Hair Wash: ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిదేనా? ఎలాంటి జుట్టు కలిగిన వారు వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి, బట్టతల ఉన్నవారు ఎన్నిసార్లు చేయాలో తెలుసుకోండి.
అలాగే బట్టతల ఉన్నవారు కూడా ఎలాంటి షాంపూలు వాడితే ప్రయోజనమో...
మనుషుల్లో రెండు రకాలు ఉంటారు. ఒకరు క్రమం తప్పకుండా తలస్నానం (Head-bath) చేసేవారు, రెండు అసలు తలస్నానమే చేయనివారు. ఈ రెండో రకం గురించి తర్వాతెప్పుడైనా మాట్లాడుకుందాం గానీ, ప్రస్తుతం మొదటి రకం క్రమం తప్పకుండా తలస్నానం చేసేవారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.
కొందరు వారంలో అన్ని రోజులు తలస్నానం చేస్తారు, ఇంకొంత మంది అప్పుడప్పుడు వారంలో ఒకటి లేదా రెండు సార్లు చేస్తారు. అయితే వాస్తవానికి వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి అనేది చాలా మందికి తెలియదు. ఇంకో విషయం, అందరి జుట్టు ఒకేలా ఉండదు. కొందరికి వెంట్రుకలు పలుచగా ఉంటే మరికొందరికి చిక్కగా ఉంటాయి, కొందరి జుట్టు పట్టులాగా జారిపోయేలా ఉంటే ఇంకొందరి జుట్టు రింగులు తిరిగి ఉంటుంది. కాబట్టి ముందుగా వారి జుట్టు స్వభావం ఎలాంటిదో తెలుసుకొని దానికనుగుణంగా తలస్నానం (Hair Wash) చేయాల్సి ఉంటుంది. లేకపోతే జుట్టు రాలిపోవటం, నిర్జీవంగా మారడం, చుండ్రు రావటం లాంటి సమస్యలు అనవసరంగా కొనితెచ్చుకున్నట్లు అవుతుంది.
అయిలీ హెయిర్: కొందరికి సహజంగానే వారి జుట్టు నూనె పూసినట్లుగా, ముట్టుకుంటే జిడ్డుగా గ్రీజు అంటుకున్నట్లుగా అనిపిస్తుంది. వారి కుదుళ్లలోని గ్రంథుల్లో నూనెలు ఉత్పత్తి కావడమే ఇందుకు కారణం. అయితే ఇలాంటి వారికి రోజూ తలస్నానం చేయాలని ఉంటుంది. కానీ ఇలాంటి జుట్టు ఉన్నవారు రోజూ తలస్నానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగకపోగా జుట్టు సమస్యలు ఇంకా అధికమవుతాయి. అయిలీ హెయిర్ ఉన్నవారు వారానికి 4 సార్లు మించి తలస్నానం చేయడానికి వీలులేదు. అలాగే వీరు నిమ్మ, మామిడి లాంటి పులుపు- సిట్రస్ గుణాలు గల షాంపూలు ఉపయోగిస్తే మార్పును గమనించవచ్చు.
ఫ్లాట్ హెయిర్: ఇలాంటి జుట్టు ఉన్నవారికి కూడా కుదుళ్లు సులభంగా కనిపిస్తాయి. ఇలాంటి జుట్టుకు ప్రతిరోజు తలస్నానం మంచిది కాదు. వీరు రోజు తప్పించి రోజు తలస్నానం చేయడం మంచిది. అయిలీ హెయిర్ ఉన్నవారిలాగే ఏదైనా డ్రై షాంపూ వాడటం మంచిది.
పొడిబారిన జుట్టు: జుట్టుకు కలర్స్ వేయటం, వాతావారణంలో మార్పులు, కాలుష్యం, కఠినమైన నీటిని వాడటం ద్వారా కొందరి జుట్టు పొడిబారిపోతుంది. ఇలా మారడం వలన జుట్టు విరిగిపోవడం, జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇలాంటి జుట్టుకలవారు జుట్టుకు ప్రత్యేక పోషణ, సంరక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. పొడిజుట్టు ఉన్నవారు తలకు క్రమం తప్పకుండా నూనె పెట్టాలి.
