Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ, ముంబై నానావతి ఆసుపత్రిలో చేరిక, త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖుల సంఘీభావం
చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాను, ఈ విషయాన్ని అధికారికంగా తెలియపరుస్తున్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారికి సంబంధించిన రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. ఇక నాతో....
Mumbai, July 12: ప్రముఖ నటుడు, బాలీవుడ్ షహన్‌షా అమితాబ్ బచ్చన్ కు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను చికిత్స కోసం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేర్చారు. శనివారం సాయంత్రమే అమితాబ్ ఆసుపత్రిలో చేరినటువంటి సమాచారం బయటకు వచ్చినప్పటికీ ఆయన ఏ కారణం చేత చేరారనేది మాత్రం తెలియరాలేదు. ఎట్టకేలకు అమితాబే స్వయంగా ట్విట్టర్ ద్వారా తనకు కొవిడ్ సోకినట్లు ధృవీకరించారు. తనతో పాటు తనకు సన్నిహితంగా మెలిగిన ప్రతీ ఒక్కరు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా బిగ్ బీ అభ్యర్థించారు.
"నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాను, ఈ విషయాన్ని అధికారికంగా తెలియపరుస్తున్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారికి సంబంధించిన రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. ఇక నాతో పాటుగా గత 10 రోజులుగా కలియదిరిగిన వారందరూ కూడా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను" అంటూ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు.
ఇదే ఆయన్ చేసిన ట్వీట్:
అయితే కొద్దిసేపటికి ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అభిషేక్ కూడా అదే నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తమకు లక్షణాలు తక్కువగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు.
Here's Tweet from Abhishek:
ఆదివారం సాయంత్రం నాటికి వచ్చిన రిపోర్టులతో అభిషేక్ భార్య ఐశ్వర్య రాయ్ మరియు కూతురు ఆరాధ్యకు కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.
ఇలా అమితాబ్ బచ్చన్ కుటుంబం మొత్తం కరోనాబారిన పడటంతో బచ్చన్ ఫ్యామిలీ అభిమానులను మరియు బాలీవుడ్ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తుంది.
ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ వయసు 77 ఏళ్లు, ఆయనకు కొవిడ్ సోకి ఆసుపత్రిలో చేరారన్న విషయం తెలియగానే దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులందరూ బాలీవుడ్ మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.
"మీరు అతిత్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తారు! ఛాంపియన్!!" అంటూ తాప్సీ పన్ను ట్వీట్ చేయగా, “త్వరగా కోలుకోండి సార్” అని సోను సూద్ ట్వీట్ చేశారు.
అమితాబ్ నటించిన 'గులాబో సీతాబో' సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఆయన నటించిన మరో రెండు చిత్రాలు ఝుండ్ మరియు చెహ్రే సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర' అనే సినిమాలో అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా 'కౌన్ బనేగా కరోడ్‌పతి' 12వ ఎడిషన్లో కూడా అమితాబ్ పనిచేయాల్సి ఉంది, అయితే కరోనా నేపథ్యంలో 65 ఏళ్లకు పైబడిన నటులకు షూటింగ్స్‌లలో పాల్గొనేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఆ షో చిత్రీకరణ ఆలస్యమవుతోంది. అయితే, మనమంతా అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం!