Ayushman Vaya Vandana Card: దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆస్పత్రిలో ఉచితంగా ట్రీట్‌మెంట్, ఆయుష్మాన్‌ భారత్‌ వయ వందన పథకం పూర్తి వివరాలు ఇవిగో..

భారతదేశంలో 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే పథకం మంగళవారం నుంచి కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది.

PM Narendra Modi Announces Free Hospital Treatment to All Above 70 (photo-ANI)

New Delhi, Oct 30: భారతదేశంలో 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే పథకం మంగళవారం నుంచి కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని లాంఛనంగా విస్తరించారు. ఈ పథకం కింద అర్హులైన వారికి ‘ఆయుష్మాన్‌ భారత్‌ వయ వందన’ కార్డులను పంపిణీ చేశారు.

దేశంలో వైద్య-ఆరోగ్య రంగాలకు సంబంధించిన రూ.12,850 కోట్ల పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వీటిలో దేశంలోనే తొలిసారిగా ఢిల్లీలో ఏర్పాటుచేసిన ‘అఖిల భారత ఆయుర్వేద వైద్య సంస్థ’ రెండోదశ పనులు కూడా ఉన్నాయి. వేర్వేరు రాష్ట్రాల్లో వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, నర్సింగ్‌ కళాశాలలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 11 ఆసుపత్రుల్లో డ్రోన్‌ సేవల్ని ప్రారంభించారు.

వీడియో ఇదిగో, బార్బర్ షాపులో గడ్డం చేయించుకున్న రాహుల్ గాంధీ, రోజువారీ కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు హైలెట్ చేసిన కాంగ్రెస్ నేత

వీటిలో తెలంగాణలోని బీబీనగర్‌ ఎయిమ్స్, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌, విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి శంకుస్థాపన వంటివి ఉన్నాయి. రిషికేశ్‌ ఎయిమ్స్‌లో అత్యవసర సేవల కోసం ఉద్దేశించిన హెలికాప్టర్‌ను, తల్లీబిడ్డల టీకాల కార్యక్రమాన్ని డిజిటలీకరించే యూ-విన్‌ పోర్టల్‌ను, వైద్య రంగానికి సంబంధించిన కేంద్రీకృత సమాచారంతో కూడిన ప్రత్యేక పోర్టల్‌ను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

PM Narendra Modi Announces Free Hospital Treatment to All Above 70

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ- ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశ పురోగతి వేగం పుంజుకుంటుందని అన్నారు. దానికోసం ఐదు మూలస్తంభాలతో ఆరోగ్య విధానాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, సకాలంలో రోగ నిర్ధారణ, సరసమైన ధరల్లో మందులు-చికిత్స, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ఏర్పాటు, ఈ రంగంలో సాంకేతికత విస్తరణపై దృష్టి సారించామని చెప్పారు.ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లోని వృద్ధులు మాత్రం తనను క్షమించాలని కోరారు. ఆ రెండు రాష్ట్రాలు రాజకీయ కారణాలతో ఈ పథకాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. అక్కడ వృద్ధులు పడుతున్న బాధలు తెలిసినా ఈ విషయంలో తాను ఏం చేయలేనని అన్నారు. ఈ పథకమే లేకపోతే ప్రజలు తమ జేబుల్లోంచి రూ.1.25 లక్షల కోట్లు వెచ్చించాల్సి వచ్చేదని చెప్పారు.

జనరిక్‌ ఔషధాలను అందుబాటులోకి తీసుకురావడంతో ప్రజలకు మరో రూ.30,000 కోట్ల మేర ఆదా అయిందన్నారు. ఖరీదైన వైద్య భారం నుంచి పేదలు, మధ్యతరగతివారికి ఉపశమనం లభించేవరకు తాను విశ్రమించబోనని చెప్పారు. ఈసారి జరిగే దీపావళి ప్రత్యేకమంటూ ప్రజలకు మోదీ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్య రామాలయంలో ఈసారి దీపాలు వెలిగిస్తారన్నారు.