Bhainsa Violence: భైంసాలో భయం భయం, హింసాకాండ నేపథ్యంలో పట్టణంలో రాత్రివేళ కర్ఫ్యూ విధింపు, నాలుగు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత, భైంసాలో ఎన్నికలు రద్దు చేయాలని భాజపా డిమాండ్

ఈ హింసాకాండకు సంబంధించి 60 మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. మొత్తం 6 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. భైంసాలో సాయంత్రం 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ విధించారు. రోడ్లపైకి ఎవరూ రాకూడదని హెచ్చరించారు.....

Communal Violence Erupts in Bhainsa | Photo; Twitter

Bhainsa, January 14: నిర్మల్ జిల్లాలోని (Nirmal District)  భైంసాలో ఆదివారం రాత్రి జరిగిన హింసాకాండ  (Communal Violence) ఉత్తర తెలంగాణ (NorthTelangana) ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు హద్దులు మీరాయి. ఒక వర్గానికి చెందిన అల్లరిమూక ఇండ్లల్లోకి చొరబొడి బీభత్సం సృష్టించడమే కాక, ఇండ్లకు, వాహనాలకు నిప్పు పెడుతూ అందులోని నివాసితులను భయభ్రాంతులకు గురిచేశారు.

ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి కొంతమంది యువకులు సైలెన్సర్లు లేని ద్విచక్రవాహనాలతో గల్లీలలో చక్కర్లు కొట్టడం ద్వారా కొంతమంది కాలనీవాసులు దానిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో అందులో ఒకరు వెళ్లి తమ వర్గం సమాచారం ఇవ్వడంతో మరికొంత మంది వచ్చి కాలనీవాసులపై రాళ్లు రువ్వారు. ప్రతిగా కాలనీవాసులు కూడా రాళ్లు రువ్వారు. ఇలా మొదలైన ఘర్షణలు, తీవ్రరూపం దాల్చాయి.

ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు జరిగిన ఈ హింసాకాండలో మొత్తం 16 ఇండ్లకు నిప్పుపెట్టారు, 23 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు మరియు ఒక టాటా మ్యాజిక్ దగ్ధం అయ్యాయి. ఈ దుర్మార్గమైన చర్యలో ఎనిమిది మంది పోలీసు సిబ్బంది సహా కనీసం 19 మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో అతణ్ని చికిత్స కోసం నిజామాబాద్ తరలించారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పలుమార్లు లాఠీఛార్జి చేశారు. ఈ హింసాకాండకు సంబంధించి 60 మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. మొత్తం 6 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. భైంసాలో  సాయంత్రం 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ విధించారు. రోడ్లపైకి ఎవరూ రాకూడదని హెచ్చరించారు. పట్టణంలో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.  బుధవారం వరకు సమావేశాలను నిశేధించారు. పుకార్లు వ్యాప్తి చెందకుండా నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ మరియు మంచిర్యాల జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు.

నిర్మల్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి అల్లర్లు జరిగిన ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. బాధితులను పరామర్శించారు. రాత్రి తమ ఇళ్లలోకి చొరబడి దాడులు చేయడంతో ప్రాణభయంతో బయటకు పరుగులు తీశామని బాధితులు కలెక్టర్ వద్ద వాపోగా, అన్ని విధాలుగా అండగా ఉంటామని కలెక్టర్ వారికి భరోసా కల్పించారు.

భైంసా హింసాకాండపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వర్గం లక్ష్యంగా దాడి చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను భైంసా వస్తానని హెచ్చరికలు పంపారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇక AIMIM చీఫ్ అసదుద్దీన్ (Asaduddin) కూడా దాడులను ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. దాడుల్లో నష్టపోయిన బాధితులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే శాంతిని పరిరక్షించుకోవాలని భైంసా వాసులకు అసద్ విజ్ఞప్తి చేశారు.

బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్‌లు హింసాకాండను ఖండించారు. భైంసాలో  మున్సిపల్  ఎన్నికలను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.