Employment in India: ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పనల్లో భారీ క్షీణత, అక్కరకు రాని మోదీ సర్కార్ ప్రతిష్ఠాత్మక పథకాలు, నానాటికీ నియామకాల్లో గణనీయమైన పతనం, అధికారిక గణాంకాల ద్వారా బట్టబయలు
Image used for representational purpose. (Photo Credits: PTI)

New Delhi, February 19: దేశంలోని యువతకు ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలను పెంచడం కోసం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రతిష్ఠాత్మక పథకాలను ప్రవేశపెట్టింది. అయితే గణాంకాలను పరిశీలిస్తే ఈ పథకాల ద్వారా చేపడుతున్న నియామకాలలో (Placements)  నానాటికి గణనీయమైన క్షీణత కనిపిస్తుంది.

ఈ విషయం స్వయానా కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ద్వారా వెల్లడైంది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన (Employment Generation) కార్యక్రమం మరియు దీన్‌దయాళ్ ఆంత్యోదయ యోజన పథకాల ద్వారా చేపట్టిన నియామకాలు (Job Placements) 2019-20 ఆర్థిక సంవత్సరంలో క్షీణించాయి.

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం, PMEGP కింద 2018-19 ఆర్థిక సంవత్సరంలో సృష్టించబడిన ఉద్యోగాల సంఖ్య 5.87 లక్షలు ఉండగా, 2019- 20 ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆ సంఖ్య గణనీయంగా 2.57 లక్షలకు పడిపోయింది. 2014లో మోదీ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి గణాంకాలను పరిశీలిస్తే ఇదే అత్యల్పం. 2015-16లో ఇదే కార్యక్రమం కింద 3.23 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. 2016-17 సమయంలో ఈ సంఖ్య 4 లక్షలకు పెరిగింది. మళ్ళీ, 2017-18లో ఉద్యోగాల సంఖ్య 3.87 లక్షలకు పడిపోయింది.

పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి, పట్టణాల్లో నివాసం ఉండే పేద తరగతి ప్రజలకు స్వయం ఉపాధి మరియు నైపుణ్యానికి తగిన ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా DAY-NULM (దీనదయాళ్ అంత్యోదయ యోజన) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే, జనవరి 27, 2020 వరకు డేటాను పరిశీలిస్తే, DAY-NULM పథకం కింద నైపుణ్యం కలిగిన వ్యక్తుల నియామకంలో కూడా గణనీయమైన క్షీణత కనిపిస్తుంది. ఈ పథకం ద్వారా 2018-19లో ఆర్థిక సంవత్సరంలో 1.78 లక్షలుగా ఉన్న ప్లేస్‌మెంట్స్ , ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా 44,066 కు పడిపోయాయి.

ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో కూడా నియామకాలలో భారీ పతనం ఉంది. గుజరాత్ రాష్ట్రంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి 13,213గా ఉన్న లబ్దిదారుల సంఖ్య 2020 జనవరి 27 వరకు లెక్కలను పరిశీలిస్తే 2,727 పడిపోయింది.

ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పనపై ఒక ప్రశ్నకు సమాధానంగా పార్లమెంటులో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ ఈ గణాంకాలను వెల్లడించారు. ఉపాధి అవకాశాలు పెంచడానికి, ప్రజలు ఖర్చు చేసే స్థోమత పెంచడానికి తమ ప్రభుత్వం అవసరమయ్యే అన్ని చర్యలు చేపడుతుందని, పెట్టుబడులు పెంచడానికి ప్రైవేట్ రంగాలకూ ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నామని మంత్రి వివరించారు.