Bloating Stomach: కొంచెం తిన్నా కడుపు బెలూన్‌లా ఉబ్బినట్లు అనిపిస్తుందా? ఇది సీరియస్‌గా దృష్టి పెట్టాల్సిన సమస్య.

అయితే ఇది ఒక రకమైన ఆనారోగ్యమైన సమస్య...

Image used for representational purpose only | (Photo Credits: Pixabay)

కొంతమందికి కొద్ది మొత్తంలో ఆహారం తీసుకున్నా కడుపు బాగా నిండినట్లు  (Feeling full) అనిపిస్తుంది. ఒక్కోసారి బిగువుగా కడుపును పట్టేసినట్లు (Tight Stomach), మంటగా కూడా అనిపిస్తుంది. మీరు చూడటానికి  సన్నగానే లేదా మామూలుగానే ఉన్నా కడుపు భాగంలో మాత్రం కొవ్వు చేరినట్లుగా, చూసేవారికి మీకు పొట్ట వచ్చినట్లుగా కనిపిస్తుంది.  కొంతమందికి వంశపారం పర్యంగానే ఊబకాయం ద్వారా పొట్ట వస్తుంది, మరికొంత మందికి ఎక్కువ తినడం, తిన్నదానికి సరిపోయేలా వ్యాయామం చేయకపోవడం తదితర కారణాల చేత పొట్ట భాగంలో కొవ్వు పేరుకు పోయి పొట్ట ఉబ్బెత్తుగా కనిపిస్తుంది.

ఈ రెండూ కాకుండా కొంత మందికి ఊరికనే పొట్ట వచ్చేస్తుంది.  అలాంటి వారు తినేది తక్కువే అయినా, మద్యపానం లాంటి  అలవాట్లు లేకపోయినా వారి కడుపు భాగం పొట్ట ఉన్నవారిలాగా కనిపిస్తుంది. ఏదో బండరాయి మింగేసినట్లుగా కడుపంతా గట్టిగా మారినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇది ఒక రకమైన ఆనారోగ్యమైన సమస్య. అందుకు వివిధ రకాల కారణాలు ఉంటాయి

కడుపు  బిగువుగా ఉన్నట్లు అనిపించడానికి గల కారణాలు:

అజీర్తి  (Indigestion):

ఇది తిన్న ఆహారం సరిగా జీర్ణం అవకపోతే వచ్చే సమస్య. అతిగా తినడం లేదా త్వరత్వరగా తినడం ద్వారా, కొన్ని రకాల మందులు వాడుతున్నట్లు అయితే, ఒత్తిడి, స్మోకింగ్ మరియు ఆల్కాహాల్ సేవించడం ద్వారా ఈ సమస్య ఏర్పడవచ్చు.

దీని లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.

ఛాతిలో మంట (Heart burn)

వికారం

గ్యాస్

కడుపు పైభాగం ఉబ్బడం (Tight Abdomen)

రుచి లేకపోవడం, ఏది రుచిగా అనిపించకపోవడం

దీని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు, కొన్ని పద్ధతులు ఇంట్లోనే పాటించడం ద్వారా డాక్టర్ అవసరం లేకుండానే ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వవచ్చు

కాఫీ లేదా కెఫీన్ ఉండే పానీయాలకు దూరంగా ఉండటం

అల్కాహాలు, పొగాకుకు దూరంగా ఉండటం

అధిక కొవ్వు, అధిక మసాలాలు ఉండే ఆహారానికి దూరంగా ఉండటం

బరువు తగ్గించుకునే ప్రయత్నాలు చేయడం

నిద్రించే సమయంలో తల, భుజాలు కొంచెం ఎత్తులో ఉండేలా చూసుకోవడం.

జీర్ణకోశ వ్యాధి (IBS- Irritable bowel syndrome)

కడుపు బిగుతుగా అనిపించడం అనేది జీర్ణకోశం, పేగులలో ఏర్పడిన ఒక వ్యాధి

దీని లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.

కడుపు పైభాగంలో నొప్పి (Stomach/Abdomen pain)

కడుపు పైభాగం ఉబ్బడం (Bloating)

అజీర్తి

గ్యాస్

డయేరియా - లూజ్ మోషన్స్

మందుల ద్వారా (Medication), ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి (Lifestyle) ని మార్చుకోవడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు.

