India's Savings Rate: పొదుపు మంత్రాన్ని మరిచిపోయిన భారతీయులు, 15 ఏళ్ల కనిష్ఠానికి పతనమైన భారతదేశ పొదుపు రేటు, సేవింగ్స్‌పై ఆర్థిక మందగమనం దెబ్బ

జీడీపీలో భారత పొదుపు రేటు 30.1 శాతం కలిగి ఉండగా బ్రెజిల్ 16 శాతం, మెక్సికో 23 శాతం గ్రాస్ సేవింగ్స్ ను కలిగి ఉంది. ఇక కరోనావైరస్ వ్యాప్తి ద్వారా కూడా మందగమనంలో ఉన్న ఆర్థికవ్యవస్థపై మరో దెబ్బ పడినట్లయింది....

Representational Image (Photo Credit: File)

Mumbai, February 19: తాము కష్టపడి సంపాందించే సొమ్మును ఇష్టారీతిన ఖర్చుపెట్టకుండా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా దాచుకునే భారతీయులు ఇప్పుడు ఆ పొదుపును కూడా చేయలేకపోతున్నారు. మందగమనంలో పయనిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ (India’s Slowing Economy) దేశంలోని ప్రజల కనీస పొదుపు సామర్థ్యాన్ని సైతం దెబ్బతీసింది.  ఫలితంగా భారతదేశ పొదుపు రేటు (India's Savings Rate)  15 సంవత్సరాల కనిష్టానికి పతనమైంది.

కనీసం ఇండ్లల్లో కూడా పొదుపు మంత్రం మరిచిపోయారని పలు నివేదికల ద్వారా వెల్లడైంది. పొదుపు చేయాల్సిన డబ్బును ప్రజలు గృహోపకరణాల కొనుగోళ్లకు, ప్రయాణాలు చేయడం కోసం ఉపయోగిస్తున్నారు. భారతదేశం యొక్క ఖజానా నిల్వ 60 శాతం దేశంలోని కుటుంబాలు చేసే సేవింగ్స్ నుంచే కలిగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లోని పరిణామాలు భారతదేశం యొక్క స్థూల-ఆర్ధిక స్థితిని బలహీనపరిచాయి. పెట్టుబడులు తగ్గిపోయి మూలధన అవసరాలకు నిధులు సమకూర్చడానికి విదేశీ రుణాలపై ఆధారపడవలసి వస్తుందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది.

అయితే కానీ బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ (Emerging Markets) లతో పోలిస్తే భారతదేశం మార్కెట్ (Indian Market) ఇప్పటికీ కొంత అనుకూలంగా ఉండటం ఊరట కలిగించే విషయం.

"దేశం ఒక స్థిరమైన వృద్ధిని కోరుకుంటే, అది పెట్టుబడి రేటును పెంచుకోవాలి, అయితే ఆ రేటును పెంచుకోవాలంటే అందుకు ముందు పెట్టుబడులు అవసరం” అని హెచ్‌ఎస్‌బిసి చీఫ్, భారత ఆర్థికవేత్త ప్రాంజుల్ భండారి అన్నారు. "దేశీయంగా పొదుపులు పతనమవుతే, విదేశీ పొదుపులను ఆకర్శించడం సరైన చర్య అని ఆయన పేర్కొన్నారు.  ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పనల్లో భారీ క్షీణత

2012 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తిలో 34.6 శాతంగా స్థూల జాతీయ పొదుపు (Gross Savings), 2018- 19 ఆర్థిక సంవత్సరం నాటికి 30.1 శాతంకు పడిపోయింది. ఈ పతనం 2003-2004 ఆర్థిక సంవత్సరంలో ఉన్నప్పటి స్థూల పొదుపు రేటు 29 శాతంగా ఉన్న కనిష్ఠానికి సమానం. అంటే భారతదేశ స్థూల పొదుపు 15 ఆర్థిక సంవత్సరాల దిగువనకు పతనమైందని కేంద్ర గణాంక సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం స్పష్టమవుతోంది.

అయితే ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ కొంచెం మెరుగైన స్థితిలో ఉంది. జీడీపీలో భారత పొదుపు రేటు 30.1 శాతం కలిగి ఉండగా బ్రెజిల్ 16 శాతం, మెక్సికో 23 శాతం గ్రాస్ సేవింగ్స్ ను కలిగి ఉంది.

ఇక కరోనావైరస్ వ్యాప్తి ద్వారా కూడా మందగమనంలో ఉన్న ఆర్థికవ్యవస్థపై మరో దెబ్బ పడినట్లయింది. దీని ప్రభావం అనేక రంగాలపై ఉందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ చైనా జీడీపీలో పొదుపు రేటు అత్యధికంగా 46% కలిగి ఉంది. చైనాలో ప్రజలు ఎక్కువగా దేశీయ ఉత్పత్తుల మీద ఆధారపడతారు, వారే బయట దేశాలకు ఎక్కువగా ఎగుమతులు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఆ దేశా గ్రాస్ సేవింగ్స్ బలంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.