కుదుళ్ల వరకు అందేటట్లు వేళ్లతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. షాంపూ చేసుకునేటపుడు మాయిశ్చరైజింగ్ గుణాలుండే మృధువైన షాంపూలు ఉపయోగించడం, జుట్టుకు కండీషనర్ వాడుతూ ఉండటం వలన కోల్పోయిన తేమ తిరిగివచ్చి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది. వర్షంలో తడిసారా? మీ జుట్టుకు ఈ జాగ్రత్తలు తీసుకోండి..
చిక్కటి ఒత్తైన జుట్టు: ఒత్తైన చిక్కటి జుట్టు కలవారు, వారానికి ఒకసారి హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది. ఇలా ఒత్తైన జుట్టు ఉంటే కుదుళ్లు బహిర్గతం కావు కాబట్టి ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా అది తట్టుకుంటుంది. నూనె కూడా అన్ని కుదుళ్లకు సమానంగా పంపిణీ చేయడం జరుగుతుంది. చిక్కటి జుట్టు కలవారు టీ-ట్రీ ఆయిల్ గుణాలు ఉన్న షాంపూలు వాడితే ప్రయోజనం ఉంటుంది.
ఉంగరాల జుట్టు - ఉంగరాల జుట్టు ఉండటం అందానికి చిహ్నంగా చెప్తారు. కొంతమంది స్టైల్ కోసం కూడా జుట్టును ఉంగరాలుగా మలుచుకుంటారు. అయితే ఉంగరాల జుట్టు వారు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య జుట్టు చిక్కులు పడటం. ఈ జుట్టు కుదుళ్ల దగ్గర జిడ్డుగా ఉండి చివర్లు పొడిబారినట్లుగా ఉంటాయి. ఉంగరాల జుట్టు కలవారు వారానికి 3 సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. అలాగే జుట్టుకి పోషణను అందించే షాంపూలు, బాదం మరియు అవకాడో గుణాలు కలిగిన షాంపూలు, సల్ఫేట్ రహిత షాంపూలు వాడటం ఉత్తమం.
కొంచెం రింగులు తక్కువ ఉండి, అలలలాగా జుట్టు ఉండేవారికి కూడా ఇదే వర్తిస్తుంది. అయితే వీరు సల్ఫేట్ రహిత షాంపూ లేదా నురగతో శుభపరుచుకోవడం (Foam Wash) చేసుకుంటే ప్రయోజనాలుంటాయి.
సాధారణ జుట్టు: సాధారణ జుట్టు అని ప్రత్యేకంగా ఏమి లేదు. పైన చెప్పినట్లు ఉంగరాలు, అయిలీ హెయిర్, చిక్కటి పలుచ అనే తేడాలు లేకుండా మామూలుగానే ఉంటే దానిని సాధారణ జుట్టు అంటారు. ఇలాంటి వారు ఒకరోజు తప్పించి ఒకరోజు తలస్నానం చేస్తే చాలు. ప్రత్యేకమైన షాంపూలంటూ ఏమి ఉపయోగించాల్సిన అవసరం లేదు. 'టూ ఇన్ వన్' షాంపూలు, బాడీ వాష్-హెయిర్ వాష్ రెండింటికి ఉపయోగిపడేవి వాడినా ఎలాంటి సమస్య ఉండదు.
బట్టతల: తల మీద వెంట్రుకలు లేనివారు వారానికి రెండు లేదా మూడు సార్లు తలను శుభ్రం చేసుకోవటం మంచిది. యాంటీ- డాండ్రఫ్ షాంపూలు ఉపయోగిస్తే చుండ్రు నివారించడమే కాకుండా తలపై జిడ్డు, ఇతర బాక్టీరియాలు తొలగిపోతాయి.