Bhainsa Shocker: భైంసా హింసాకాండ షాక్, కొడుకుల అరెస్ట్ తో తల్లిదండ్రుల హఠాన్మరణం, ఐకమత్యంగా ఇంటికి తరలివచ్చి సంతాపం తెలిపిన అన్ని వర్గాల ప్రజలు

వారి తల్లి అహ్మదీ బేగం అక్కడికక్కడే కుప్పకూలింది. ఈ పరిణామాలతో ఆ మరుసటి రోజు అంటే బుధవారం ఆ యువకుల తండ్రి అబ్దుల్ అహాద్ బనార్సీ గుండెపోటుతో మరణించాడు....

Representational Image (Photo Credits: ANI)

Nirmal, January 30: తెలంగాణ, నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో ఇటీవల ఇరువర్గాల మధ్య అల్లర్లు (Bhainsa Riots) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ హింసాకాండకు సంబంధించి పోలీసులు కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తమ ఇద్దరు కుమారులు అరెస్ట్ కావడం పట్ల కలతకు చెందిన వారి తల్లిదండ్రులు, ఆ షాక్ లోనే బుధవారం మరణించారు.

వివరాల్లోకి వెళ్తే, భైంసాలో ఈనెల జనవరి 12 రాత్రి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు (Communal Violence) చెలరేగాయి. రాళ్ల దాడి మొదలుకొని, ఇండ్లలోకి చొరబడి విధ్వంసం సృష్టించడం, ఇండ్లు, వాహనాలు తగలబెట్టుకోవడం వరకు వెళ్లింది. సీఐ, ఎస్సైలకు కూడా గాయాలయ్యాయి. ఆనాటి వార్త కోసం ఈ లింక్ క్లిక్ చేసి చూడొచ్చు.

ఇక జనవరి 13న, పోలీసులు కొంతమంది అనుమానితులను అరెస్ట్ చేశారు. అందులో 73 ఏళ్ల అబ్దుల్ అహాద్ బనార్సీ మరియు అతడి భార్య అహ్మదీ బేగం (65) లకు పుట్టిన సంతానంలోని ఇద్దరు కుమారులు అబ్దుల్ కషీఫ్ (24), అబ్దుల్ ఆసిఫ్ (21) కూడా ఉన్నారు. వారిని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించి, నిర్మల్ జైలులో ఉంచారు. అప్పట్నించీ వీరి తల్లిదండ్రులు తమ కుమారుల పట్ల ఆందోళన చెందుతూ ఉన్నారు. "ఈ గొడవలతో వారికి ఎలాంటి సంబంధం లేదు, అబ్దుల్ కషీఫ్ నిజామాబాద్ లో హాస్పిటల్ లో పనిచేస్తాడు, అతడి తమ్ముడు ఆసిఫ్ హైదరాబాద్ లో ప్లంబర్ గా పనిచేస్తున్నాడు. వారిద్దరూ నిర్మల్ లో జరిగిన ప్రార్థనలకు హాజరయి, తర్వాత మమ్మల్ని చూడటానికి భైంసా వచ్చారు. ఇంతలో అల్లర్లు చెలరేగాయి. ఏం జరుగుతుందోనని బయటకు వెళ్లి చూశారు, తప్ప ఆ గొడవల్లో పాల్గొనలేదు". అంటూ తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు.

కాగా, జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో, ఆ ఇద్దరు యువకులను పోలీసులు మంగళవారం మరోసారి భైంసా కోర్టుకు తీసుకువచ్చారు. అక్కడ ఇద్దరు కొడుకుల చేతులకు బేడీలు వేసి ఉండటం చూసి మరింత దిగ్బ్రాంతికి గురయ్యారు. వారి తల్లి అహ్మదీ బేగం అక్కడికక్కడే కుప్పకూలింది. ఈ పరిణామాలతో ఆ మరుసటి రోజు అంటే బుధవారం ఆ యువకుల తండ్రి అబ్దుల్ అహాద్ బనార్సీ గుండెపోటుతో మరణించాడు, ఇది జరిగిన 2 గంటలకు తల్లి అహ్మదీ బేగం కూడా కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయింది.

తల్లిదండ్రుల మరణంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఆ ఇద్దరికీ మొత్తం 10 మంది సంతానం, అందులో ఐదుగురు అబ్బాయిలు. పెద్ద కొడుకు దివ్యాంగుడు కాగా, చివరి ఇద్దరి కొడుకులు జైలు పాలయ్యారు. మిగతావారు ఆడవారే.

ఈ విషయం తెలిసి స్థానికులు కులం, మతం అనే విబేధాలు అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున వారి ఇంటికి తరలివచ్చి సంతాపం తెలియజేశారు. ఆ తల్లిదండ్రుల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కొడుకులకు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.