Indian Navy Veterans Return to India: ఖ‌త‌ర్ నుంచి క్షేమంగా స్వ‌దేశానికి మాజీ నేవీ అధికారులు, గూఢ‌చ‌ర్యం కేసులో జైలు శిక్ష కూడా లేకుండానే ఢిల్లీకి చేరిన ఎనిమిది మంది

తాజాగా దాని నుంచి కూడా విముక్తి కల్పించి భారత్‌కు అప్పగించారు. ఏడుగురు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఖతార్‌ (Qatar) నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది.

Indian Navy Veterans Return to India (Photo Credits: ANI)

New Delhi, FEB 12: ఖతార్‌లో (Qatar) గూఢచర్యం ఆరోపణలపై (Espionage Charges) అరెస్టయిన ఎనిమిది మంది భారత నావికాదళ మాజీ అధికారులను (Indian Navy Veterans) అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. 18 నెలలుగా వీరు అక్కడి జైల్లో ఉన్నారు. వీరికి విధించిన మరణ దండనను ఇప్పటికే న్యాయస్థానం జైలు శిక్షగా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా దాని నుంచి కూడా విముక్తి కల్పించి భారత్‌కు అప్పగించారు. ఏడుగురు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఖతార్‌ (Qatar) నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది.

 

‘‘దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తూ ఖతార్‌లో అరెస్టయిన ఎనిమిది మంది భారతీయ పౌరులను (Indian Navy Veterans) విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతిస్తోంది. ఏడుగురు ఇప్పటికే స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరి విడుదలకు వీలుగా ‘ఎమిర్ ఆఫ్‌ ది స్టేట్‌ ఆఫ్‌ ఖతార్‌’ తీసుకున్న నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ సోమవారం తెల్లవారుజామున ప్రకటన విడుదల చేసింది.

 

గూఢచర్యం ఆరోపణల కింద ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ సిబ్బందిని 2022లో ఖతార్‌ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. వారిలో కెప్టెన్లు సౌరభ్‌ వశిష్ఠ్‌, నవతేజ్‌ గిల్‌, కమాండర్లు బీరేంద్ర కుమార్‌ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్‌ పాకాల, సంజీవ్‌ గుప్తా, అమిత్‌ నాగ్‌పాల్‌, సెయిలర్‌ రాగేశ్‌ ఉన్నారు. వీరిలో సుగుణాకర్‌ విశాఖ వాసి. అక్కడి ప్రాథమిక కోర్టు రెండు మూడుసార్లు మాత్రమే విచారణ జరిపి మరణ శిక్షను ఖరారు చేసింది. దీన్ని రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది.

 

దీంతో అప్పీలు చేసుకోవడానికి అక్కడి కోర్టు అనుమతించింది. ఎట్టకేలకు పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం మరణ దండనను జైలు శిక్షగా మారుస్తూ 2023 డిసెంబర్‌ 28న తీర్పునిచ్చింది. దీన్ని కూడా అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల గడువిచ్చింది. దీంతో అందుబాటులో ఉన్న అన్ని న్యాయమార్గాలను వినియోగించుకున్న మన విదేశాంగ శాఖ వారి విడుదలకు విశేష కృషి చేసింది. అవన్నీ ఫలించి ఈరోజు వారు స్వదేశానికి చేరుకోవటంతో భారత్‌కు దౌత్యపరంగా గొప్ప విజయం లభించినట్లయింది.