Panipat: ఇంకోసారి భారతదేశం వైపు ఎవరూ కన్నెత్తి చూసే సహాసం చేయాలన్నా భయపడే విధంగా జరిగిన మహా 'పానిపట్' యుద్ధం మరోసారి వీక్షించడానికి సిద్ధం కండి!
పానిపట్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు....
1761వ సంవత్సరంలో దిల్లీకి ఉత్తరాన 97 కిలోమీటర్ల దూరంలో పానిపట్ ప్రాంతంలో మరాఠా సామ్రాజ్యానికి మరియు భారత దేశాన్ని తమ హస్తగతం చేసుకోవాలని లక్షమంది సైన్యాన్ని వెంటవేసుకుని వచ్చిన అఫ్ఘనిస్తాన్ సామ్రాజ్యవాదులకు మధ్య జరిగిన మహా సంగ్రామం, మూడవ పానిపట్ యుద్ధం నేపథ్యంలో బాలీవుడ్ లో 'పానిపట్' (Panipat) పేరుతో సినిమా తెరకెక్కుతుంది. లగాన్, స్వదేశ్, జోదా అక్బర్ లాంటి చిత్రాలు రూపొందించిన అశుతోష్ గొవారికర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మరాఠా సామ్రాజ్య సర్వసైన్యాధ్యక్షుడు సదాశివ్ రావ్ భవ్ (Sadashivrao Bhau) పాత్రలో అర్జున్ కపూర్ (Arjun Kapoor), అతడి భార్య పార్వతి బాయి పాత్రలో క్రితిసనన్ (Kriti Sanon) నటిస్తుండగా, వీరి శత్రువర్గం అయిన అహ్మద్ షాహ్ అబ్దాలీ (Ahmad Shah Abdali) పాత్రలో సంజయ్ దత్ (Sanjay Dutt) నటిస్తున్నారు.
భారత దేశాన్ని దురాక్రమించాలని ఒకరు, దేశాన్ని కాపాడాలని ఒకరు ఇలా రెండు సామ్రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాన్ని ఆవిష్కరించబోతున్నారు. పానిపట్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.
Check Out The Trailer Of Panipat Below:
( స్వేచ్ఛ కోసం జరిగిన మొట్టమొదటి తిరుగుబాటు, సైరా నరసింహా రెడ్డి ట్రైలర్‌తో ఈ ట్రైలర్‌ను పోల్చి చూడండి, మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి).
'ఒక్క చిన్న మట్టి తునక (రాజ్యం కోసం) ప్రాణాలు వదులుకుంటావా'? అని శత్రురాజ్య నాయకుడు అడిగినపుడు 'నా మాతృభూమిలోని ఒక చిన్ని మట్టి రేణువు కోసం చావడానికైనా సిద్ధం' అని మరాఠా యోధుడి నుంచి వచ్చే సమాధానం రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది.
ఈ సినిమా ట్రైలర్ చూస్తే భారీ నిర్మాణ విలువలతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. లక్షమంది సైన్యం, యుద్ధ సామాగ్రి, మహా యుద్ధం ఇలా ప్రతీదానిలో భారీతనం ఉట్టిపడుతుంది. దేశంకోసం కోసం జరిగిన ఈ యుద్ధంలో ఇద్దరు భారతీయులే శత్రువులతో చేతులు కలిపి నమ్మకద్రోహం చేశారని చరిత్ర చెబుతుంది. అదే అంశాన్ని ఈ సినిమాలోనూ చూపించనున్నారు. మరి ఆ మహాసంగ్రామాన్ని కన్నులారా వీక్షించాలంటే, డిసెంబర్ 06న పానిపట్ విడుదలవుతుంది.