Jammu & Kashmir: కాశ్మీరు లోయలో పలు చోట్ల ఆంక్షలు ఎత్తివేత. తెరుచుకున్న పాఠశాలలు, అయినప్పటికీ హాజరుకాని టీచర్లు, విద్యార్థులు. మెల్లిమెల్లిగా సాధారణ స్థితికి. జమ్మూకాశ్మీర్ పూర్తి రౌండప్ ఇక్కడ చూడండి.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత పూర్తిగా స్తంభించిపోయిన జనజీవనం, రోజులు గడిచేకొద్దీ కొద్దికొద్దిగా ఆంక్షలు సడలింపు చేస్తుండటంతో పరిస్థితి మెల్లిమెల్లిగా సాధారణ స్థితికి వస్తుంది. జమ్మూ కాశ్మీర్ పరిధిలో మొత్తం 197 పోలీస్ స్టేషన్లు ఉండగా..
కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లో పరిపాలన బుధవారం రోజున పగటి సమయంలో కొంతమేర ఆంక్షల సడలింపుతో కొనసాగింది. శ్రీనగర్‌లోని పలు ప్రాంతాలలో ఆంక్షలు ఎత్తివేయబడ్డాయి. నివేదికల ప్రకారం, కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా నగరంలోని దిగువ ప్రాంతాలలో ఆంక్షలు కొనసాగాయి.
జమ్మూకాశ్మీర్ లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పూర్తిగా స్తంభించిపోయిన జనజీవనం, రోజులు గడిచేకొద్దీ కొద్దికొద్దిగా ఆంక్షలు సడలింపు చేస్తుండటంతో పరిస్థితి మెల్లిమెల్లిగా సాధారణ స్థితికి వస్తుంది. జమ్మూ కాశ్మీర్ పరిధిలో మొత్తం 197 పోలీస్ స్టేషన్లు ఉండగా ఇప్పటికే 136 పోలీస్ స్టేషన్ ల పరిధులలో ఆంక్షలను సడలించినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే పలు సున్నితమైన ప్రాంతాలలో ఇప్పటికి నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి.
కాశ్మీరు లోయలో మొత్తం 111 పోలీసు స్టేషన్ పరిధులుండగా 50 పోలీసు స్టేషన్ ల పరిధుల్లో ఆంక్షలను సడలించినట్లు రాష్ట్ర అధికార ప్రతినిధి రోహిత్ కన్సల్ వెల్లడించారు. వ్యాపార సముదాయాలు ఉన్న ప్రాంతాల్లో బారికేడ్లు, కంచెలను తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు.
గతవారం నుంచి ప్రాథమిక పాఠశాలు మాత్రమే తెరుచుకునేందుకు అనుమతించిన జమ్మూకాశ్మీర్ పరిపాలన విభాగం ఈ వారం నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలు, పలు ప్రభుత్వ కార్యాలయాలను తెరుచుకునేందుకు అనుమతించింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ తెరుచుకున్నప్పటికీ చాలా స్కూల్లల్లో టీచర్లు మరియు స్టూడెంట్ల హాజరు శాతం అత్యల్పంగా నమోదైంది.
జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా దాదాపు 85 శాతం వరకు ల్యాండ్ లైన్ ఫోన్లు పనిచేస్తున్నాయి. అయితే ఆగష్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేసిన దగ్గర్నించీ ఇప్పటివరకు మొబైల్ మరియు ఇంటర్నెట్ సేవల నిలిపివేత ఇంకా కొనసాగుతుంది.
చాలా చోట్ల రోజులో పగటి పూట మొదట 6 గంటల వరకు ఆంక్షల సడలింపు చేస్తున్నారు. అయితే భద్రతా దళాల గస్తీ మాత్రం అనుక్షణం కొనసాగుతూనే ఉంది. ఈ ఆంక్షల పట్ల అక్కడక్కడా పోలీసులతో ఘర్షణలు, చెదురుమదురు ఘటనలు మినహా జమ్మూకాశ్మీర్ లో ప్రస్తుతం వాతావరణమంతా ప్రశాంతంగానే ఉందని అధికారులు చెపుతున్నారు. ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర సరుకులు కావాల్సినంత స్టాక్ అందుబాటులో ఉందని, ఎలాంటి భయం అవసరం లేకుండా బయటకు వచ్చి వారికి కావాల్సింది కొనుక్కునేందుకు స్వేచ్ఛనిచ్చామని అధికారులు స్పష్టం చేశారు.
అయితే ఎంత ఆంక్షలు సడలించినప్పటికీ బయటకు రావడానికి మాత్రం ప్రజల్లో కొంత బెరుకు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చాలా చోట్ల ఇళ్లకే పరిమితమవుతున్నారు. కొన్ని ప్రైవేట్ క్యాబ్స్ మాత్రం రవాణా కొనసాగిస్తున్నట్లు కనిపిస్తుంది. పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి రావటానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది