Siraj Pays Homage to Late Father: తండ్రి సమాధి వద్ద టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రార్థనలు, తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగం, తనకు ఆస్ట్రేలియా సిరీస్ చిరస్మరణీమైనదని వ్యాఖ్య
తండ్రి మరణవార్త విన్న తర్వాత చాలా డిస్టర్బ్ అయ్యాను. ఆస్ట్రేలియా నుంచి ఇంటికి వెళ్లిపోవాలా? అక్కడే ఉండిపోవాలా? ఏం తోచని స్థితిలోకి వెళ్లాను. తాను ఎప్పటికైనా భారత జట్టుకు ఆడతానని నాన్న చెప్పేవారు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మతో....
Hyderabad, January 21: ఆస్ట్రేలియాతో సిరీస్ లో టీమ్ ఇండియా చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ సిరాజ్, గురువారం ఇండియా చేరుకున్నారు. తన స్వస్థలమైన హైదరాబాద్ చేరుకోగానే, నేరుగా వెళ్లి తన తండ్రి సమాధిని సందర్శించారు. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు నవంబర్ 20న మహమ్మద్ సిరాజ్ తండ్రి మహమ్మద్ గౌస్ కన్నుమూశారు. అయితే భారత జట్టుకు బౌలర్ గా సేవలందించడం మరియు కోవిడ్ -19 ప్రోటోకాల్ కారణాలతో సిరాజ్ తన కన్నతండ్రి అంత్యక్రియలకు సైతం రాలేకపోయాడు.
మీడియాతో మాట్లాడిన సిరాజ్, "ఇది చాలా కఠినమైన పరిస్థితి. తండ్రి మరణవార్త విన్న తర్వాత చాలా డిస్టర్బ్ అయ్యాను. ఆస్ట్రేలియా నుంచి ఇంటికి వెళ్లిపోవాలా? అక్కడే ఉండిపోవాలా? ఏం తోచని స్థితిలోకి వెళ్లాను. తాను ఎప్పటికైనా భారత జట్టుకు ఆడతానని నాన్న చెప్పేవారు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మతో మాట్లాడిన తర్వాత మనో ధైర్యం వచ్చింది. నాన్న ఆశయాన్ని తీర్చాలని అమ్మ, సోదరుడు ఫోన్లో చెప్పారు. ఏది ఏమైనా నాన్న కలను నెరవేర్చాలనే భావించాను, అది నెరవేరింది." అని సిరాజ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో ఒంటరిగా ఉన్నప్పుడు తీవ్ర మనోవేదనకు గురైనట్లు సిరాజ్ భావోద్వేగం చెందాడు.
మొన్నటి పర్యటనలో ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ ఆడిన ఈ హైదరాబాదీ పేసర్, ఆ సిరీస్ లో మొత్తం 13 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా చారిత్రాత్మక విజయం సాధించిన గబ్బా టెస్ట్‌లో 4వ రోజు ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక్కడ భారత్ మూడు వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించింది.
ఐపీఎల్ ముగియగానే సిరాజ్ నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరాడు. ఒకవైపు తన తొలి టెస్టు కోసం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాననే ఉద్వేగపూరిత వాతావరణం, అదే సమయంలో తండ్రి మరణవార్త. సిడ్నీ క్రికెట్ స్టేడియంలో జాతీయగీతం జనగణమన వినిపించగానే 26 ఏళ్ల పేసర్ తీవ్ర ఉద్వేగానికి లోనై కన్నీళ్లుపెట్టుకున్న వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఆస్ట్రేలియాలో ఉంటే టీమ్ ఇండియా ఆటగాళ్లు జాతివివక్ష వ్యాఖ్యలకు గురయ్యారు. గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమైనా, పట్టుదలతో ఆడిన టీమ్ ఇండియా ఒక అద్భుత విజయాన్ని నమోదు చేసిది. ఇన్ని రకాల భావోద్వేగాల నడుమ, కష్టాలను ఓర్చుకుంటూ కన్నీళ్లను దిగమింగుకుంటూ ఆటలో తన సత్తా చాటిన సిరాజ్ పట్ల అభినందలు వెల్లువెత్తుతున్నాయి.