Rajya Sabha: రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద రూ.500 నోట్ల కట్ట కలకలం, ఘటనపై స్పందించిన అభిషేక్ సింఘ్వీ, వీడియోలు ఇవిగో..
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ (Abhishek Singhvi) సీటు వద్ద నోట్ల కట్ట లభ్యమైనట్లు రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ (Jagdeep Dhankhar) వెల్లడించారు.
New Delhi, Dec 6: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జరుగుతున్న వేళ ఎగువ సభ (Rajya Sabha)లో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ (Abhishek Singhvi) సీటు వద్ద నోట్ల కట్ట లభ్యమైనట్లు రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ (Jagdeep Dhankhar) వెల్లడించారు.
సాధారణ భద్రతా తనిఖీల్లో భాగంగా గురువారం సభ వాయిదా పడిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు నిర్వహించినట్లు చైర్మన్ తెలిపారు. ఈ తనిఖీల్లో రూ.500 నోట్లతో ఉన్న నగదు కట్టను గుర్తించినట్లు చెప్పారు. సీటు నంబర్ 222 నుంచి భద్రతా అధికారులు కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణకు ఆదేశించినట్లు ధన్‌ఖర్ వెల్లడించారు.
పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన, అదానీ వ్యవహారంపై ఈడీ, సీబీఐ లతో విచారణ జరిపించాలని డిమాండ్
ఈ ఘటన పట్ల సింఘ్వీ ఓ వీడియో ద్వారా ప్రకటన చేశారు. రాజ్యసభకు వెళ్తున్న సమయంలో.. ఒకే ఒక్క రూ.500 నోటు పట్టుకెళ్లుతానని సింఘ్వీ తెలిపారు. తన సీటు వద్ద నోట్ల కట్టలు ఉన్న విషయాన్ని మొదటిసారి విన్నట్లు చెప్పారు.గురువారం రోజున మధ్యాహ్నం 12.57 నిమిషాలకు సభలోకి వెళ్లానని, ఆ తర్వాత సరిగ్గా ఒంటి గంటకు సభ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు.
Currency notes found at Congress MP Abhishek Singhvi's seat in Rajya Sabha
ఆ తర్వాత క్యాంటీన్‌లో అయోధ్య రామిరెడ్డితో కలిసి మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకు కూర్చున్నట్లు చెప్పారు. సభలో 3 నిమిషాలు, క్యాంటిన్‌లో 30 నిమిషాలు మాత్రమే ఉన్నానని, దీనిపై కూడా రాజకీయం చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ ఘటనపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంలో సింఘ్వీ పేరును ప్రస్తావించడంపై మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు.