Andhra Pradesh Shocker: కరస్పాండెంట్ రూపంలో కామాంధుడు, మత్తు టాబ్లెట్లు ఇచ్చి విద్యార్థినిపై నాలుగు నెలలుగా అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక
బాలికపై లైంగిక దాడి చేసిన ఘటనలో హెల్పింగ్ హ్యాండ్స్ పాఠశాల కరస్పాండెంట్ అరవై ఏళ్ల విజయకుమార్‌ను (Helping Hands School correspondent) అరెస్టు చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ సుంకర మురళీమోహన్ వివరించారు.
Kakinada, June 6: కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ వక్రబుద్ధి చూపించాడు. బాలికపై లైంగిక దాడి చేసిన ఘటనలో హెల్పింగ్ హ్యాండ్స్ పాఠశాల కరస్పాండెంట్ అరవై ఏళ్ల విజయకుమార్‌ను (Helping Hands School correspondent) అరెస్టు చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ సుంకర మురళీమోహన్ వివరించారు. ఆదివారం స్థానిక దిశ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాకినాడ కొండయ్యపాలెంలోని హెల్పింగ్ హ్యాండ్స్ స్కూల్ కరస్పాండెంట్ విజయకుమార్ అదే స్కూల్ వసతి గృహంలో ఉండే 9వ తరగతి విద్యార్థిని (14)కి మత్తు టాబ్లెట్లు ఇచ్చి నాలుగు నెలలుగా పలుమార్లు లైంగిక దాడి (Sexual assault) చేశాడు. ఆ బాలిక గర్భం దాల్చింది. వేసవి సెలవులు కావడంతో గొడారిగుంటలోని తన ఇంటికి ఆమె వెళ్లింది. రెండు రోజులుగా బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె తల్లికి విషయం చెప్పింది.
తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు విజయకుమార్‌ను అరెస్టు చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు దిశ డీఎస్పీ మురళీమోహన్ తెలిపారు. ఇదే స్కూల్‌లో 40 మంది విద్యార్థులు ఉన్నారని, స్కూల్‌కు సంబంధించి పూర్తి దర్యాప్తు జరుగుతుందని వివరించారు.