Bheemla Nayak: తీరం దాటిన 'పవర్' తుఫాన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సర్ప్రైజ్, భీమ్ భీమ్ 'భీమ్లా నాయక్' టైటిల్ ట్రాక్‌ రిలీజ్

ఈడగాదు ఆమిరోళ్ల మేడగాదు, గుర్రం నీళ్లగుట్టకాడ, అలుగు వాగు తండాలోనా బెమ్మజముడు చెట్టున్నాది.. బెమ్మజముడు చెట్టుకింద అమ్మో నెప్పులు పడుతున్నాది, ఎండలేదు రేతిరిగాదు ఏగుసుక్క పొడవంగానే పుట్టింటాడు పులిపిల్ల.. భీమ్లా నాయక్, శభాష్ భీమ్లా నాయకా' ...

Pawank Kalyan's Bheemla Nayak | Photo: twitter Aditya Music

Pawan Kalyan- భీమ్లా నాయక్ సర్ప్రైజ్ వచ్చేసింది. ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పోలీసాఫీసర్‌గా నటిస్తున్న 'భీమ్లా నాయక్' సినిమా నుంచి టైటిల్ ట్రాక్ విడుదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ స్వరపరిచిన ఈ పవర్ ఫుల్ పాట పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరినీ ఊగిపోయేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

దట్టమైన అడవి దారుల నడుమ నుండి ఉదయిస్తున్న సూర్యుని ప్రకాశంలో మెల్లిగా సంగీతం మొదలవుతూ.. 'ఆడగాదు.. ఈడగాదు ఆమిరోళ్ల మేడగాదు, గుర్రం నీళ్లగుట్టకాడ, అలుగు వాగు తండాలోనా బెమ్మజముడు చెట్టున్నాది.. బెమ్మజముడు చెట్టుకింద అమ్మ నెప్పులు పడుతున్నాది, ఎండలేదు రేతిరిగాదు ఏగుసుక్క పొడవంగానే పుట్టింటాడు పులిపిల్ల.. భీమ్లా నాయక్, శభాష్ భీమ్లా నాయకా' అని ఒక జానపద గానంతో ఇంట్రొడొక్షన్ ఇవ్వడం ఒక హైలైట్ అయితే, ఆ తర్వాత అసలు పాట మరో హైలెట్ అనిపిస్తుంది. రామజోగయ్య శాస్త్రి ప్రతి పదం ఉరుములా అనిపిస్తుంది, సాహిత్యంతో పవర్ తుఫాను సృష్టిస్తుంది.  ఎస్ .థమన్ తన టీమ్‌తో పాటు అడవిలో ప్రచార వీడియోను షూట్ చేయడం ద్వారా ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇది ఒరిజినల్ ట్రాక్ కోసం సరైన మూడ్‌ను సెట్ చేస్తుంది.

Bheemla Nayak Title Song

రెండు వారాల క్రితం విడుదలైన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లిమ్స్ కూడా పవన్ కళ్యాణ్ రేంజ్ కు తగ్గట్లుగా పవర్ ఫుల్ గా ఉంది. లుంగీ కట్టులో, పోలీస్ యూనిఫాంలో పవన్ విజువల్స్, చెప్పే డైలాగ్స్ శక్తివంతంగా ఉన్నాయి. ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.  ఇవన్నీ సినిమాపై అంచనాలను అమాంతం పెంచుతున్నాయి.

#BheemlaNayak - First Glimpse 

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే కలిగి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న భీమ్లా నాయక్, వచ్చే ఏడాది సంక్రాతి బరిలో నిలుస్తూ జనవరి 12న విడుదల అవుతున్నాడు.