Jal Jeevan Mission 2021: నీటి కష్టాలకు ఇక చెల్లు, జల్ జీవన్ మిషన్ మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ, మిషన్ అమలుకు రూ.3.60 లక్షల కోట్లు
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
New Delhi, October 2: దేశ ప్రధాని నరేంద్రమోదీ నేడు రాష్ట్రీయ జల్ జీవన్ కోశ్ & జల్ జీవన్ మిషన్ మొబైల్ అప్లికేషన్‌ను (PM Narendra Modi During the Launch of Mobile App) ఆవిష్కరించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొబైల్ యాప్‌ను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రధాని.. ఈ జల్‌జీవన్ మిషన్ అనేది పూర్తిగా గ్రామాలు నడిపించే, గ్రామాల్లోని మహిళలు నడిపించే ఉద్యమం అని వ్యాఖ్యానించారు. మాస్ మూవ్‌మెంట్, పబ్లిక్ పార్టిసిపేషనే దీనికి ప్రధాన ఆధారమని చెప్పారు. జల్ జీవన్ మిషన్’తో (Jal Jeevan Mission 2021) మహిళలు దూరప్రాంతాలకు వెళ్లి నీళ్లను తెచ్చుకునే కష్టాలు తప్పుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
జల్‌జీవన్ మిషన్ మొబైల్ యాప్ ద్వారా ఈ ఉద్యమానికి సంబంధించిన సమస్త సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంటుందన్నారు. ఇక నుంచి దేశంలోని లక్షల గ్రామాల ప్రజలు గ్రామ సభల ద్వారా జల్ జీవన్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించుకంటారని చెప్పడం ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ ఉద్దేశం కేవలం ప్రజలకు నీటి సౌకర్యాలు కల్పించడం మాత్రమే కాదని, ఇదొక పెద్ద వికేంద్రీకరణ ఉద్యమమని ఆయన చెప్పారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇస్తుండటంతో వారి సమయం ఆదా అవుతోందని, తద్వారా వారు సాధికారత వైపు అడుగులు వేసే అవకాశం లభిస్తోందని పేర్కొన్నారు.
2019 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ‘జల్ జీవన్ మిషన్’ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రతి ఇంటికీ నల్లా నీటి సదుపాయం కల్పిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మిషన్ అమలుకు కేంద్రం రూ.3.60 లక్షల కోట్లు కేటాయించింది.
దీంతోపాటు 15వ ఆర్థిక సంఘం కింద మరో రూ.1.42 లక్షల కోట్లు సమకూర్చుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల గ్రామాల్లో నీటి సమితులు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీ(వీడబ్ల్యూఎస్‌సీ)లు ఏర్పాటు చేసింది. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి ఇంటికి కుళాయి సౌకర్యం అందేలా కృషి చేయడం వీటి బాధ్యత. ఈ మిషన్ ప్రారంభం నాటికి దేశంలో 3.23 కోట్ల(17 శాతం) గ్రామీణ ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఉండగా.. ప్రస్తుతం ఇది 8.26 కోట్ల(43 శాతం)కు చేరడం విశేషం.