జుట్టు మృదువుగా తయారవుతుంది. అలోవిరా గుణాలు ఉన్న షాంపూలు బాగా పనిచేస్తాయి. లేదంటే మీరే సొంతంగా గుడ్డు- యోగర్ట్ పదార్థాలను ఉపయోగించి కూడా ఇంట్లోనే కండీషనర్ తయారు చేసుకోవచ్చు.
వెంట్రుకలపై తడిలేకుండా చూడాలి.
జుట్టును టవల్ తో బాగా తుడిచి తడినంతా తీసేయాలి, అలా తుడిచిన తర్వాత కొద్దిసేపు జుట్టును గాలికి వదిలేసి దానంతట అదే ఆరిపోయేందుకు సమయం ఇవ్వాలి. మీకు బాగా అర్జెంట్ అయితేనే హెయిర్ డ్రయర్ జోలికి వెళ్లాలి. జుట్టు సంరక్షణకు కొన్ని హెయిర్ స్ప్రేలు కూడా దొరుకుతాయి, వాటిని కూడా వాడొచ్చు.
హెయిర్ కట్ చేయడం.
మీరు జుట్టు బాగా పెంచుకోవాలనే ఆలోచన ఉన్నా సరే వానకాలంలో అప్పుడప్పుడూ కొద్దిగా జుట్టును ట్రిమ్ చేసుకోవాలి, జుట్టు చివళ్లను కత్తిరించుకోవడం వల్ల పాయలుగా విడిపోదు. ఈ సీజన్ లో జుట్టు పొట్టిగానే ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది.