Cyclone Maha Update: కొనసాగుతున్న మహా తుఫాను, తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం, హైదరాబాద్ వాతావరణంలో రోజురోజుకు అనూహ్య మార్పులు

ప్రస్తుతం అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ‘మహా’ పెనుతుఫాన్‌ (cyclonic storm Maha) వాయవ్య దిశగా పయనిస్తోంది.

KCyclone Maha likely to intensify over east-central Arabian sea, says IMD(Photo-ANI)

Hyderabad,November 5: మహా తుఫాన్ తీవ్రత తగ్గడం లేదు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ‘మహా’ పెనుతుఫాన్‌ (cyclonic storm Maha) వాయవ్య దిశగా పయనిస్తోంది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ‘మహా’ పెనుతుఫాన్‌ వాయవ్య దిశగా పయనించి సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి తూర్పుమధ్య అరేబియా సముద్రానికి, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమమధ్య అరేబియా సముద్రానికి మధ్య గల గుజరాత్‌ (Gujarat)పోర్‌బందర్‌ తీరానికి పశ్చిమనైరుతి దిశగా 660 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది.

మరోవైపు మయన్మార్‌ తీరప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా ఉత్తర అండమాన్‌ సముద్రంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇంకో 12 గంటల్లో తీవ్రఅల్పపీడనంగా మారి, మరో 48 గంటల్లో తూర్పుమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణశాఖ (Meteorological Department) వెల్లడించింది.

వివరాలు వెల్లడించిన Meteorological Department 

ఈ ధాటికి రానున్న 48గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల 48 గంటల్లో తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు వానలు కురిసే అవకాశముందని, చాలావరకు పొడి వాతావరంమే ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్ లో వాతావరణం రోజురోజుకు మారిపోతోంది. అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి.బంగాళాఖాతంతోపాటు అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో గాలిలో తేమశాతం తగ్గి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, దీనివల్ల సాయంత్రానికి క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయని వివరించారు.

ఈ క్రమంలోనే సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణ స్థాయికంటే 2.2 డిగ్రీలు పెరిగి 33.2 సెల్సియస్‌ డిగ్రీలుగా, కనిష్ట ఉష్ణోగ్రత 5.2 డిగ్రీలు పెరిగి 22.2 సెల్సియస్‌ డిగ్రీలుగా నమోదయిందని, గాలిలో తేమ 52 శాతంగా నమోదయిందని తెలిపారు. క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో రాగల 24 గంటల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ అధికారులు పేర్కొన్నారు.