Amaravati IRR alignment Case: రెండో రోజు ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ, ఢిల్లీకి బయలుదేరిన టీడీపీ జాతీయ కార్యదర్శి, ఈ రోజు విచారణపై ఏమన్నారంటే..

నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారని వెల్లడించారు. ఒక్క రోజు విచారణకు హాజరవ్వాలని హైకోర్టు చెప్పినా, సీఐడీ అధికారులు తనను రెండో రోజు కూడా విచారణకు పిలిచారని తెలిపారు.

Nara Lokesh (Photo-ANI)

Vjy, Oct 11: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి రెండో రోజు నారా లోకేశ్ సీఐడీ విచారణ ముగిసింది. నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారని వెల్లడించారు. ఒక్క రోజు విచారణకు హాజరవ్వాలని హైకోర్టు చెప్పినా, సీఐడీ అధికారులు తనను రెండో రోజు కూడా విచారణకు పిలిచారని తెలిపారు. సీఐడీ అధికారుల కోరిక మేరకు తాను ఇవాళ కూడా విచారణకు వచ్చానని పేర్కొన్నారు. విచారణ అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీకి బయలుదేరారు.శుక్రవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ ఉంది. దీనికి సంబంధించి న్యాయవాదులతో సమీక్షించేందుకు లోకేశ్ ఢిల్లీకి పయనమయ్యారు.

ఈ రోజు విచారణ అనంతరం మీడియాతో నారా లోకేష్ మాట్లాడుతూ.. నిన్న అడిగిన ప్రశ్నలనే వాషింగ్ మెషీన్ లో వేసి, అటు తిప్పి ఇటు తిప్పి అడిగారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇవాళ 47 ప్రశ్నలు అడిగితే, వాటిలో రెండో, మూడో కొత్త ప్రశ్నలు అని, మిగతావన్నీ పాత ప్రశ్నలేనని వెల్లడించారు. ఇవాళ తనను 6 గంటల పాటు ప్రశ్నించారని తెలిపారు.

చంద్రబాబుకు కాస్త ఊరట, సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని కోర్టు ఆదేశాలు, రైట్ టు ఆడియెన్స్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు

"ఇవాళ విచారణ సందర్భంగా నా ముందు ఓ డాక్యుమెంట్ పెట్టారు. అది మా అమ్మ నారా భువనేశ్వరి ఐటీ రిటర్నులకు సంబంధించిన పత్రం. ఇది మీ వద్దకు ఎలా వచ్చిందని సీఐడీ అధికారులను ప్రశ్నించాను. వారి నుంచి సరైన సమాధానం రాలేదు. ఈ కేసులో మా అమ్మ నిందితురాలు కాదు... ఆమె ఐటీ రిటర్నులు మీ వద్ద ఎందుకున్నాయని దర్యాప్తు అధికారిని సూటిగా ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. దీన్ని నేను సీరియస్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నాను.

నిందితురాలు కానటువంటి వ్యక్తి ఐటీ రిటర్నులు ఏపీ ప్రభుత్వం చేతికి అధికారికంగా వచ్చాయా? అనధికారికంగా వచ్చాయా? అనేది తెలియాల్సి ఉంది. దీని వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చేందుకు ఐటీ శాఖకు లేఖ రాస్తాను.

ఇవాళ్టి విచారణలో నా శాఖకు సంబంధం లేని ప్రశ్నలు కొన్ని అడిగారు. అవి నా శాఖకు సంబంధించినవి కావని, వాటిపై నాకు అవగాహన లేదని సీఐడీ అధికారులకు చెప్పాను. వాస్తవానికి ఇవాళ్టి విచారణ గురించి మీడియాకు చెప్పాల్సిన కొత్త విషయాలు కూడా ఏమీ లేవు. ఇవాళ మరోసారి లవ్ లెటర్ (41ఏ నోటీసు) ఇస్తారేమో అనుకున్నాను. ఈ కేసులో ఇప్పటికే రెండుసార్లు లవ్ లెటర్ (41ఏ నోటీసు) ఇచ్చారు కదా.... మూడోది కూడా ఇస్తారా? అని దర్యాప్తు అధికారిని అడిగాను. అందుకాయన సమాధానం చెప్పలేదు" అని లోకేశ్ వివరించారు.

"రాజధాని ఈ ప్రాంతంలో రావాలని 2014లో ఎవరు నిర్ణయించారు? రాజధాని మాస్టర్ డెవలపర్ ఎవరు? సీడ్ కాపిటల్ ప్రతిపాదన ఎవరిచ్చారు? ఏపీసీఆర్డీఏ ఎవరు ఏర్పాటు చేశారు? ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ఎవరు నిర్ణయించారు?... అంటూ ఈ ప్రశ్నలు అడిగారు. ఇవేవీ నా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినవి కావు.

