IT Summons to Facebook&Twitter: ఫేస్‌బుక్, ట్విటర్‌కు కేంద్రం భారీ షాక్, ఈనెల 21వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు జారీ
ఇందులో భాగంగా ఫేస్‌బుక్, ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం సమన్లు (IT Summons to Facebook&Twitter) జారీ చేసింది. ఈ నెల 21వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
New Delhi, Jan 18: సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం, నివారణపై చర్చించడానికి ఐటీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సీరియస్ అయింది. ఇందులో భాగంగా ఫేస్‌బుక్, ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం సమన్లు (IT Summons to Facebook&Twitter) జారీ చేసింది. ఈ నెల 21వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు అందించిన ఆధారాలతో పార్లమెంటరీ కమిటీ ప్రతినిధులు (Parliamentary panel) ఆ సంస్థల ప్రతినిధులతో చర్చించనున్నారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై చర్చ జరుగుతున్న సమయంలో సమన్లు జారీ చేయడం గమనార్హం. డిజిటల్ ప్రపంచంలో మహిళలకు భద్రతపైన కూడా చర్చించనున్నారు. గత అక్టోబర్‌లో సమాచార భద్రత, గోప్యతపై ఐటీ ప్యానెల్ సమన్లు జారీచేసింది.
సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన అంశంపై ఈ సమావేశంలో మాట్లాడనున్నారు. డిజిటల్ రంగంలో పౌరుల హక్కుల రక్షణ, సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో ప్రధానంగా మహిళల భద్రత విషయమై ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల సోషల్ మీడియా సంస్థలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఒక పార్టీకి.. కొందరు నాయకులకు మద్దతుగా సోషల్ మీడియా వ్యవహరిస్తోందని గుర్తించారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై నియంత్రణ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఫేస్‌బుక్, ట్విటర్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సంస్థల ప్రతినిధులతో 21వ తేదీన సమావేశమై కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. లేదా కొత్తగా నిబంధనలు విధించి వీటిని తప్పనిసరిగా అమలయ్యేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వాట్సాప్ వ్యక్తిగత వివరాల అప్డేట్‌పై రేగిన వివాదం నేపథ్యంలో ఈ భేటి ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా వాట్సాప్ ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి తేనున్న కొత్త ప్రైవసీ పాలసీని మరో మూడు నెలల పాటు వాయిదా వేసింది. మే 15 నుంచి కొత్త పాలసీని అమల్లోకి తెస్తామని ప్రకటించింది. అప్పటివరకు యథాతథ స్థితిని కొనసాగిస్తామని, ఎవరి ఖాతాలూ తొలగించబోమని స్పష్టం చేసింది. గత వారం వాట్సాప్.. కొత్త ప్రైవసీ పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటామని, దానికి అంగీకారం తెలిపిన వారి ఖాతాలు మాత్రమే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆమోదం తెలపని వారి ఖాతాలను తొలగిస్తామని పేర్కొంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదే సమయంలో.. అనేక మంది దీనికి ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించారు. సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి యాప్‌ల వైపు అధిక శాతం మంది మొగ్గు చూపించారు. దీంతో.. వాటి డౌన్‌లోడ్‌లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అదే స్థాయిలో వాట్సాప్ కుదేలైంది. దీనిపై స్పందించిన ఆ సంస్థ సీఈవో.. తాము బిజినెస్ అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే షేర్ చేస్తామని, సాధారణ అకౌంట్ల జోలికి వెళ్లబోమని వివరణనిచ్చారు. అయినప్పటికీ విమర్శలు మాత్రం ఆగలేదు. దీంతో.. ఇక చేసేది లేక వాట్సాప్ నిర్ణయాన్ని మూడు నెలల పాటు వాయిదా వేసుకుంది. ఈ సమయంలో తాము వినియోగదారుల్లో పాలసీకి సంబంధించిన అపోహలు తొలగిస్తామని ప్రకటించింది.
మరోవైపు.. వాట్సాప్ ప్రకటించిన కొత్త ప్రైవసీ పాలసీ.. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని, దాన్ని వెంటనే వాపసు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరుతూ అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేసింది. ఇలాంటి పాలసీలను నియంత్రించేలా పటిష్ఠమైన చట్టాలను రూపొందించేందుకు కేంద్రానికి కూడా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది.