Coriander Price Hike: ఉల్లిగడ్డతో పోటీకి కొత్తిమీర సై, అమాతంగా పెరిగిన ధర, 2రూపాయిల నుంచి 17 రూపాయిలకు చేరిక, నవంబర్ నెలలో ఇంకా పెరిగే అవకాశం
ఇందులోని సి,కె. ఐరన్, క్యాల్షియం వంటివి పుష్కలంగా వున్నాయి.
Mumbai, October 15: కొత్తిమీర వంటకాలకు మంచి సువాసనను ఇవ్వడమే కాకుండా బరువును తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులోని సి,కె. ఐరన్, క్యాల్షియం వంటివి పుష్కలంగా వున్నాయి. ఎముకలకు కొత్తిమీర మేలు చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర ధర పైపైకి ఎగబాకుతోంది. మొన్నటి వరకు 2రూపాయిలు ఉన్న కట్ట ఇప్పుడు ఏకంగా 17రూపాయలకు చేరింది. కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కొత్తిమీర ధర అమాంతంగా పెరిగింది.దీంతో రైతులు ఈ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు క్వింటా ధర రూ.5,890గా ఉంది.కాగా హోసూరు, డెంకణీకోట, సూళగిరి ప్రాంతాల్లో ఈ పంటను సుమారు రెండు వేల ఎకరాల్లో సాగు చేస్తు న్నారు. అతి తక్కువ పెట్టుబడి, తక్కువ వ్యవధిలో చేతికొచ్చే పంటల్లో కొత్తిమీర ఒకటి. ఎకరాకు కేవలం రూ. 25 వేల నుంచి 30 వేల వరకు పెట్టుబడి అవుతోంది. 40 రోజులకెల్లా కోతకు వస్తుండడంతో చిన్న, సన్నకారు రైతులు దీని వైపు మొగ్గు చూపుతున్నారు.
10 రోజుల కిందట కట్ట ధర రూ. 2 నుంచి 5 వరకు ఉండేది. ప్రస్తుతం దీని ధర రూ. 10 నుంచి 15 వరకు ధర పలుకుతుండడంతో దీన్ని సాగు చేస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైగా కర్ణాటక తదితర ప్రాంతాల్లో ఇటీవల పలు చోట్ల భారీ వర్షాలు కురవడం, మంచు కాలం సమీపిస్తుండడం, పండుగుల, పెళ్ళిళ్ళ సీజన్ కూడా కావడంతో మంచి ధర పలుకుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో సాగుచేసే కొత్తిమీరను కోవై, తిరుచ్చి, చైన్నై, సేలం నగరాలకు మాత్రమే కాక, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.
కాగా నవంబర్ లో దీని ధరలు ఇంకా పైకి వెళ్లే అవకాశం ఉందని National Commodity and Derivative Exchange తెలిపింది. వచ్చే నెలలో దీని ధర సుమారుగా 51 రూపాయల వరకు ఉంటుందని చెబుతోంది. అలాగే క్వింటా రూ. 6 వేల వరకు పలుకుతుందని అంచనా. మార్కెట్లో దీనికి ఉన్న కొరత కారణంగా ఒక్కసారిగా ధరలు పైపైకి ఎగబాకాయి.