FASTag Deadline Extended: ఫాస్టాగ్ గడువు పొడగింపు, నూతన తేదీని ప్రకటించిన కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ, ఈ గడువులోపు ఫాస్టాగ్ కలిగిలేని వాహనాలకు రెట్టింపు టోల్ ఛార్జ్ వర్తింపు

ఇప్పటివరకు 70 లక్షలకు పైగా నూతన ఫాస్టాగ్స్ జారీ చేయబడ్డాయి, నవంబర్ 26, మంగళవారం రోజు అత్యధికంగా 1,35,583 ఫాస్టాగ్ల అమ్మకాలు జరిగాయని ప్రభుత్వం తెలిపింది....

FAStags mandatory for every vehicle | Photo - Twitter

New Delhi, November 29: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు ఫాస్టాగ్  (FASTag) తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 1 వరకు అన్ని వాహనాలు ఫాస్టాగ్ కలిగి ఉండాలని ముందుగా గడువు విధించింది. అయితే తాజాగా ఈ గడువును కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ డిసెంబర్ 15, 2019 (December 15) వరకు పొడగించింది.

ఫాస్టాగ్ అనేది NHAI (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) చేత నిర్వహించబడేటువంటి ఎలక్ట్రానిక్ టోలింగ్ వ్యవస్థ. లింక్ చేయబడిన ప్రీపెయిడ్ ఖాతా నుండి టోల్ చెల్లింపులు చేయడానికి వీలుగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీ ద్వారా ఇది పనిచేస్తుంది. కారు, లేదా నాలుగు చక్రాలకు పైగా ఉండే వాహనాల యొక్క విండ్‌షీల్డ్‌పై అతికించబడి ఉంటుంది. వాహనం డ్రైవర్ టోల్ ప్లాజా ద్వారం వద్దకు రాగానే టోల్ సిబ్బంది ప్రమేయం లేకుండా గేట్ తెరుచుకోబడి వెళ్ళడానికి అనుమతిస్తుంది.  దీనివల్ల క్యూలో వాహనాన్ని నిలిపే అవకాశం తగ్గడమే కాకుండా, సమయం ఆదా అవుతుంది.

ఫాస్టాగ్ విధానం అమలు చేస్తున్నపుడు అన్ని లేన్‌లలో, ఒక లేన్ రెండు విధాల చెల్లింపులకు అనగా, ఫాస్టాగ్ రూపంలో మరియు క్యాష్ రూపంలో చెల్లించేందుకు అనుమతిస్తారు. హైబ్రిడ్ లేన్‌గా పిలవబడే ఈ లేన్ టోల్ ప్లాజాకు పూర్తి ఎడమ పక్కగా ఉంటుంది. భారీ వాహనాల కోసం ఇది నిర్ధేషించబడింది. అయితే ఫాస్టాగ్ లేని వాహనాలకు ఈ లేన్ గుండానే అనుమతించబడుతుంది. ఫాస్టాగ్ లేకుండా ఏదైనా కారు ప్రవేశిస్తే దానికి సాధారణం కంటే రెట్టింపు టోల్ ఛార్జీ వసూలు చేయబడుతుందని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.  అసలు FAStag అంటే ఏమిటి? ఎలా పొందాలి? ఈ లింక్ క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు

ఇప్పటివరకు 70 లక్షలకు పైగా నూతన ఫాస్టాగ్స్ జారీ చేయబడ్డాయి, నవంబర్ 26, మంగళవారం రోజు అత్యధికంగా 1,35,583 ఫాస్టాగ్ల అమ్మకాలు జరిగాయని ప్రభుత్వం తెలిపింది.