2024 Range Rover Evoque: రేంజ్ రోవర్ ఎవోక్ ఇప్పుడు మరింత కొత్తగా, పాత మోడల్ కంటే ధర తక్కువ!
2024 Range Rover Evoque: లగ్జరీ కార్ల తయారీదారు జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) తమ బ్రాండ్ కార్లలో పాపులర్ మోడల్ అయిన 'రేంజ్ రోవర్ ఎవోక్' కారును మరింత నవీకరించి సరికొత్తగా విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ సరికొత్త రేంజ్ రోవర్ ఎవోక్ కార్ల ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 67.90 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న పాత మోడల్ రేంజ్ రోవర్ ఎవోక్ కారు కంటే ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ మరిత చౌక ధరకే లభిస్తుంది. పాత మోడల్ కంటే 2024 రేంజ్ రోవర్ ఎవోక్ కారు సుమారు రూ. 5.17 లక్షల తక్కువ ధరకు లభిస్తుంది.
2024 Range Rover Evoque కారు రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తుంది, అలాగే ఐదు ఆకర్షణీయమైన పెయింట్ షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది. కొత్త మోడల్ ను అదనంగా కొరింథియన్ కాపర్, ట్రిబెకా బ్లూ అనే రంగుల్లో అందిస్తున్నారు.
5 మంది సౌకర్యవంతంగా ప్రయాణించగలిగే ఈ SUV డిజైన్ పరిశీలిస్తే.. ముందు భాగంలో సిల్హౌట్, కొత్తగా రూపొందించిన ఫ్రంట్ గ్రిల్, సిగ్నేచర్ DRLలతో కూడిన కొత్త LED హెడ్‌ల్యాంప్‌లు, రెడ్ బ్రేక్ కాలిపర్‌లు, పైన ఫ్లోటింగ్ రూఫ్, కింద డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
ఇంటీరియర్ పరిశీలిస్తే, క్యాబిన్ లోపల సరికొత్త పివి ప్రో టెక్నాలజీతో కూడిన 11.4-అంగుళాల కర్వ్డ్ గ్లాస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, రెండు-జోన్ క్లైమేట్ కంట్రోల్, హీటెడ్ - వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫైయర్, 3D సరౌండ్ వ్యూ, క్లియర్‌సైట్ గ్రౌండ్ ఉన్నాయి.
2024 Range Rover Evoque ఇంజన్ సామర్థ్యం
ఈ 'రేంజ్ రోవర్ ఎవోక్ 2024' మోడల్ కారు అధునాతన మైల్డ్-హైబ్రిడ్ ఎలక్ట్రిక్ (MHEV) ఇంజిన్‌ను కలిగి, పెట్రోల్- డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. అందుకనుగుణంగా ఇంజన్ సామర్థ్యంలో స్వల్పంగా తేడా ఉంది. పెట్రోల్ వెర్షన్ లో 2.0-లీటర్ గ్యాసోలిన్ మోటార్ ఇంజన్ ఉంటుంది. ఇది 247bhp పవర్ మరియు 365Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక డీజిల్ వెర్షన్ ఇంజన్ 201bhp పవర్ కలిగి, 430Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంధనం పొదుపు చేసేవిధంగా స్టార్ట్-స్టాప్ సమయంలో ప్రత్యేకమైన ఆపరేషన్ సిస్టమ్ ఉంది. ఇందులో అమర్చిన 48 V లిథియం-అయాన్ బ్యాటరీలో శక్తి నిల్వ చేయబడుతుంది.
సరికొత్త 2024 రేంజ్ రోవర్ ఎవోక్ కారు ప్రస్తుతం మార్కెట్లోని బీఎండబ్ల్యూ X3, మెర్సిడెజ్ బెంజ్ GLC, ఆడి Q5 వంటి లగ్జరీ SUVలకు పోటీగా నిలవనుంది.