PhonePe-Indus App Store: పెద్ద స్కెచ్చే ఇదీ.. యాప్‌స్టోర్ మార్కెట్‌లో అడుగుపెట్టిన ఫోన్‌పే, గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ స్టోర్‌లకు పోటీగా సరికొత్త 'ఇండస్ యాప్‌స్టోర్' ఆవిష్కరణ!
IndusApp Store- PhonePe: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే ఇప్పుడు మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. మొబైల్ యాప్ మార్కెట్‌లో ప్రవేశిస్తూ తమ బ్రాండ్ నుంచి 'ఇండస్ యాప్‌స్టోర్' ను ప్రారంభించింది. ఇది గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లకు పోటీగా నిలవనుంది. వినియోగదారులు ఇప్పుడు ఇండస్ యాప్‌స్టోర్ ద్వారా కూడా తమ స్మార్ట్‌ఫోన్‌లలో వివిధ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్, PhonePe వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ సహా పలువురు స్టార్టప్ వ్యవస్థాపకుల సమక్షంలో ఇండస్ యాప్‌స్టోర్ ఆవిష్కరణ జరిగింది.
యూఎస్ టెక్ సంస్థలైన గూగుల్ మరియు ఆపిల్ కంపెనీలు తమ యాప్‌స్టోర్‌లలో జాబితా చేసే యాప్‌లకు యూజర్ ఛార్జీలు వసూలు చేస్తాయి. ముఖ్యంగా Google Play Store 11-26% పరిధిలో కమీషన్‌లను వసూలు చేస్తుంది. ఇటీవలే కొత్త యూజర్ ఛాయిస్ బిల్లింగ్ సిస్టమ్‌ను అమలు చేయడం ప్రారంభించింది. దీనిని భారతీయ స్టార్టప్‌లు వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఫోన్‌పే తమ ఇండస్ యాప్‌స్టోర్‌తో ముందుకు వచ్చింది. Indus Appstore.. యాప్ డెవలపర్‌లకు, యాప్‌లో చెల్లింపుల కోసం ఎలాంటి ప్లాట్‌ఫారమ్ రుసుము లేదా కమీషన్‌ను గానీ వసూలు చేయడం లేదు. అంతేకాకుండా డెవలపర్‌లు తమ యాప్‌లలో తమకు నచ్చిన ఏదైనా చెల్లింపు గేట్‌వేని ఏకీకృతం చేయడానికి కూడా స్వేచ్ఛను కల్పిస్తుంది. ఈ రకంగా Google మరియు Apple వంటి యూఎస్ సంస్థల ఏకపక్ష నిర్ణయాలకు చెక్ పెట్టినట్లు అయింది. భారతీయ స్టార్టప్ వ్యవస్థాపకులు, యాప్ డెవలపర్‌లు తమకు వచ్చే పేమెంట్స్ విషయంలో నియంత్రణ, యాప్‌లో కొనుగోళ్లపై అధిక కమీషన్ రేట్లను కోరుకుంటున్నారు, ఆ లోటును PhonePe పూరించాలనుకుంటోంది.
రీసెర్చ్ సంస్థ నివేదిక ప్రకారం, మొబైల్ యాప్‌లపై ఎక్కువ సమయం గడుపుతున్న దేశాలలో భారతదేశం టాప్ 5లో ఉంది. భారతీయులు ప్రతిరోజూ సగటున 4.8 గంటల పాటు మొబైల్ యాప్‌లలోనే గడుపుతున్నారు. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. US, UK, జపాన్ లేదా చైనాలోని వినియోగదారుల కంటే కూడా ఎక్కువగా భారతీయులు వివిధ యాప్‌లలో కాలం గడుపుతున్నారు.
2023లో సుమారు 26.4 బిలియన్ల యాప్ డౌన్‌లోడ్‌లతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద యాప్ డౌన్‌లోడ్‌ల దేశంగా భారత్ అవతరించింది. అందుకే వివిధ దేశాలకు చెందిన సంస్థలు తమ యాప్‌లను భారతదేశంలో లాంచ్ చేసి సొమ్ము చేసుకోవాలని ఆశపడతాయి.
గూగుల్, ఆపిల్ వంటి సంస్థలు కూడా ఎడాపెడా యూజర్ ఛార్జీలు వసూలు చేస్తూ భారీగా సంపద పోగేసుకుంటున్నాయి. అందుకే ఫోన్‌పే భారతీయ యాప్ మార్కెట్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. తమ సరికొత్త ఇండస్ యాప్‌స్టోర్ ద్వారా భారతదేశంలో నానాటికి పెరుగుతున్న యాప్ ఆర్థిక వ్యవస్థలో మార్కెట్ వాటాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ నివేదిక ప్రకారం, స్వదేశీ యాప్ ఎకానమీ 2030 నాటికి భారతదేశ జిడిపిలో దాదాపు 12% గా ఉండవచ్చు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫోన్‌పేది పెద్ద స్కెచ్చే అని!