ISRO vs NASA: నాసా కాదు, రెండు నెలల కిందటే మేము విక్రమ్ జాడ గుర్తించాము. చెన్నై మెకానికల్ ఇంజినీర్ వార్తలపై స్పందించిన ఇస్రో చైర్మన్ కె. శివన్

చంద్రయాన్2 యొక్క సొంత ల్యూనార్ ఆర్బిటార్ విక్రమ్ జాడను అంతకుముందే గుర్తించింది. అయితే....

File image of ISRO Chairman K Sivan | File Photo

Chennai, December 4: భారతదేశ ప్రతిష్టాత్మక మిషన్ అయిన చంద్రయాన్ 2 (Chandrayaan2) , చంద్రుడికి అత్యంత సమీపానికి వచ్చి చివరి నిమిషంలో విఫలమైంది. చంద్రుడి ఉపరితలంపై దిగే క్రమంలో హార్డ్ ల్యాండింగ్ జరిగి ల్యాండర్‌ విక్రమ్ (Vikram)  కూలిపోయింది. అయితే ఈ విక్రమ్ జాడను తాము కనిపెట్టామంటూ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA)  మంగళవారం ప్రకటిస్తూ అందుకు సంబంధించిన కొన్ని చిత్రాలను విడుదల చేసింది.

కాగా, నాసా ప్రకటనను ఇస్రో చైర్మన్ కే. శివన్ (K. Sivan) తోసిపుచ్చారు. కొత్తగా విక్రమ్ జాడను కనిపెట్టడం ఏంటి? ఇస్రో (ISRO) దానిని ఎప్పుడో కనిపెట్టింది అని చెప్పారు. చంద్రయాన్2 యొక్క సొంత ల్యూనార్ ఆర్బిటార్ విక్రమ్ జాడను అంతకుముందే గుర్తించింది. అయితే ఎలాంటి కమ్యూనికేషన్ సాధ్యపడలేదు అంటూ రెండు నెలల క్రిత్రం సెప్టెంబర్ 10 ఇస్రో అధికాకారిక వెబ్ సైట్లో వెల్లడించిన ఆ సందేశాన్ని చూడొచ్చు అంటూ శివన్ చెప్పుకొచ్చారు.

శివన్ వాదనను ధృవీకరిస్తూ గత సెప్టెంబర్ లోనే ఇస్రో తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అందుకు సంబంధించిన ట్వీట్ ఇక్కడ చూడొచ్చు.

ISRO's old tweet:

కాగా, మంగళవారం నాసా చేసిన ప్రకటనలో చెన్నైకి చెందిన 33 ఏళ్ల ష‌ణ్ముగ సుబ్ర‌మ‌ణియ‌న్ (Shanmuga Subramanian) అనే మెకానికల్ ఇంజనీర్, ల్యాండర్ యొక్క శిథిలాలను గుర్తించారని, విక్ర‌మ్ గ‌తిత‌ప్పిన వాయ‌వ్య ప్రాంతానికి 750 మీట‌ర్ల స‌మీపంలో, దాదాపు ఒక కిలోమీటర్ పరిధిలో విక్రమ్ ల్యాండర్ శకలాలు విసిరివేయబడి ఉన్నాయని తెలుపుతూ ఫోటోలను విడుదల చేసింది.

అయితే వీరిరువురి ప్రకటనలు ఎలా ఉన్నా,  నాసా ప్రకటనలో ఒక విషయాన్ని ఏకీభవించవచ్చు. గతంలోనే విక్రమ్ ల్యాండర్ జాడను ఇస్రో గుర్తించినప్పటికీ, అది ఎలాంటి స్థితిలో ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేకపోయింది. ఇప్పుడు నాసా విడుదల చేసిన తాజా ఫోటోల ద్వారా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టిన తర్వాత తునాతునకలైనట్లు స్పష్టంగా అర్థమవుతుంది.