Honda Cross Cub 110: హోండా నుంచి ఆసక్తికరమైన 'క్రాస్ కబ్ 110' ద్విచక్రవాహనం విడుదల, లీటరుకు 67 కిమీ మైలేజీ, దీని ధర ఎంత, ఇతర ప్రత్యేకతలు ఏమున్నాయో ఇక్కడ తెలుసుకోండి!
Honda Cross Cub 110: ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా, సరికొత్తగా 'క్రాస్ కబ్ 110' పేరుతో ఒక ద్విచక్రవాహనాన్ని విడుదల చేసింది. ఇది చూడటానికి సరుకు రవాణాకు ఉపయోగపడే మోపెడ్ బైక్‌లాగా కనిపిస్తుంది, అయితే అద్భుతమైన డిజైన్, ఆకట్టుకునే కలర్ స్కీమ్‌లతో ఈ బైక్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా దీనికి అందించిన ఆఫ్-రోడ్ రెడీ టైర్లు, ఫోర్క్ గైటర్‌లు, హెడ్‌లైట్ గార్డ్, మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ ఈ ద్విచక్రవాహనానికి ఒక యూత్ ఫుల్ స్పోర్ట్ లుక్‌ను తీసుకువచ్చాయి. ఎంతో ఆసక్తికరమైన ఈ 'హోండా క్రాస్ కబ్ 110' ద్విచక్రవాహనంలో ఎలాంటి ఇంజన్ ఉంటుంది, దీని ధర ఎంత? మొదలైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
2024 Honda Cross Cub 110 ఇంజన్ సామర్థ్యం
కొన్నేళ్ల కిందట హోండా బ్రాండ్ నుంచి జపాన్ మార్కెట్లో విడుదల చేసిన ప్రసిద్ధ కబ్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఈ 'క్రాస్ కబ్ 110' ద్విచక్రవాహనాన్ని కంపెనీ రూపొందించింది. పేరుకు తగినట్లుగా ఇందులో 110cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. దీనిని 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు, ఈ ఇంజన్ కేవలం 8bhp వద్ద 0.8 kgm గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ గంటకు 85 కిమీ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.
ఈ ద్విచక్రవాహనం బరువు కూడా 106 కిలోల బరువుతో చాలా తేలికైనదిగా అనిపిస్తుంది. ఈ గణాంకాలను బట్టి ఇది అడ్వెంచర్ బైక్ కాదు, కేవలం రోజూవారీ అవసరాలకు ఉపయోగపడే బైక్ అని అర్థం అవుతుంది. సిటీలో మంచి మైలేజీని అందిస్తుంది. నివేదికల ప్రకారం ఇది లీటర్ పెట్రోలుకు 67 కిమీ మైలైజీ అందిస్తుంది. దీని ఇంధన ట్యాంకు సామర్థ్యం కూడా 4.3 లీటర్లుగా ఉంది. కాబట్టి ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే సుమారు 280 కిమీ దూరం ప్రయాణించవచ్చు.
2024 Honda Cross Cub 110 ధర ఎంత
హోండా క్రాస్ కబ్ 110 ద్విచక్రవాహనం ప్రస్తుతం చైనాలో విక్రయానికి అందుబాటులోకి వచ్చింది. అక్కడ దీని ధర CNY 13,000. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1.49 లక్షలు. అయితే ఇది నేరుగా భారత మార్కెట్లో విడుదల అవుతుందా అనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ ఈ ద్విచక్రవాహనం భారత మార్కెట్లో విడుదలైతే, సేల్స్ చేసేవారికి, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ధరను మరింత తగ్గించాల్సి ఉంటుంది.