హెయటల్ హెర్నియా - ఆసిడ్ రిఫ్లక్స్ ఈసోఫాగటిస్  (Acid Reflux)

ఇది కూడా ఆహార నాళం మరియు కడుపు భాగంలో ఏర్పడే ఒక సమస్య. కడుపులో ఉన్న ఆహరం బయటకు వచ్చేస్తున్నట్లు అనిపిస్తుంది. కడుపు ఉబ్బడం, బిగుతుగా అనిపించడం కూడా మామూలే.

దీని లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.

ఛాతిలో మంట

నోటి దుర్వాసన (Bad Breath)

కడుపు పైభాగం ఉబ్బడం

వికారం

గ్యాస్ తయారవడం

ఆసిడిటి

ఆహారం మింగేటపుడు కష్టంగా అనిపించడం.

ఈ సమస్యను కూడా దాదాపు మందుల ద్వారా, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా, అంటాసిడ్ సిరప్స్ (Antacids)  ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఒకవేళ ఈ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంటే, గ్యాస్ట్రిక్ డాక్టర్ ను సంప్రదించాలి. చిన్న సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది.

గ్యాస్ట్రైటిస్  (Gastritis)

ఇది కూడా సాధరణంగా కనిపించే సమస్యనే. కడుపు లోపలి అంచులో మంటగా అనిపిస్తూ, కడుపు ఉబ్బినట్లు అనిపిస్తుంది.

దీని లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.

అజీర్తి

వికారం, వాంతులు

ఆహారం తీసుకున్న తర్వాత కండుపు నిండుగా అనిపించడం.

కడుపు పైభాగంలో నొప్పి.

డాక్టరును సంప్రదించి దీనికి తగిన మందులు తీసుకుంటే సరిపోతుంది.

ఇవే కాకుండా కడుపు ఉబ్బగా అనిపించటానికి మరికొన్ని కారణాలు కూడా ఉంటాయి. ఫుడ్ పాయిజనింగ్ అయినపుడు, మలం సరిగా రాకపోతే లేదా మల విసర్జనలో తేడాలు, రంగులో తేడాలు కనిపించడం మరియు ఆడవారిలో పీరియడ్స్ వచ్చే 2 వారాల ముందు అలాగే ప్రెగ్నెసీ సమయంలో కూడా ఇలాగే అనిపిస్తుంది.

పైన చెప్పిన విధంగా కడుపుకు సంబంధించి ఇలాంటి సమస్యలు తలెత్తినపుడు ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా అధిగమించవచ్చు. మీరు తినే ఆహారం కడుపుకు సరిపడటం లేదని తెలుసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి, నీరు సమృద్ధిగా తాగాలి, ఆరోగ్యకరమైన పండ్ల రసాలు ( ఆసిడ్ ఉండే ఆరింజ, నిమ్మ సిట్రస్ జాతులు కాకుండా), ముఖ్యంగా ఒత్తిడి- నిద్రలేమి లేకుండా చూసుకోవాలి అందుకు వ్యాయామాలు, బరువు తగ్గించుకోవడం లాంటివి చేయాలి.

కడుపు ఉబ్బటం అనేది తీవ్రమైన సమస్య కానప్పటికీ ఇది ఒక వార్నింగ్ బెల్ లాంటిది. దీనిని అలాగే వదిలేస్తే సమస్య మరింత ముదిరే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంతవరకు ఆరోగ్యకరమైన జీవితం అలవాటు చేసుకుంటే మంచిది.

డాక్టరును ఖచ్చితంగా ఎప్పుడు సంప్రదించాలంటే.

కడుపు ఉబ్బటంతో పాటు ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయంటే, ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టరును సంప్రదించి దానికి తగిన చికిత్సను తీసుకోవాలి.

పైన చెప్పిన లక్షణాలతో పాటుగా మలంలో రక్తం వస్తున్నట్లు గుర్తిస్తే

తీవ్రమైన వికారం, వాంతులు

అనూహ్యంగా బరువు తగ్గిపోవడం

కడుపు పైభాగంలో తీవ్రమైన నొప్పి

శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం.

ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. చివరగా ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి.