Amaravati Inner Ring Road Case: చంద్రబాబుకు కాస్త ఊరట, సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని కోర్టు ఆదేశాలు, రైట్ టు ఆడియెన్స్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
AP CM N Chandrababu Naidu (Photo Credit: ANI)

Vjy, Oct 11: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. అంగళ్లు కేసులో 12వ తేదీ (గురువారం) వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులోనూ 16వ తేదీ (సోమవారం) వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రెండు కేసుల్లోనూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును ఆయన తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ కోరారు. కేసుల్లో విచారణకు సహకరిస్తామని న్యాయస్థానానికి తెలిపారు.

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా, సుప్రీంకోర్టులో తమ వాదనలను గట్టిగా వినిపించిన ఇరు పక్షాల న్యాయవాదులు

ఈ విషయంపై సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు సూచించింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ పెండింగ్‌లో ఉందని కోర్టుకు ఏజీ శ్రీరామ్‌ తెలిపారు. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం రెండు కేసుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను హైకోర్టు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగళ్లు కేసులో గురువారం వరకు అరెస్టు, పీటీ వారెంట్‌ అడగమని హైకోర్టుకు పోలీసులు హామీ ఇచ్చారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో పీటీ వారెంట్‌పై హైకోర్టు స్టే ఇచ్చింది.

ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన రైట్ టు ఆడియెన్స్ పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది. అంగళ్లు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను, జరిగిన పరిణామాలను ఏసీబీ కోర్టు జడ్జికి ఇరు పక్షాలకు చెందిన న్యాయవాదులు వివరించారు. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంటుపై వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఐడీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.