Distress of Green: ఏదైనా దెబ్బ తగిలి రక్తం కారుతుంటే మనిషి, ఇతర జంతువులు బాధను వ్యక్తం చేస్తాయి. మరి పచ్చని చెట్లు, గడ్డి ఎలా తమ బాధను చెప్తాయి?
ఆ పసరు వాసన ఆ గడ్డికి ఏదైనా దెబ్బ తగిలి నొప్పి కలిగితే వచ్చే బాధ అని...
మనిషికి ఏదైనా చిన్న దెబ్బతగిలి రక్తం కారుతుంటే విలవిలలాడిపోతాడు. వెంటనే దానిని ఆపేందుకు ప్రథమ చికిత్స తీసుకుంటాడు. జంతువులైనా అంతే దెబ్బతగిలి అవి బాధపడుతుంటే తెలిసిపోతుంది. మరి పచ్చని చెట్లు, పచ్చని గడ్డి ఎలా తమ బాధను వ్యక్తం చేస్తాయి? మీకు తెలుసు కదా వాటికి కూడా ప్రాణం ఉంటుందని?
పచ్చని గడ్డిని కట్ చేస్తున్నప్పుడు ఒక రకమైన పసరు వాసన (Green Grass smell) అనేది వస్తుంది. ఆ పసరు వాసన ఆ గడ్డికి ఏదైనా దెబ్బ తగిలి నొప్పి కలిగితే వచ్చే బాధ అని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. ఆ వాసన ఎంత ఎక్కువ వస్తే ఆ గడ్డి అంత తీవ్రమైన నొప్పి, బాధ ఉన్నట్లు లెక్క. మనుషులు, ఇతర జంతువుల లాగా వాటికి నోరు ఉండదు, కన్నీళ్లు రావు. కానీ, ఆ పచ్చని గడ్డి దేహం ముక్కలుముక్కలవుతున్నపుడు అది చేసే హాహాకారాలు ఆ పసరు వాసన రూపంలో తెలియజేస్తుంది. తనను తాను రక్షించుకోవటానికి ప్రథమ చికిత్స లాగా ఆ పసరులాంటి ద్రవపదార్థాన్ని అది విడుదల చేస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. అది పచ్చగడ్డైనా, పచ్చని చెట్టు అయినా దానికి గాయం అయినపుడు అది వెదజల్లే ఒక వాసనే దాని నొప్పి తీవ్రతకు సంకేతం అని వారు వెల్లడించారు.
ఆకుపచ్చని మొక్కలకు గాయం అయినపుడు భాష్పీభవనం చెందే (ద్రవస్థితి నుంచి వాయు స్థితికి మారి గాలిలో వెదజల్లే) కొన్ని రకాల రసాయినిక సమ్మేళనాలను అవి గాలిలో విడుదల చేస్తాయి. వీటిని 'గ్రీన్ లీఫ్ వోలటైల్స్' (green leaf volatiles -GLVs) అంటారు. ఏదైనా మొక్కకు జంతువు వచ్చి గీరినప్పుడు లేదా మనుషులు వాటిని నరికివేసేటపుడు, వాటి కొమ్మలు విరిచివేస్తున్నపుడు వాటి నుంచి ఈ పదార్థాలు గాలిలో విడుదలవుతాయి. వివిధ రకాల మొక్కలు తమ గుణాన్ని బట్టి కొన్ని సువాసనలాగా అనిపించొచ్చు లేదా ఇంకొన్నిటి వాసన దుర్గందగానూ అనిపించవచ్చు. అది ఎలాంటి వాసన అయినా ఆ మొక్క ఆ క్షణంలో దాని నొప్పిని ఆ విధంగా వ్యక్తం చేస్తుందని చెబుతున్నారు.
అన్ని జీవులలాగే ఆ మొక్క కూడా తనకు గాయమైన చోట అప్పటికప్పుడు తనకుతానుగా ప్రథమ చికిత్స చేసుకుంటుంది. ఆ గాయం తొందరగా మానటానికి కొన్ని ద్రవాలు విడుదల కాబడతాయి, అక్కడ కొత్త కణాల పుట్టుక జరిగేలా మరికొన్ని ద్రవాలు. అలాగే ఏ ఇతర హానికర బాక్టీరియా, ఫంగస్ బారినుంచి గాయాన్ని కాపాడుకోవటానికి కొన్నిరకాల యాంటీబయాటిక్స్ ను కూడా ఆ మొక్క విడుదల చేసుకుంటుందని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది.
పచ్చగడ్డి గాయపడినపుడు విడుదలయ్యే రసాయనిక సమ్మేళనాల్లో 8 రకాల ఆక్సీకరణ చెందిన హైడ్రోకార్బన్లు, అల్డిహైడ్లు మరియు ఆల్కాహాల్స్ ఉండటంతో అవి పసరు వాసనను వెదజల్లుతూ ఏ జంతువు తనని తినకుండా కాపాడుకుంటుందని వెల్లడైంది.
ఇవి విడుదల కాబడటం వల్ల గాలిలో ఉండే ఆక్సిజన్ ఏ జీవి శ్వాసించటానికి వీలు లేని ఓజోన్ గా మారిపోతుంది. తద్వార స్వచ్చమైన గాలి అనేది లేకుండా పోతుంది.చాలావరకు పట్టణ, నగర ప్రాంతాల్లో ఉదయం దట్టమైన పొగ లేక గాలిలో మార్పుకనిపిస్తుంటుంది. దీనిని 'ఫోటోకెమికల్ స్మాగ్' అంటారు. అంటే గాలిలో ఒజోన్, నైట్రోజన్ పరిమాణాలు పెరిగి అవి సూర్యకాంతితో సంయోగం చెంది వాతావరణం విషతుల్యం అవుతుంది. అక్కడి జనాలు అస్తమా లాంటి శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతో బాధపడుతుంటారు. దీని అర్థం అక్కడ పచ్చని చెట్లు విపరీతంగా నరికివేయబడి వాతావరణం విషతుల్యంగా మారినట్లు సూచిస్తుంది.
దీనిని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఈ భూమి మీద మనుషులు, ఇతర జంతువులే కాదు చెట్లు కూడా బ్రతకాలి, వాటిని బ్రతికించాలి, నలుగురికి బ్రతుకునివ్వాలి. ఇది అందరి అవసరం.