Hussain Sagar Boat Fire Mishap: హుస్సేన్‌సాగర్‌లో అగ్ని ప్రమాదం, గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం, బోటు ప్రమాదంలో ఇద్దరు మృతి
రంగంలోకి దిగిన పోలీసులు, డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది ఏడు బోట్లపై సాగర్ నీటిలో గాలింపు చేపట్టారు. 45 గంటలపాటు గాలింపు చేపట్టి మంగళవారం సాయంత్రం ట్యాంక్ బండ్ సమీపంలో అజయ్ మృతదేహాన్ని గుర్తించారు.
Hyd, Jan 28: భరతమాత మహాహారతి కార్యక్రమం ముగింపు సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో గల్లంతైన యువకుడి మృత దేహం ఎట్టకేలకు లభ్యమైంది. ఆదివారం రాత్రి హుస్సేన్‌సాగర్‌లో బాణసంచా కాల్చేటప్పుడు చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో (Hussain Sagar Boat Fire Mishap) సిల్వేరు అజయ్(21) ఆచూకీ దొరకలేదు. అజయ్.. గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
అక్కడే చదువుకునే సాయి సందీప్, రాఘవేంద్ర అతడి మిత్రులు. రాఘవేంద్ర గతంలో టపాసులు కొనుగోలు చేసినప్పుడు మణికంఠ అనే వ్యాపారికి డబ్బులు ఇవ్వలేదు. ఆ సొమ్ము ఇచ్చేందుకు మణికంఠకు ఫోన్ చేయగా, ఆయన భరతమాతకు మహాహారతి కార్యక్రమంలో బాణసంచా కాల్చేందుకు హుస్సేన్‌సాగర్ వచ్చినట్లు చెప్పాడు. దాంతో అజయ్‌కి చెందిన బైక్‌పై ముగ్గురూ అక్కడికి వెళ్లారు. డబ్బులు ఇచ్చి మణికంఠతో పాటు సాగర్‌లోకి వెళ్లారు.
హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో రెండు బోట్లు, ప్రమాద సమయంలో బోట్స్‌లో 15 మంది
బాణసంచా కాలుస్తున్న సమయంలో ప్రమాదం జరిగి బోటులో ఉన్న అందరూ చెల్లాచెదురయ్యారు. గాయపడిన సాయి సందీప్, రాఘవేంద్ర అర్ధరాత్రి 2 గంటల సమయంలో గాంధీ ఆసుపత్రిలో కలుసుకున్నారు. అజయ్ జాడ తెలియకపోవడంతో పోలీసులు, తల్లిదండ్రులు జానకిరామ్, నాగలక్ష్మికి చెప్పగా.. వారు రాత్రి 3.30 గంటలకు సచివాలయ (లేక్) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
B-tech Student Ajay Body Found
సోమవారం ఉదయం రంగంలోకి దిగిన పోలీసులు, డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది ఏడు బోట్లపై సాగర్ నీటిలో గాలింపు చేపట్టారు. 45 గంటలపాటు గాలింపు చేపట్టి మంగళవారం సాయంత్రం ట్యాంక్ బండ్ సమీపంలో అజయ్ మృతదేహాన్ని గుర్తించారు. బాణసంచా పేలుస్తుండగా జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గణపతి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.గణపతి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా అని, దాదాపు 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు.