Assam Violence: అసోంలో మళ్లీ హింసాకాండ, ఐదుగురు డ్రైవర్లు సజీవ దహనం, ఏడు ట్రక్కులను తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు, డిమా హసావో జిల్లాలోని దియుంగ్‌బ్రా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు
అసోం మీదుగా ప్రయాణిస్తున్న ఏడు ట్రక్కులను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి అగ్నికి ఆహుతి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు డ్రైవర్లు సజీవ దహనం అయ్యారు. దీంతో డిమా హసావో జిల్లాలోని దియుంగ్‌బ్రా ప్రాంతంలో పరిస్థితులు వేడెక్కాయి.
Diphu/Haflong, August 28: ఈశాన్య రాష్ట్రం అసోంలో (Assam Violence) మరోసారి హింసాకాండ చెలరేగింది. అసోం మీదుగా ప్రయాణిస్తున్న ఏడు ట్రక్కులను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి అగ్నికి ఆహుతి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు డ్రైవర్లు సజీవ దహనం అయ్యారు. దీంతో డిమా హసావో జిల్లాలోని దియుంగ్‌బ్రా ప్రాంతంలో పరిస్థితులు వేడెక్కాయి. ఈ ఘటనకు స్థానిక మిలిటెంట్ గ్రూప్ డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్‌ఎల్‌ఏ) (Dimasa National Liberation Army militants) కారణమై ఉండొచ్చని దియాముఖ్ పోలీసులు (Diyunmukh police) అనుమానిస్తున్నారు.
వీరిని పట్టుకునేందుకు భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ మొదలెట్టాయి. ట్రక్కులు సమీపంలోని సిమెంట్ తయారీ కర్మాగారం కోసం బొగ్గు, ఇతర వస్తువులను తీసుకెళ్తున్నాయి. పోలీసుల నుంచి అందిన సమాచారం మేరకు.. అనుమానిత మిలిటెంట్లు అధునాతన ఆయుధాలతో ట్రక్కు డ్రైవర్లపై అనేక రౌండ్ల కాల్పులు జరిపారు. పలువురు డ్రైవర్లు, ట్రక్కుల అసిస్టెంట్లు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ఐదు మృతదేహాలను వెలికితీసింది.
ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంస్థ డీఎన్‌ఎల్‌ఏ హస్తం ఉండవచ్చని అసోం పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత డిమా హసావో ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు. దుండగులను పట్టుకోవడానికి అసోం రైఫిల్స్ సహాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. గువాహతికి ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా దళాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. మే నెలలో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు డీఎన్‌ఎల్‌ఏ సభ్యులు చనిపోయారు.