నాడు ఏపీ సీఆర్డీఏలో కొందరు లే అవుట్లు వేసుకునేందుకు ఇబ్బంది పడుతుండడంతో, దాన్ని పరిష్కరించేందుకు మంత్రుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అది నేను మంత్రిని కాకముందు ఏర్పాటైన మంత్రుల సంఘం. 99 ప్లాట్లకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. అంతే తప్ప కొత్తగా ఏమీ లేదు. దాంట్లో రింగ్ రోడ్డు అలైన్ మెంట్ గురించి ఏమీ లేదు" అని లోకేశ్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సరదాగా బదులిచ్చారు. లంచ్ కు ముందు ఇవాళ తనకు బాహుబలి సినిమా చూపించారని అన్నారు. నా ముందు గూగుల్ ఎర్త్ తెరిచారు. హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసిన 9 ఎకరాల భూమి రింగ్ రోడ్డు అలైన్ మెంట్ పై ఎలా ఉంటుందో చూపించారు. ఆ విధంగా చూడడం నాకు మొదటిసారి. హెరిటేజ్ నాడు ఎన్ని ఎకరాల భూమిని కొనుగోలు చేసిందీ, ఏ సర్వే నెంబరు అనేది నాకు తెలుసు. కానీ ఇవాళ బాహుబలి సినిమా చూపించినట్టు పెద్ద స్క్రీన్ పై నీట్ గా చూపించారు.

దాంట్లో నేను తెలుసుకున్నది ఏంటంటే... ఇన్నర్ రింగ్ రోడ్డు హెరిటేజ్ భూముల లోపల నుంచి వెళుతుందట. దానర్థం, ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల హెరిటేజ్ భూమిని కోల్పోయింది... ఇదీ ఇవాళ నేను తెలుసుకున్నది. మొత్తమ్మీద బాహుబలి సినిమా చూపించారు... దాని తర్వాత బ్రేక్ ఇచ్చారు. మళ్లీ ఏవేవో ప్రశ్నలు అడిగారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంతో నాకెలాంటి సంబంధం లేదు. అలైన్ మెంట్ లో నా పాత్ర లేదు. మా కుటుంబంలో ఎవరూ కూడా కోర్ క్యాపిటల్ రీజియన్ లో కనీసం ఒక గజం స్థలం కూడా కొనలేదు. గత పదేళ్లుగా మా కుటుంబ సభ్యుల ఆస్తులు అవసరం లేకపోయినా ప్రకటిస్తున్నాం. పేర్కొన్న దానికంటే ఒక్క గజం స్థలం ఎక్కువుందని నిరూపిస్తే, వాళ్లకు మా ఆస్తులన్నీ రాసిచ్చేస్తామని ఆనాడే చెప్పాను. ఇప్పటికీ నిరూపించలేదు.

నన్ను రెండ్రోజుల నుంచి సీఐడీ వాళ్లు విచారిస్తున్నారు. నాకు సంబంధించిన ఆధారాలేవీ చూపించలేకపోయారు. నేను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని. నాకు చాలా పనులు ఉంటాయి. ఆ పనులన్నీ మానుకుని వచ్చాను. వీళ్లు విచారణకు పిలిచి రెండ్రోజుల పాటు నా సమయాన్ని వృథా చేశారు. ఇది కక్ష సాధింపు కాకపోతే ఇంకేటి?

మళ్లీ చెబుతున్నాను... వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారు. కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారు. జీవోలతో సీఎంకు సంబంధం ఏముంటుంది? నాటి అధికారులు ప్రేమచంద్రారెడ్డి, అజేయ కల్లంపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? సంతకాలు చేసిన అధికారులను విచారణకు పిలవకుండా, పాలసీ ఫ్రేమ్ చేసిన చంద్రబాబును 32 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచడం బాధాకరం.

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు కార్యదర్శిగా వ్యవహరించింది ప్రేమచంద్రారెడ్డే. ఆయన గుజరాత్ వెళ్లి పరిశీలించి స్కిల్ ప్రాజెక్టు అద్భుతం అని చెప్పారు. దీన్ని వెంటనే అమలు చేయాలి, రూ.285 కోట్లను వెంటనే విడుదల చేయండి అని ప్రేమచంద్రారెడ్డి నివేదిక ఇచ్చారు. కానీ ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో లేదు.

ఇక, లింగమనేని రమేశ్ గారికి 2019లో రెంటల్ అడ్వాన్స్ కింద రూ.27 లక్షలు ఇచ్చిన విషయం మా అమ్మగారి ఐటీ రిటర్న్స్ లో ఎందుకు లేదని అడిగారు. ఆ సంగతి ఆడిటర్ ను అడగాలని చెప్పాను. మా తల్లి ఖాతా నుంచి రూ.27 లక్షలు అద్దె కోసం చెల్లించినట్టు బ్యాంకు స్టేట్ మెంట్ ను సీఐడీ వాళ్లే చూపిస్తున్నారు. అన్ని ఆధారాలు వాళ్ల దగ్గరే ఉంచుకుని కూడా ఏదో జరిగిందని ప్రశ్నిస్తున్నారు" అని నారా లోకేశ్ వివరించారు.