Rice Or Chapatis: రాత్రివేళ అన్నం తినడం మంచిదా, లేక చపాతీ తినడం మంచిదా, ప్రముఖ న్యూట్రిషియన్లు ఏం చెబుతున్నారంటే..
మధ్యాహ్న సమయంలో భోజనంగా రైస్ తీసుకున్నా ఫరవాలేదు కానీ రాత్రి తీసుకునే ఫుడ్ లో రైస్ ఉంటే మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి.
ఇటీవల కాలంలో అందరూ ఆరోగ్యంపై శ్రద్ద కనబరుస్తున్నారు. ఇందు కోసం ముఖ్యంగా రోజు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుని మంచి ఫలితాలను పొందవచ్చు. కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం తగ్గించి, ప్రోటీన్ వినియోగాన్ని పెంచాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. కానీ మన దేశంలో భోజనంలో బియ్యం మరియు చపాతీల రూపంలో పిండి పదార్థాలు నిండిన ఆహరం ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అయితే మధ్యాహ్న సమయంలో భోజనంగా రైస్ తీసుకున్నా ఫరవాలేదు కానీ రాత్రి తీసుకునే ఫుడ్ లో రైస్ ఉంటే మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి.
అన్నం మరియు చపాతీలలో ఉండే పోషక విలువలలో పెద్దగా తేడా ఉండదు. రెండూ ధాన్యాలను ప్రాసెస్ చేయడం ద్వారా తయారవుతాయి. సోడియం కంటెంట్లో మాత్రమే వ్యత్యాసం ఉంటుంది. చపాతీలతో పోల్చి చూస్తే బియ్యంలో ఫైబర్, ప్రోటీన్స్, కొవ్వులు తక్కువగా… కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న పాలీష్ బియ్యంలో విటమిన్లు తక్కువగా ఉంటున్నాయి. అన్నం తొందరగా జీర్ణమయ్యి ఆకలి వేస్తుంది… కానీ చపాతీ, రోటీలలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆలస్యంగా జీర్ణమయ్యి త్వరగా ఆకలి వేయదు.
అందుకే బరువు తగ్గాలని భావించే వాళ్లు భోజనంలో చపాతీని చేర్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయంలో రైస్ బదులు చపాతీ తింటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే చపాతీని పప్పు, కూరగాయలు, పెరుగుతో తీసుకుంటే మరీ మంచిది. బార్లీ, జొన్న, గోధుమలను కలిపి తయారు చేసిన చపాతీలలో కాల్షియం, ఫాస్పరస్ మరియు జింక్ వంటి పోషకాలు లభిస్తాయి. అయితే రాత్రి 8 గంటల్లోపే ఆహరం తీసుకుంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయని నిపుణులు చెప్తున్నారు.