Saaho Final Report: సాహో తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిందా, తగ్గిందా? ఈ సినిమాకు నెగెటివ్ టాక్ ఎందుకొచ్చింది? బాలీవుడ్‌లో సాహో ఫ్లాప్ అయిందా? అన్ని వర్గాల అభిప్రాయాల ఆధారంగా ఒక రిపోర్ట్.

ఈ సినిమాకు ఏ మాత్రం సౌత్ టచ్ ఇవ్వలేదు. పూర్తిగా బాలీవుడ్ సినిమాను తలపిస్తుంది. "కట్టె కొట్టె తెచ్చే" విధంగా సాహో స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే..

Prabhas and Shraddha Kapoor in Saaho (Photo Credits: UV Creations)

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమాతో వరల్డ్ వైడ్‌గా, ఇండియా వైడ్‌గా ప్రభాస్‌కు మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభాస్- శ్రద్ధా కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'సాహో' (Saaho) సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు బాహుబలి (Bahubali) సినిమా క్వాలిటీని, సాహో సినిమా క్వాలిటీని పోల్చుకుంటున్నారు. సాహో సినిమా ప్రభాస్ స్టార్‌డమ్‌ను పెంచిందా, తగ్గించిందా? బాలీవుడ్ ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఉత్తర భారత ప్రేక్షకుల అభిప్రాయాలే ఎందుకంటే సాహో సినిమా పూర్తిగా బాలీవుడ్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి తీసినట్లే అనిపిస్తుంది. సినిమా నేపథ్యం, యాక్టర్స్ చాలా మంది బాలీవుడ్‌కు చెందినవారే. ఈ సినిమాకు కలెక్షన్లు కూడా అక్కడి నుంచే వస్తున్నాయి.

అసలు సాహో సినిమా ఎలా ఉందంటే కథ ముంబైలో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత విదేశాల్లోకి వెళ్లిపోతుంది. ఈ సినిమాకు ఏ మాత్రం సౌత్ టచ్ ఇవ్వలేదు. పూర్తిగా బాలీవుడ్ సినిమాను తలపిస్తుంది. కథలో హీరో ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్, వేల కోట్లు కొట్టేసిన దొంగను పట్టుకునే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో చేరతాడు. ట్విస్ట్ ఏందంటే, ఈ అండర్ కవర్ పోలీస్ ఆఫీసరే అసలైన దొంగ. పోలీసులకు దొరకకుండా అదే స్పెషల్ టీంలో అండర్ కవర్‌గా చేరతాడన్నమాట. ఇక్కడ దోపిడి చేసి, విదేశాలకు వెళ్లిపోతాడు. అక్కడ మాఫియా ఎంటర్ అవుతుంది. అక్కడ ఒక అండర్ వరల్డ్ డాన్ కోసం పనిచేస్తాడు. తర్వాత ఆ అండర్ వరల్డ్ డాన్‌నే చాలా తెలివిగా హతమారుస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏందంటే ఆ అండర్ వరల్డ్ డాన్ స్థానం గతంలో సాహో తండ్రిది. కాబట్టి తన నాన్నను చంపిన వారిపై పగ తీర్చుకొని, ఆయన స్థానాన్ని సాహో తిరిగి ఆక్రమించుకుంటాడు. ఇది చూపించే క్రమంలో ఫ్లాష్‌బ్యాక్ స్టోరీలు, ట్విస్ట్‌లు ఎదురవుతూనే ఉంటాయి.

"కట్టె కొట్టె తెచ్చే" విధంగా సాహో స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే.. పోలీస్ నుంచి దొంగ, దొంగ నుంచి అండర్ వరల్డ్ కింగ్.

ఇలాంటి సినిమాలు బాలీవుడ్‌లో వందలు వచ్చాయి. బాలీవుడ్‌లో వచ్చిన ధూమ్, రేస్ సినిమాలలోని సన్నివేశాలను మిక్స్ చేసి కొట్టినట్లే అనిపిస్తుంది. అసలే అక్కడ మంచి కథలు లేక బాలీవుడ్, సౌత్ సినిమాల వైపు చూస్తుంటే, మళ్ళీ ఒక పాత కథనే కొత్త పేరు పెట్టి అక్కడివారికి చూపించినట్లు సాహో సినిమా ఉంది.

ఈ సినిమా కథంతా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కామెడీ లేకుండా సీరియస్‌గా సాగుతుంది. మధ్యమధ్యలో వచ్చే పాటలు, ఇంటర్వెల్ కొంత రిలీఫ్ కలిగిస్తాయి. డైరెక్టర్ సుజీత్ కథపై కాకుండా యాక్షన్, ట్విస్ట్‌లపైనే ఎక్కువ ఫోకస్ చేశాడు.

హీరో ఇంట్రొక్షన్ అదిరిపోవాలి, ఇంట్రవెల్ బ్యాంగ్ అదిరిపోవాలి, క్లైమాక్స్ అదిరిపోవాలి, ఇక్కడో భారీ ఫైట్ ఉండాలి, అక్కడో ఛేజింగ్ సీన్ ఉండాలి అనుకొని ఆ సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా అనిపిస్తుంది.

సాధారణ ప్రేక్షకుడికి ఈ సినిమా కథ చాలా క్లిష్టంగా అనిపిస్తుంది. అందుకే ఈ సినిమాకు మొదటి నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ సాహో కలెక్షన్లు మాత్రం భారీగానే రాబట్టింది. 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కోట్ల కలెక్షన్లను సాధించింది.

వరుస సెలవులు రావడంతో ఈ వీకెండ్‌లో సాహో హిందీ వెర్షన్ సినిమా రూ. 93 కోట్ల కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.  అయితే బాహుబలి రికార్డును మాత్రం ఛేదించలేకపోయింది.  గతంలో బాలీవుడ్‌లో బాహుబలి సినిమా ఒక్క వీకెండ్‌లోనే రూ. 128 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లను నమోదు చేసింది, ఎన్ని సినిమాలు పోటీ వచినా బాహుబలి కలెక్షన్లను ఆపలేకపోయాయి. ఇప్పుడు వేరే సినిమా లేకపోవడంతో సాహోకు ప్లస్ గా మారింది.

ఇక చివరగా చెప్పాలంటే ప్రభాస్ కెరియర్‌లో ఇప్పటివరకూ బాహుబలినే అత్యుత్తమం. సాహో కేవలం తెలుగు రాష్ట్రాల్లోని "డైహార్డ్ ఫ్యాన్స్" కు మాత్రమే నచ్చుతుంది.