Manipur Students Killing: మణిపూర్‌లో అసలేం జరుగుతోంది, ఇద్దరు విద్యార్థుల దారుణ హత్య వెనుక సూత్రధారులెవరు, రోడ్డు మీదకు వచ్చి నిరసన చేపట్టిన వేలాది మంది విద్యార్థులు

ఈ ఏడాది మార్చిలో కుకీ, మైతీ కమ్యూనిటీల మధ్య రాజుకున్న వైరం నివురుగప్పిన నిప్పులా మండుతూనే ఉంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేయగా తాజాగా మరొక దారుణం వెలుగులోకి వచ్చింది.

Manipur Violence (Photo-PTI)

Imphal, Sep 26: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ రెండు వర్గాల మధ్య ఘర్షణలతో నాలుగు నెలలుగా అట్టుడుకుతూనే ఉంది. ఈ ఏడాది మార్చిలో కుకీ, మైతీ కమ్యూనిటీల మధ్య రాజుకున్న వైరం నివురుగప్పిన నిప్పులా మండుతూనే ఉంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేయగా తాజాగా మరొక దారుణం వెలుగులోకి వచ్చింది.

మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థుల అదృశ్యం, హత్య ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జూలైలో కనిపించకుండాపోయిన ఇద్దరు విద్యార్థులు అల్లరిమూకల స్వాధీనంలో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేగాక తప్పిపోయిన విద్యార్థులు అత్యంత దారుణంగా హత్యకు గురైన ఫోటో కూడా నెట్టింట్లో సంచలనంగా మారింది.

ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అందరి ముందే సామూహిక అత్యాచారం, మణిపూర్‌లో దారుణ ఘటన వెలుగులోకి..

ఈ ఫోటోలు వైరల్ కావడంతో మణిపూర్‌ (Manipur Violence)లో తాజాగా మరోసారి హింస చెలరేగింది. రాజధాని ఇంపాల్‌ (Imphal)లో మంగళవారం వందలాది మంది విద్యార్థులు (Manipur Students) నిరసన చేపట్టారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు విద్యార్థులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఆగ్రహించిన రాష్ట్రంలోని విద్యార్థులు ఘటనకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

మణిపూర్ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి, మహిళల నగ్న ఊరేగింపు ఘటనలో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఈ క్రమంలో విద్యార్థులంతా ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌సింగ్‌ (N Biren Singh) నివాసం వైపు కవాతు చేసేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు విద్యార్థులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అసలు ఏం జరిగింది

మైతీ వ‌ర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు (Manipur Students) శ‌వ‌మై తేలారు. జూలైలో ఆచూకీలేకుండా పోయిన ఇద్దరు విద్యార్థుల ఫోటోలు రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఇద్దరి మృత‌దేహాల‌ను ఇంకా గుర్తించ‌లేదు. 17 ఏళ్ల హిజామ్ లింతోయింగంబి, 20 ఏళ్ల ఫిజ‌మ్ హేమ్‌జిత్ .. సాయుధుల మ‌ధ్య ఉన్న ఫోటోల‌ను రిలీజ్ చేశారు. ఆ త‌ర్వాత ఇద్దరూ చ‌నిపోయిన‌ట్లు ఉన్న ఫోటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఓ జంగిల్ క్యాంపు వ‌ద్ద ఆ ఇద్దరూ హ‌త‌మైన‌ట్లు తెలుస్తోంది. జూలై నుంచి అదృశ్యమైన ఆ ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు జ‌రుగుతోంది. ఈ కేసును సీబీఐ విచారిస్తున్నది. దీంతోపాటు మణిపూర్‌లో జరిగిన మరో 9 దారుణ ఘటనలపై సీబీఐ విచారిస్తోంది.

రాష్ట్రంలో హింస చెలరేగినప్పటి నుంచి ఇప్పటి వరకూ 175 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,118 మంది గాయపడ్డారు. సుమారు 33 మంది అదృశ్యమయ్యారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు కొంతమేర అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇటీవలే ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించింది. దీంతో రాష్ట్రంలో అల్లర్లు మొదలైన తర్వాత జూలై నెలలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు ఉన్న ఫొటోలు ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ ఘటనకు నిరసనగా వందలాది విద్యార్థులు నిరసన చేపట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ఇలా..

ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. హత్యకు గురైన విద్యార్థులు.. మైతేయ్‌ వర్గానికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయిగా గుర్తించినట్లు తెలిపింది. జులై 6 నుంచి వీరిద్దరూ అదృశ్యమయ్యారు. జులై 6వ తేదీన ఆంక్షలు సడలించడంతో అమ్మాయి నీట్‌ కోచింగ్‌ నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

పరిస్థితులు సద్దుమణిగాయని భావించిన ఆమె.. తర్వాత తన స్నేహితుడితో బైక్‌పై లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లింది. ఇక అప్పటి నుంచి వారి జాడలేకుండా పోయింది. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. వారు ఇంఫాల్‌కు సమీపంలోని నంబోల్‌ వైపు వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యిందని పోలీసులు అప్పట్లో వెల్లడించారు. ఈ క్రమంలోనే సాయుధులు వారిని కిడ్నాప్‌ చేసి హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ (CBI) దర్యాప్తు ప్రారంభించినట్లు మణిపుర్‌ ప్రభుత్వం తమ ప్రకటనలో వెల్లడించింది. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు, కుకీ వర్గానికి చెందిన దుండగులు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని మణిపుర్‌ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలోనూ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

మండిపడిన ప్రియాంక గాంధీ

మణిపూర్‌లో జాతి హింసలో ఇద్దరు విద్యార్థుల హత్యపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.మణిపూర్ నుండి మరిన్ని షాకింగ్ న్యూస్ లు వస్తున్నాయి. జాతి హింసకు ఎక్కువగా గురవుతున్నది పిల్లలు. వారిని రక్షించడానికి మనం చేయగలిగినదంతా చేయడం మా కర్తవ్యం. ” “మణిపూర్‌లో జరుగుతున్న భయంకరమైన నేరాలు మాటల్లో చెప్పలేనివి, అయినప్పటికీ అవి నిరాటంకంగా కొనసాగడానికి అనుమతించబడుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం తన చేతగానితనానికి సిగ్గుపడాలి' అని కాంగ్రెస్ నేత అన్నారు.



సంబంధిత వార్తలు