IndiaJoy Event: గేమింగ్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ రంగం అతిపెద్ద మార్కెట్, రాబోయే రోజుల్లో భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 'ఇండియా జాయ్' కార్యక్రమంలో టీఎస్ మంత్రి కేటీఆర్ వెల్లడి
2021 నాటికి తెలంగాణలో 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ఇమేజ్ (IMAGE -ఇన్నోవేషన్ ఇన్ యానిమేషన్, మల్టీమీడియా, గేమింగ్, ఎంటర్టైన్మెంట్) టవర్‌ను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేటీఆర్ తెలిపారు....
Hyderabad, November 21: ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులతో గేమింగ్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ (Gaming, technology and entertainment space) రంగాలలో పరిశ్రమల స్థాపనకు దక్షిణ ఏసియాలోనే ఒక కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం మారబోతుందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి (Minister for IT, Telangana) కేటీ రామారావు (KTR) అన్నారు. భారతదేశంలో నిర్వహించే అతిపెద్ద గేమింగ్, మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ 'ఇండియా జాయ్' (India Joy). హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెంషన్ సెంటర్ (HICC) లో ఈనెల 23 వరకు జరిగే ఈ ఈవెంట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరో అతిపెద్ద ఈవెంట్ కు హైదరాబాద్ వేదిక అయిందని చెప్పారు.
ఆయన మాట్లాడుతూ ఏనిమేషన్, వీఎఫ్ఎక్స్ టెక్నాలజీ కోసం హైదరాబాదులో ప్రపంచస్థాయి స్టూడియోలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. హాలీవుడ్ స్థాయిలో సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకునే విధంగా హైదరాబాదులో సౌకర్యాలు ఉన్నాయి, బాహుబలి, మగధీర, ఈగ లాంటి చిత్రాల కోసం వీఎఫ్ఎక్స్ వర్క్స్ అంతా హైదరాబాద్ లోనే జరిగిందని కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో 250 కి పైగా గేమింగ్ స్టార్టప్‌లు ఉన్నాయని, వాటి సంఖ్య పెరుగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే రూపుదిద్దుకున్న పాపులర్ 'చోటా భీమ్' (Chota Bheem) గేమ్‌ను మంత్రి కేటీఆర్ ఉదహరించారు. యానిమేషన్ పరిశ్రమ ప్రస్తుతం 270 బిలియన్ డాలర్ల అతి పెద్ద మార్కెట్ ను కలిగి ఉందని, సాంకేతిక పరంగా భారీ పురోగతి సాధించిందని అన్నారు.
KTR's Speech:
యానిమేషన్ రంగంలో కూడా ఒక ప్రాంతం యొక్క నేటివిటీకి తగినట్లుగా కంటెంట్‌ను తయారు చేయడం ఎంతో ముఖ్యం అని తెలిపారు. అంతేకాకుండా ఈ మార్కెట్ సామర్థ్యం చాలా పెద్దది కాబట్టి, OTT ప్లాట్‌ఫారమ్ (OTT streaming platform)లను ఉపయోగించడం అవసరం అని, తద్వారా మరింత మందికి ఆ కంటెంట్ చేరువవుతుందని మంత్రి పేర్కొన్నారు.
2021 నాటికి తెలంగాణలో 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక ఇమేజ్ (IMAGE -ఇన్నోవేషన్ ఇన్ యానిమేషన్, మల్టీమీడియా, గేమింగ్, ఎంటర్టైన్మెంట్) టవర్‌ను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేటీఆర్ తెలిపారు. ఇది ప్రపంచ దిగ్గజ గేమింగ్ కంపెనీలకు ఒక మంచి రీసోర్స్ కేంద్రంగా, ప్రతిభావంతులకు అవకాశాలు లభించే విధంగా ఉంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ తెలిపారు, అందుకు తమ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాకారం అందుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.