‘One Last Kiss’:ఎనిమిది ఏళ్లుగా నడిపిన బస్సుకు లాస్ట్ కిస్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డ్రైవర్ ఎమోషనల్ వీడ్కోలు.. వీడియో ఇదిగో..
‘One Last Kiss’: సంవత్సరాల తరబడి వేలాది కిలోమీటర్ల ప్రయాణంలో తనకు నీడను, జీవనోపాధిని అందించిన వాహనానికి ఒక కేఎస్ఆర్టీసీ (KSRTC) డ్రైవర్ తెలిపిన భావోద్వేగ వీడ్కోలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేస్తోంది. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇడుక్కి జిల్లా కట్టప్పన డిపోకు చెందిన డ్రైవర్ పాల్ కురియన్ సుదీర్ఘ సేవలు అందించిన అనంతరం ఇటీవల పదవీ విరమణ పొందారు. అయితే తన ఉద్యోగ ప్రయాణంలో చివరి రోజున ఆయన తన బస్సుతో పంచుకున్న బంధం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.
పాల్ కురియన్ తన చివరి సర్వీసు ప్రయాణాన్ని ముగించి డిపో వద్ద బస్సు దిగిన వెంటనే ఆ వాహనం ముందు భాగానికి వెళ్లి, దానిని ప్రేమగా కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నారు. లెక్కలేనన్ని ప్రయాణాల్లో తన తోడుగా, కార్యస్థలంగా నిలిచిన స్టీరింగ్ వద్ద చివరిసారిగా డ్రైవర్ సీట్లో కూర్చుని మురిసిపోయారు. అనంతరం బస్సు కిందకు దిగి, ముందు వెనుక టైర్లను చేతులతో తాకుతూ మొక్కి, రోడ్డుపై గడిపిన కాలంలో తనకు ఏ ప్రమాదం రాకుండా కాపాడి జీవనోపాధిని అందించినందుకు ఆ వాహనానికి నమస్కరిస్తూ వీడ్కోలు పలికారు.
కేవలం ఒక యంత్రంతో మనిషికి ఉన్న అనుబంధానికి, వృత్తి పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా నిలిచిన ఈ దృశ్యాలను అక్కడున్న సహచరులు వీడియాలు తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. పాల్ కురియన్ బస్సుకు వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలు ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఆయన వృత్తి ధర్మాన్ని, ఆర్ద్రతను కొనియాడుతున్నారు.
Kerala Driver Hugs and Kisses His Bus in Emotional Retirement Farewell